e office
-
24 గంటలు అందుబాటులో ఉండాలనే ‘ఈ-ఆఫీస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం రాజ్ భవన్లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్‌భవన్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటుందని తెలిపారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళనపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల్లో మంచి అంశాలున్నాయన్నారు. విపక్షాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలపై భిన్న అభిప్రాయాలు ఉండొచ్చుని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆశించారు. తెలంగాణ, తమిళనాడు నాకు రెండు కళ్లు. ప్రజాసేవ చేయడానికి సరిహద్దులు లేవు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ కంట్రోల్లోనే ఉందన్నారు తమిళిసై. (చదవండి: దేశ ధాన్యాగారంగా తెలంగాణ) -
ఇక ఈ–ఆఫీస్
సాక్షి, హైదరాబాద్: కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాలన వ్యవహారాల్లో భౌతికంగా మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో ‘ఈ–ఆఫీస్’విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. భౌతికంగా ఫైళ్లను ఒక చోట నుంచి మరో చోటకి సర్క్యులేట్ చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండడంతో ‘ఈ–ఆఫీస్’సాఫ్ట్వేర్ ద్వారానే ఇకపై ఫైళ్లను సర్క్యులేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు పారదర్శకత, విశ్వసనీయత కూడా పెరగనుందని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ విభాగాల్లో తొలుత ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టనుంది. అనంతరం ఇతర అన్ని శాఖలకు విస్తరింపజేయనుంది. ఈ–ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇప్పటికే సిద్ధం కాగా, క్షేత్ర స్థాయిల్లో అన్ని జిల్లాల్లో దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వివరాలతో మాస్టర్ డేటాబేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగుల పేరు, కోడ్, లింగం, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, పాన్, మొబైల్ నంబర్లు, మెయిల్ లాగిన్ ఐడీ, జాయినింగ్ తేదీ, రిటైర్మైంట్ తేదీ, శాఖ పేరు, హోదా, రెగ్యూలర్/తాత్కాలిక, రిపోర్టింగ్ ఆఫీసర్ తదితర అన్ని వివరాలు ఇందులో ఉండనున్నాయి. ఈ–ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి విధులు నిర్వహించేందుకు వీలుగా ఉద్యోగులకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయించనున్నారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ ఆఫీస్‌లోకి ప్రవేశించి డిజిటల్ ఫైళ్ల సృష్టి, నిర్వహణలతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. ప్రతీ అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ కీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దాంట్లోని డేటా, సమాచారం, ఇతర ఫైళ్లు టాంపర్‌కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఈ సాఫ్ట్వేర్ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్తోపాటు ఈ ముద్ర అప్లికేషన్ ద్వారా వాళ్ళ డిజిటల్ సంతకాలను ఈ నెల 7లోగా సేకరించి సిద్ధంగా ఉంచాలని, ఇందుకోసం 6లోగా ప్రతి శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8లోగా ఫైళ్ల డిజిటలైజేషన్, 9లోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసి, జూలై రెండోవారం నుంచే ఈ–ఆఫీస్ ద్వారా ఆన్లైన్ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరగనున్న పారదర్శకత... రాష్ట్ర సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాల యం నుంచి జిల్లా, మండల స్థాయి వరకు పరిపాలన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయంలో సెక్షన్ అధికారి నుంచి కార్యదర్శి స్థాయి వరకు అధికారుల హైరార్కీ మ్యాపింగ్ నిర్వహిస్తోంది. మామూలు పరిస్థితుల్లో లాగా రోజువారీ ఫైళ్ల నిర్వహణలో గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైళ్ల కదలిక నిరంతరం తెలిసేలా, నిర్దిష్ట సమయంలో అది ఏ అధికారి దగ్గర ఉంది, ఫైల్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది తదితర వివరాలను ట్రాక్ చేసేలా, ఫైళ్ల నిర్వహణ పారదర్శకంగా జరిగేలా ఈ– ఆఫీస్ దోహదపడుతుంది. ఫైల్ కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్లో వచ్చే అలెర్ట్‌ల ద్వారా, లేదా ఈ మెయిళ్ల ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ఆఫీస్‌ను త్వరలో అన్ని శాఖల్లో అమలుచేసి, అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. -
‘ఈ’–జిల్లా!
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లాను ‘ఈ–జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కాగిత రహిత, జాప్యంలేని సేవలు అందించడం ద్వారా ప్రజల మెప్పు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్, ఆన్లైన్ పద్ధతుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలను కూడా పూర్తిస్థాయి ఈ–ఆఫీసులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతి ఆఫీసు నుంచి ఈ–ఆఫీస్‌కు అవసరమైన ప్రతిపాదనలు కోరుతూ వర్తమానం పంపించారు. ఆఫీసుకు మంజూరైన పోస్టులు, పోస్టుల వారీగా ఎన్ని కంప్యూటర్లు అవసరం, ఎన్ని ఫైళ్లు స్కాన్ చేయాలి తదితర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత హెచ్ఓడీలకు పంపాల్సిందిగా సూచించారు. మొదట ఆయా విభాగాల్లోని ఫైళ్లను పూర్తిగా స్కాన్ చేసి..ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేస్తారు. తద్వారా అన్ని కార్యకలాపాలు ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు రెవెన్యూ విభాగంలో ఇప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు, సేవలు ఎలక్ట్రానిక్ మెథడ్‌లోనే జరుగుతున్నాయి. కలెక్టరేట్లో పూర్తిస్థాయిలో... జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్ పద్ధతిలోనే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. జూన్ ఒకటి నుంచి ఈ–ఆఫీస్‌ను అమలు పర్చనున్నట్లు ఇటీవల కలెక్టర్ యోగితా రాణా వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటికే కొన్ని పరిపాలన పరమైన అంశాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఆన్లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. కాగా, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు ఈ–ఆఫీస్ నిర్వహణను పూర్తి స్థాయిలో ఆచరించాల్సిందేని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని మానిటరింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫైళ్లన్నీ చకచకా స్కానింగ్ చేస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పెండింగ్‌కు చెక్ పాలన పరమైన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్ అమలుతో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లకు మోక్షం లభించే అవకాశాలుంటాయని అధికారయంత్రాంగం భావిస్తోంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని యోచిస్తోంది. ముఖ్యంగా పారదర్శకతతో సమస్యల పరిష్కారంలో వేగం కూడా పెరుగుతుందని భావిస్తోంది. దీంతో ముందుగా కలెక్టరేట్లో పూర్తి స్థాయి అమలు శ్రీకారం చుడుతోంది. అ తర్వాత రెవెన్యూ యంత్రాంగంలో క్షేత్ర స్థాయి నుంచి ఈ– ఆఫీస్ అమలుకు ప్రయత్నం ప్రారంభిస్తారు. -
ఈ–ఆఫీసు మారదు బాసూ!
అనంతపురం అర్బన్: ఈ–ఆఫీసు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు అవుతున్నాయి. నెల రోజులు గడిచినా పురోగతి లేకపోవడం చూస్తే ప్రభుత్వ శాఖల్లో అధికారుల తీరు అర్థమవుతోంది. జిల్లాలో మొత్తం 116 ప్రభుత్వ శాఖలు ఈ–ఆఫీసు నిర్వహిస్తుండగా.. గత నెలలో అన్ని శాఖలు కలిపి 6,196 ఫైళ్లను మాత్రమే ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 1,146 ఫైళ్లు.. మునిసిపల్ కార్పొరేషన్ 227, ఎస్ఈ హెచ్ఎల్సీ 429, ఇరిగేషన్ సర్కిల్ 417, జిల్లా పోలీసు కార్యాలయం 425 ఫైళ్లు ఈ–ఆఫీసులో నిర్వహించాయి. ఇక మిగతా శాఖలు రెండంకెలు కూడా దాటకపోవడం గమనార్హం. రోజూ ప్రతి శాఖలో కనీసం పది ఫైళ్లు సిద్ధం అవుతుంటాయి. ఈ లెక్కన రోజుకు కనీసంగా వెయ్యి ఫైళ్లు, నెలలో 30వేల ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించాల్సి ఉండగా పురోగతి లోపించింది. గత వారం రోజుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఈ నెల 7న డీఆర్ఓ డీఆర్వో ఎస్.