సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన కొత్త పుంతలు తొక్కనుంది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘స్మార్ట్’గా పరిపాలన నిర్వహించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి ఈ దిశగా సరికొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తరహాలో సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ కంట్రోల్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు.
ఇందులో భాగంగా గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతి సమాచారం అందుబాటులో ఉండేలా డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. తదుపరి ప్రక్రియలో గ్రామ, జిల్లాస్థాయి నుంచి ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును సచివాలయం నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పనుల పురోగతి, నీటి నిల్వలు, నీటి విడుదల తదితర వివరాలన్నీ సచివాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా డిజిటల్ మానిటరింగ్ విధానంలో జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలను సచివాలయం నుంచే అనుసంధానిస్తారు. ఇంటిగ్రేటేడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో కొత్త పరిపాలన విధానానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.
సిమ్ కార్డులు.. స్మార్ట్ ఫోన్లు
స్మార్ట్ పరిపాలనలో భాగంగా అధికారులందరికీ స్మార్ట్‌ఫోన్లు, శాశ్వత సిమ్ కార్డులు అందించనున్నారు. సీఎస్, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల హెచ్‌వోడీలు మొదలు కలెక్టర్లు, జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులంద రూ ఒకే నెట్‌వర్క్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ ఐడియా సిమ్ కార్డులను అందజేయాలని నిర్ణయించారు. 711 సిరీస్‌తో ఈ నంబర్లు ప్రారంభమవుతాయి. అధికారులు బదిలీపై వెళ్లినా ఆ హోదాలో ఉన్న అధికారికి తిరిగి అదే నంబర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ప్రజలకు అధికారుల నంబర్లు తెలియడంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునే వీలుంటుందని భావిస్తున్నారు. వేగంగా సమాచార మార్పిడి జరిగేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. స్మార్ట్‌ఫోన్లను సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. అత్యవసరమైతే నేరుగా సీఎస్ సంబంధిత అధికారితో వీడియో కాల్‌లో మాట్లాడేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment