అనంతపురం అర్బన్: ఈ–ఆఫీసు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు అవుతున్నాయి. నెల రోజులు గడిచినా పురోగతి లేకపోవడం చూస్తే ప్రభుత్వ శాఖల్లో అధికారుల తీరు అర్థమవుతోంది. జిల్లాలో మొత్తం 116 ప్రభుత్వ శాఖలు ఈ–ఆఫీసు నిర్వహిస్తుండగా.. గత నెలలో అన్ని శాఖలు కలిపి 6,196 ఫైళ్లను మాత్రమే ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 1,146 ఫైళ్లు.. మునిసిపల్ కార్పొరేషన్ 227, ఎస్‌ఈ హెచ్‌ఎల్‌సీ 429, ఇరిగేషన్ సర్కిల్ 417, జిల్లా పోలీసు కార్యాలయం 425 ఫైళ్లు ఈ–ఆఫీసులో నిర్వహించాయి. ఇక మిగతా శాఖలు రెండంకెలు కూడా దాటకపోవడం గమనార్హం. రోజూ ప్రతి శాఖలో కనీసం పది ఫైళ్లు సిద్ధం అవుతుంటాయి. ఈ లెక్కన రోజుకు కనీసంగా వెయ్యి ఫైళ్లు, నెలలో 30వేల ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించాల్సి ఉండగా పురోగతి లోపించింది. గత వారం రోజుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఈ నెల 7న డీఆర్‌ఓ డీఆర్వో ఎస్.రఘునాథ్‌సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని శాఖలు వారంలో ఒక్కఫైలు కూడా ఈ ఆఫీసు ద్వారా పంపలేదనే విషయం వెల్లడైంది. ఆయా శాఖల అధికారులను ప్రశ్నించగా మౌనమే సమాధానమైనట్లు తెలిసింది.
పురోగతి సున్నా
గత వారం ఈ–ఆఫీసు ద్వారా కొన్ని శాఖలు ఒక్క ఫైలును కూడా పంపలేకపోయాయి. ఇందులో ప్రధానంగా కార్మిక శాఖ, జిల్లా వృత్తి విద్యాశాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, మెప్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుప్రతి, మైనారిటీ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, గనుల శాఖ, వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటర్మీడియేట్ విద్యా శాఖ, ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఆడిట్ శాఖ, ఇలా దాదాపు 44 శాఖలు వారం వ్యవధిలో ఒక్క ఫైలూ నిర్వహించలేదని డీఆర్వోలో పరిశీలనలో వెలుగుచూసింది.
పలు ధఫాలు శిక్షణ ఇచ్చినా..
కోర్టు కేసులకు సంబంధించిన ఫైళ్లు మినహా జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. ఒక్కసారి కాదు.. పలు దఫాల శిక్షణ పూర్తయింది. ఆ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి వచ్చిన సందేహాలనూ నివృత్తి చేశారు. ఈ–ఆఫీసు నిర్వహణలో దొర్లుతున్న పొరపాట్లను స్వయంగా కలెక్టర్ జి.వీరపాండియన్ పలుమార్లు ‘మీ కోసం’ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమీక్షలో అధికారులకు వివరించారు. నోట్‌ఫైల్ ఎలా ఉంచాలి, పాత ఫైళ్లను స్కానింగ్ చేయడం తదితరాల్లో తప్పులను తెలియజేస్తూ ఎలా సరిద్దుకోవాలనే విషయాన్ని కూడా తెలిపారు. నిర్వహణలో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతుంటే ఎన్నిసార్లయినా శిక్షణనిస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ పలు శాఖలు ఈ–ఆఫీసు విషయంలో నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి.
‘మాన్యువల్’ మతలబు
ఈ–ఆఫీసు నిర్వహణ తీరు చూస్తే కొన్ని శాఖలు ముఖ్యమైన ఫైళ్లను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నాయనేది స్పష్టమవుతోంది. ఇలా నిర్వహించడం వెనుక ‘మతలబు’ వ్యవహారం ఉన్నట్లు విమర్శులు వినవస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలకు తావిచ్చే ఫైళ్లను కొందరు అధికారులు మాన్యువల్‌గా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహిస్తే ‘లాభం’ లేకుండా పోతుందనే ఉద్దేశంతో కొందరు మాన్యువల్‌గా ఫైళ్లను కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తీవ్రంగా పరిగణిస్తున్నాం
జిల్లాలోని ప్రభుత్వశాఖలన్నీ ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. ఈ–ఆఫీసును విస్మరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి అధికారుల పనితీరును ప్రభుత్వానికి నివేదిస్తాం. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.-ఎస్.రఘునాథ్, జిల్లా రెవెన్యూ అధికారి
Comments
Please login to add a commentAdd a comment