రఘునాథ్సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని శాఖలు వారంలో ఒక్కఫైలు కూడా ఈ ఆఫీసు ద్వారా పంపలేదనే విషయం వెల్లడైంది. ఆయా శాఖల అధికారులను ప్రశ్నించగా మౌనమే సమాధానమైనట్లు తెలిసింది. పురోగతి సున్నా గత వారం ఈ–ఆఫీసు ద్వారా కొన్ని శాఖలు ఒక్క ఫైలును కూడా పంపలేకపోయాయి. ఇందులో ప్రధానంగా కార్మిక శాఖ, జిల్లా వృత్తి విద్యాశాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, మెప్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుప్రతి, మైనారిటీ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, గనుల శాఖ, వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటర్మీడియేట్ విద్యా శాఖ, ఎన్టీఆర్ వైద్యసేవ, ఆడిట్ శాఖ, ఇలా దాదాపు 44 శాఖలు వారం వ్యవధిలో ఒక్క ఫైలూ నిర్వహించలేదని డీఆర్వోలో పరిశీలనలో వెలుగుచూసింది. పలు ధఫాలు శిక్షణ ఇచ్చినా.. కోర్టు కేసులకు సంబంధించిన ఫైళ్లు మినహా జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. ఒక్కసారి కాదు.. పలు దఫాల శిక్షణ పూర్తయింది. ఆ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి వచ్చిన సందేహాలనూ నివృత్తి చేశారు. ఈ–ఆఫీసు నిర్వహణలో దొర్లుతున్న పొరపాట్లను స్వయంగా కలెక్టర్ జి.వీరపాండియన్ పలుమార్లు ‘మీ కోసం’ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమీక్షలో అధికారులకు వివరించారు. నోట్‌ఫైల్ ఎలా ఉంచాలి, పాత ఫైళ్లను స్కానింగ్ చేయడం తదితరాల్లో తప్పులను తెలియజేస్తూ ఎలా సరిద్దుకోవాలనే విషయాన్ని కూడా తెలిపారు. నిర్వహణలో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతుంటే ఎన్నిసార్లయినా శిక్షణనిస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ పలు శాఖలు ఈ–ఆఫీసు విషయంలో నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి. ‘మాన్యువల్’ మతలబు ఈ–ఆఫీసు నిర్వహణ తీరు చూస్తే కొన్ని శాఖలు ముఖ్యమైన ఫైళ్లను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నాయనేది స్పష్టమవుతోంది. ఇలా నిర్వహించడం వెనుక ‘మతలబు’ వ్యవహారం ఉన్నట్లు విమర్శులు వినవస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలకు తావిచ్చే ఫైళ్లను కొందరు అధికారులు మాన్యువల్‌గా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహిస్తే ‘లాభం’ లేకుండా పోతుందనే ఉద్దేశంతో కొందరు మాన్యువల్‌గా ఫైళ్లను కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తీవ్రంగా పరిగణిస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వశాఖలన్నీ ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. ఈ–ఆఫీసును విస్మరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి అధికారుల పనితీరును ప్రభుత్వానికి నివేదిస్తాం. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.-ఎస్.రఘునాథ్, జిల్లా రెవెన్యూ అధికారి -
పేపర్‌లెస్ పోలీసింగ్
దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ లేనటువంటి ‘ఈ–ఆఫీస్’ విధానం మంగళవారం నుంచి సిటీలో అందుబాటులోకి రానుంది. ఇకపై పేపర్‌లెస్ పద్ధతిలోనే కార్యకలాపాలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఫైళ్లు, పిటిషన్లు ఈ మెయిల్స్ రూపంలోనే పరస్పర మార్పిడి జరుగుతుంది. పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. సాక్షి,సిటీబ్యూరో: దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ అమలులో లేని ఈ–ఆఫీస్ విధానం మంగళవారం నుంచి నగరంలో అందుబాటులోని రానుంది. దీనికి సంబం«ధించి ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి జోనల్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా సహాయక బృందాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పేపర్ లెస్ విధానం అమలుతో ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే అవుతుందని నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో జరిగే అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదుగానే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి పిటిషన్ల నుంచి అనుమతులు కోరుతూ వచ్చే దరఖాస్తుల వరకు ప్రతి ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది కాగితాల రూపంలోనే సాగుతుండటంతో ఏటా క్వింటాళ్ల కొద్దీ పేపర్లు వాడాల్సి వస్తోంది. మరోపక్క సదరు ఫైల్ ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టసాధ్యం. