సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) రాష్ట్రంలో కొత్తగా అన్వేషించిన సున్నపురాయి నిల్వల నాణ్యతను తేల్చనుంది. ఈ మేరకు పల్నాడు, భీమా బేసిన్‌లో ఖనిజ అన్వేషణ సమయంలో సేకరించిన సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణ కోసం అనుభవం కలిగిన ప్రయోగశాలల మద్దతు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు ఈ బాధ్యత అప్పగించేందుకు సన్నద్ధమవుతోంది. సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణలో అనుభవం కలిగిన పరిశోధన సంస్థలకు టెండర్ విధానంలో విశ్లేషణ బాధ్యత అప్పగించనుంది.
టెండరు దాఖలుకు ఆసక్తి చూపుతున్న సంస్థలతో ఈ నెల 22న టీఎస్‌ఎండీసీ కేంద్ర కార్యాలయంలో ప్రిబిడ్ సమావేశం ఏర్పాటు చేసే యోచనలో టీఎస్‌ఎండీసీ అధికారులు ఉన్నారు. సున్నపురాయి అన్వేషణలో భాగంగా పల్నాడు బేసిన్‌లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు, భీమా బేసిన్‌లోని వికారాబాద్ జిల్లాలో సున్నపురాయి, డోలోమైట్ నిల్వలను టీఎస్‌ఎండీసీ గుర్తించింది. సేకరించిన నమూనాల్లో ఇసుక, ఇతర ఖనిజాల శాతాన్ని తేల్చడంతోపాటు సున్నపురాయి నాణ్యతను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం టీఎస్‌ఎండీసీ వద్ద లేకపోవడంతో ప్రైవేటు ప్రయోగశాలలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగశాలల నుంచి నాణ్యత నివేదికలు అందిన తర్వాత ఆయా బేసిన్‌ల పరిధిలో సర్వే జరిపి నిర్ధారణకు వస్తారు. నాణ్యత, పరిమాణంపై స్పష్టత వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ యాక్ట్ (ఎన్‌ఎండీఏ) నిబంధనల మేరకు వేలం విధానంలో సున్నపురాయి బ్లాక్‌లు కేటాయించే యోచనలో టీఎస్‌ఎండీసీ ఉంది.
ఇతర రాష్ట్రాల్లోనూ సున్నపురాయి అన్వేషణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు టీఎస్‌ఎండీసీ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇసుక విక్రయాల ద్వారా రూ.2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా టీఎస్‌ఎండీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు రాష్ట్రం బయట 17 బ్లాక్‌లలో సున్నపురాయి అన్వేషణపై దృష్టి పెట్టగా, ఇప్పటికే జార్ఖండ్, ఒడిశాలోని మూడు బ్లాక్‌ల్లో సున్నపురాయి అన్వేషణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాల్సిందిగా కేంద్రం.. టీఎస్‌ఎండీసీని కోరింది.
సున్నపురాయి నాణ్యతపై పరిశోధన
Published Wed, Apr 17 2019 2:40 AM | Last Updated on Wed, Apr 17 2019 2:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment