పేపర్‌లెస్‌ పోలీసింగ్‌ | E Office In All Police Stations : CP Anjani Kumar | Sakshi
Sakshi News home page

పేపర్‌లెస్‌ పోలీసింగ్‌

Published Tue, May 1 2018 1:22 PM | Last Updated on Tue, May 1 2018 1:22 PM

E Office In All Police Stations : CP Anjani Kumar - Sakshi

దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ లేనటువంటి ‘ఈ–ఆఫీస్‌’ విధానం మంగళవారం నుంచి సిటీలో అందుబాటులోకి రానుంది. ఇకపై పేపర్‌లెస్‌ పద్ధతిలోనే కార్యకలాపాలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఫైళ్లు, పిటిషన్లు ఈ మెయిల్స్‌ రూపంలోనే పరస్పర మార్పిడి జరుగుతుంది. పేపర్‌ లెస్‌ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్‌ రూపంలోకి మారిపోతాయి.

సాక్షి,సిటీబ్యూరో: దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ అమలులో లేని ఈ–ఆఫీస్‌ విధానం మంగళవారం నుంచి నగరంలో అందుబాటులోని రానుంది. దీనికి సంబం«ధించి ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి జోనల్‌ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా సహాయక బృందాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పేపర్‌ లెస్‌ విధానం అమలుతో ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే అవుతుందని నగర పోలీసు కమిషనర్‌ అంజినీ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో జరిగే అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదుగానే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి పిటిషన్ల నుంచి అనుమతులు కోరుతూ వచ్చే దరఖాస్తుల వరకు ప్రతి ఫైల్‌ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది కాగితాల రూపంలోనే సాగుతుండటంతో ఏటా క్వింటాళ్ల కొద్దీ పేపర్లు వాడాల్సి వస్తోంది. మరోపక్క సదరు ఫైల్‌ ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టసాధ్యం. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ అంజినీ కుమార్‌ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి అమలులోకి వస్తున్న పేపర్‌ లెస్‌ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్‌ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్‌ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక అప్లికేషన్‌లో పొందుపరుస్తారు.

అక్కడ నుంచి ఈ పిటిషన్‌ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్‌ అధికారులకు వచ్చిన దరఖాస్తులు సైతం ఇలానే డిజిటల్‌ డాక్యుమెంట్‌గా మారిపోతా యి. ఒకరి నుంచి మరొకరికి మార్పిడి మొత్తం ఈ–మెయిల్స్‌ ద్వారానే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్‌/పిటిషన్‌ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను తన కంప్యూటర్‌ తెరపైనే చూస్తూ మానిటర్‌ చేసుకోవచ్చు. ఈ–ఆఫీస్‌ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చారు. 

ఆన్‌లైన్‌లోని ఈ–ఆఫీస్‌ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్స్‌ బారినపడకుండా పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు డిజిటల్‌ సిగ్నేచర్‌ కేటాయించారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదయ్యే కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్‌ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది.

జవాబుదారీతనం, వేగం
ఎకో ఫ్రెండ్లీ, పేపర్‌ లెస్‌గా ఉండే ఈ–ఆఫీస్‌ విధానం అమలు చేయడంతో నగర పోలీసు విభాగం ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే. గత 35 రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నాం. ప్రతి పిటిషన్, ఫైల్‌ డిజిటల్‌ రూపంలో ఉండే ఈ సరికొత్త విధానంతో జవాబుదారీతనంతో పాటు పని వేగం సైతం పెరుగుతుంది. ఈ విధానంతో మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. వీటిని పరిష్కరించడానికి ప్రతి డీసీపీ ఆధీనంలో బ్యాక్‌ఎండ్‌ టీమ్, హెల్ప్‌ డెస్క్‌ల్ని ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఈ విధానం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. – అంజినీ కుమార్, సిటీ పోలీస్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement