సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లాను ‘ఈ–జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కాగిత రహిత, జాప్యంలేని సేవలు అందించడం ద్వారా ప్రజల మెప్పు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ పద్ధతుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలను కూడా పూర్తిస్థాయి ఈ–ఆఫీసులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతి ఆఫీసు నుంచి ఈ–ఆఫీస్‌కు అవసరమైన ప్రతిపాదనలు కోరుతూ వర్తమానం పంపించారు.
ఆఫీసుకు మంజూరైన పోస్టులు, పోస్టుల వారీగా ఎన్ని కంప్యూటర్లు అవసరం, ఎన్ని ఫైళ్లు స్కాన్ చేయాలి తదితర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత హెచ్‌ఓడీలకు పంపాల్సిందిగా సూచించారు. మొదట ఆయా విభాగాల్లోని ఫైళ్లను పూర్తిగా స్కాన్ చేసి..ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. తద్వారా అన్ని కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు రెవెన్యూ విభాగంలో ఇప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు, సేవలు ఎలక్ట్రానిక్ మెథడ్‌లోనే జరుగుతున్నాయి.
కలెక్టరేట్‌లో పూర్తిస్థాయిలో...
జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్ పద్ధతిలోనే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. జూన్ ఒకటి నుంచి ఈ–ఆఫీస్‌ను అమలు పర్చనున్నట్లు ఇటీవల కలెక్టర్ యోగితా రాణా వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటికే కొన్ని పరిపాలన పరమైన అంశాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. కాగా, కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు ఈ–ఆఫీస్ నిర్వహణను పూర్తి స్థాయిలో ఆచరించాల్సిందేని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని మానిటరింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫైళ్లన్నీ చకచకా స్కానింగ్ చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
పెండింగ్‌కు చెక్
పాలన పరమైన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్ అమలుతో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లకు మోక్షం లభించే అవకాశాలుంటాయని అధికారయంత్రాంగం భావిస్తోంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని యోచిస్తోంది. ముఖ్యంగా పారదర్శకతతో సమస్యల పరిష్కారంలో వేగం కూడా పెరుగుతుందని భావిస్తోంది. దీంతో ముందుగా కలెక్టరేట్‌లో పూర్తి స్థాయి అమలు శ్రీకారం చుడుతోంది. అ తర్వాత రెవెన్యూ యంత్రాంగంలో క్షేత్ర స్థాయి నుంచి ఈ– ఆఫీస్ అమలుకు ప్రయత్నం ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment