ఉక్కిరిబిక్కిరి
- పరిశ్రమల నుంచి ఘాటు వాసనలు
- ఊపిరాడక జనం సతమతం
- రోగాల బారిన పడుతున్న స్థానికులు
- పట్టించుకోని అధికారులు
తూప్రాన్:పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో వెలువడుతున్న ఘాటు వాసనలకు ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే వారు ఊపిరి పీల్చుకోలేక సతమతమవుతున్నారు. మండలంలోని రంగాయిపల్లి, కాళ్లకల్, కూచారం, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు వందకుపైగా పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది.
సదరు పరిశ్రమల నుంచి నిత్యం ఘాటు వాసనలతో ముక్కుపుటా లు అదిరిపోతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వాసనలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం గల పల్లెల్లో పరిశ్రమలు చిచ్చుపెడుతున్నాయి. ఉదయం వేళల్లో కంటే రాత్రి వేళల్లోనే పరిశ్రమల నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని అధికారులు ముందస్తుగా పరిశ్రమల యాజమాన్యాలకు ఉప్పందిస్తున్నారు. మొక్కుబడి దాడులతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ వాసనలు భరించలేక చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. ఈ వాసనలను పీల్చుకోవడం వల్ల తలనొప్పి, కడుపులో తిప్పినట్లు, వాంతులు కావడం, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. రాత్రి సమయాల్లో వ్యర్థ రసాయనాలు వదిలే పరిశ్రమలపై నిఘా పెట్టాల్సిన అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం వాసుల ఇబ్బందులు వర్ణనాతీతం. స్టీల్ పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమీప గ్రామాల వారు చెబుతున్నారు. పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై పీసీబీ అధికారి నరేందర్‌ను ‘సాక్షి’ ఫో¯Œన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
రోగాలబారిన పడుతున్నాం..
రాత్రి వేళల్లో పరిశ్రమల నుంచి ఘాటు వాసనలు వెలువడుతున్నాయి. ఈ వాసనను పీల్చుకుంటే రోగాలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో చాలా దూరం వరకు ఈ వాసనలు వస్తున్నాయి. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు.
– మహేష్, రంగాయిపల్లి
ఇబ్బందులు పడుతున్నాం..
పరిశ్రమల నుంచి వదులుతున్న వ్యర్థ రసాయనాల ఘాటు వాసనలు పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. పలు రోగాలు వస్తున్నాయి. వాసనకు రాత్రి వేళల్లో నిద్రపట్టడం లేదు. ఇలాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి.
– శ్రీకాంత్, చెట్ల గౌరారం
సమస్య పట్టని అధికారులు..
వాయు కాలుష్యన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిశ్రమల నుంచి ఇష్టానుసారంగా వ్యర్థ రసాయన వాయువులు బయటకు వదులుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. – గణేశ్, రంగాయిపల్లి
పరిశ్రమలను తరలించాలి..
కాలుష్యాన్ని వదిలే రసాయన పరిశ్రమలను గ్రామాలకు దూరంగా తరలించాలి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా కాలుష్యాన్ని బయటకు వదులుతున్నాయి. ఫలితంగా జనం రోగాల బారిన పడుతున్నారు.
– రవి, చెట్ల గౌరారం