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక అప్లికేషన్లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులు సైతం ఇలానే డిజిటల్ డాక్యుమెంట్‌గా మారిపోతా యి. ఒకరి నుంచి మరొకరికి మార్పిడి మొత్తం ఈ–మెయిల్స్ ద్వారానే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను తన కంప్యూటర్ తెరపైనే చూస్తూ మానిటర్ చేసుకోవచ్చు. ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లోని ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్స్ బారినపడకుండా పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయించారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్లైన్లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. జవాబుదారీతనం, వేగం ఎకో ఫ్రెండ్లీ, పేపర్ లెస్‌గా ఉండే ఈ–ఆఫీస్ విధానం అమలు చేయడంతో నగర పోలీసు విభాగం ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే. గత 35 రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నాం. ప్రతి పిటిషన్, ఫైల్ డిజిటల్ రూపంలో ఉండే ఈ సరికొత్త విధానంతో జవాబుదారీతనంతో పాటు పని వేగం సైతం పెరుగుతుంది. ఈ విధానంతో మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. వీటిని పరిష్కరించడానికి ప్రతి డీసీపీ ఆధీనంలో బ్యాక్ఎండ్ టీమ్, హెల్ప్ డెస్క్‌ల్ని ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఈ విధానం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. – అంజినీ కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ -
నో ఆఫ్‌లైన్..ఓన్లీ ఆన్లైన్
కందుకూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ–ఆఫీస్ విధానంతో పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గించడం, కార్యాలయాల్లో దుబారాను తగ్గించడం తదితర లక్ష్యాలతో అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితపు ఫైల్స్ విధానానికి స్వస్తి పలకనున్నారు. కొత్త విధానం పట్ల కొందరు అధికారుల్లో ఆందోళన ఉన్నా భవిష్యత్‌లో అంతా సవ్యంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైల్స్ అన్నీఈ–ఫైలింగ్ విధానంలోనే... ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనకు కాగితపు ఫైల్ విధానం అమలవుతోంది. దీని వల్ల అధికారులకు శ్రమతో పాటు, పాలనలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన కందుకూరు లాంటి డివిజన్లో ఈ సమస్య మరింత అధికం. మండల కేంద్రాల నుంచి డివిజన్ కేంద్రమైన కందుకూరుకు వచ్చి ఫైల్స్‌పై సంతకాలు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఫైల్స్ ఇద్దరు ముగ్గురు అధికారుల వద్ద నుంచి చేతుల మారి వచ్చే సరికి నెలల సమయం పడుతోంది. జిల్లా కేంద్రంతోఅనుసంధానమైన ఫైల్స్‌కు ఇదే పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడం శ్రమతో కూడుకున్న పనిగా ఉంది. అదే సందర్భంలో పాలనలో అవినీతి ప్రధాన సమస్యగా మారిపోయింది. అలాగే కాగితపు ఫైల్స్ వల్ల కార్యాలయాలకు అవుతున్న ఖర్చుతో పాటు, దుబారా అధికంగానే ఉంటుంది. వివిధ కారణలతో ఫైల్ ఏ అధికారి వద్ద నిలిచి ఉందో అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఫైల్ చంకన పెట్టుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి ఇక చరమగీతం పాడనున్నారు. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈ–ఫైలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇక ప్రతి ఫైల్‌ను ఈ విధానంలోనే పరిష్కరించాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కాగితాల మీద జరిగిన కార్యకలాపాలు మొత్తం ఇక నుంచి ఆన్లైన్లోనే జరపాల్సి ఉంది. భూమి సమస్యలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మీ–సేవ అర్జీలు, ల్యాండ్ కన్వర్షన్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్ ఇలా ప్రతి ఫైల్‌ను ఇక నుంచి ఈ–ఫైలింగ్ విధానంలోనే