రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలో డిసెంబర్ 1 నుంచి కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలో డిసెంబర్ 1 నుంచి కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి ఒక్క కార్యకలాపాలను ఆన్‌లైన్ (ఈ-ఆఫీస్) ద్వారానే కొనసాగించాలని తీర్మానించింది. ఈ అంశంపై మంగళవారం టీఎస్‌ఎండీసీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరిసుభాష్‌రెడ్డిసహా అధికారులంతా ల్యాప్‌టాప్‌ల ద్వారా గనుల శాఖలో అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కార్యకలాపాలు, ఇసుక కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలను చేపడుతుండటంతో అటు ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ శేరిసుభాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టీఎస్‌ఎండీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.