పరిష్కరించాలి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు ఈ విధానానికి అలవాటు పడాల్సి ఉంది. ఈ–ఫైలింగ్‌లో కందుకూరు మొదటి స్థానం:ఇప్పటికే ఈ–ఫైలింగ్ విధానంపై మూడు నెలలుగా అధికారులకు శిక్షణ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలు ఈ విధానంలో అధికారులు పరిష్కరించారు. ఈ–ఫైల్ విధానంలో కందుకూరు రెవెన్యూ డివిజన్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా మొత్తం మీద 4,678 ఫైల్స్ పరిష్కారం కాగా, కందుకూరు డివిజన్లోని 24 మండలాల్లో 2729 ఫైల్స్, డివిజన్ కేంద్రమైన ఆర్డీఓ పరిధిలో 1041 ఫైల్స్ ఈ విధానంలో పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఒంగోలు ఆర్డీఓ పరిధిలో 311 ఫైల్స్, మార్కాపురం ఆర్డీఓ పరిధిలో 597 ఫైల్స్ ఈ ఫైల్ విధానంలో పరిష్కరించారు. ఇక నుంచి ప్రతి ఫైల్ ఆన్లైన్లోనే కదలాల్సి ఉంది. పాలనలో పారదర్శకత పెరుగుతుంది ప్రభుత్వ పాలనలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఫైల్ విధానం అమల్లోకి వచ్చింది. దీని వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుంది. అనవసర జాప్యం, దుబారా తగ్గుతుంది. నిర్ణీత సమయంలోనే సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ జాప్యం అయితే ఎవరి వద్ద జాప్యం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే కొత్త విధానానికి అధికారులు, సిబ్బంది అలవాటు పడాలి. ఇక నుంచి ప్రతి ఫైల్‌ను కచ్చితంగా ఈ–ఫైల్ విధానంలోనే పంపాలి. – మల్లికార్జున, కందుకూరు ఆర్డీఓ -
గనుల శాఖలో కాగిత రహిత పాలన !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలో డిసెంబర్ 1 నుంచి కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి ఒక్క కార్యకలాపాలను ఆన్లైన్ (ఈ-ఆఫీస్) ద్వారానే కొనసాగించాలని తీర్మానించింది. ఈ అంశంపై మంగళవారం టీఎస్ఎండీసీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన టీఎస్ఎండీసీ చైర్మన్ శేరిసుభాష్రెడ్డిసహా అధికారులంతా ల్యాప్‌టాప్‌ల ద్వారా గనుల శాఖలో అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కార్యకలాపాలు, ఇసుక కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలను చేపడుతుండటంతో అటు ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ శేరిసుభాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టీఎస్ఎండీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఈ– ఆఫీసులను వేగవంతం చేయండి
– మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు కర్నూలు(టౌన్): కాగిత రహిత పాలనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఈ– ఆఫీసులను అమల్లోకి తీసుకొస్తుందని, ఆ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్ర డైరెక్టర్ కన్నబాబు ఆదేశించారు. శనివారం ఆయన సాయంత్రం స్థానిక నగరపాలకలో మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలు, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించేందుకు ఈ – ఆఫీసు పాలన ఎంతో ఉపయోగకరమన్నారు. పాలనలో జవాబుదారీ తనం, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. అలాగే కర్నూలు నగరంలో రూ.కోట్లతో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బిల్లుల్లో జాప్యం వల్ల పనులు సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మరోసారి ఈ పరిస్థితి పునరావృతం కానివ్వొదన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, ఇంజనీరింగ్ అధికారులు శివరామిరెడ్డి, రాజశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో ఇ–ఆఫీస్ ప్రారంభం
సాక్షి,సిటీబ్యూరో: పేపరు లెస్ కార్యాలయం లక్ష్యంగా శనివారం కలెక్టరేట్లో ఇ–ఆఫీస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్లోని తొమ్మిది విభాగాల ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని స్కాన్ చే సి, వాటిని భద్రపరిచే చర్యలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ భారతి హోళికేరి, ఏజేసీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.