ఇసుకాసురులు
⇒ నదులు, గెడ్డలకు తూట్లు
⇒ అనధికారిక తవ్వకాలు
⇒ దొడ్డిదారిన అమ్మకాలు
⇒ మామూళ్ల మత్తులో అధికారులు
⇒ కానరాని నిఘా.. కొరవడిన పర్యవేక్షణ
⇒ లూటీ చేస్తున్న ‘దేశం’ నేతలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సర్ప, పెద్దేరు, శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం,బొడ్డేరు,తాచేరు రిజర్వాయర్లలో ఆయా సాగునీటి వనరులకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇసుకను దృష్టిలో పెట్టుకుని రీచ్‌లను గుర్తించారు. అధికారికంగా గుర్తించిన రీచ్‌ల కంటే అనధికారికంగా ఇసుకతవ్వకాలు జరిగే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులిచ్చిన రీచ్‌ల్లో ఎక్కడా సీసీ కెమేరాలు లేవు. రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌తో అనుసంధానించలేదు.
ఒకరిద్దరు డ్వాక్రామహిళలు, నోరు వాయ లేని కిందిస్థాయి సిబ్బంది తప్ప ఏరీచ్‌లలోనూ చెప్పుకో తగ్గస్థాయి అధికారులు లేరు. డ్వాక్రామహిళలకు తవ్వకాలు, అమ్మకాలపై కనీస అవగాహన ఉన్నట్టుగా కన్పించదు. రీచ్‌ల కోసం ఏ సమాచారం అడిగినా వారు చెప్పే పరిస్థితులో లేరు. మీ సేవ..ఆన్‌లైన్‌లో జరిగే రిజిస్ట్రేషన్ మేరకు సాగే తవ్వకాలు, అమ్మకాల కంటే అనధికారికంగా సాగే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇష్టమొచ్చిన చోటల్లా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగిస్తూ నదులు, గెడ్డలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నుంచి సుమారు 500కు పైగా ట్రాక్టర్లు, వెయ్యికిపైగా టైరు బండ్లపై ఇసుకను ధర్జాగా తరలించు కుపోతున్నట్టుగా గుర్తించారు.
అనధికారిక తవ్వకాలు జరిగే ప్రాంతాలు..
ఏజెన్సీలో మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన మత్స్యగెడ్డవంతెన, బొకెల్లు కాజ్‌వే, రాయగడ హాస్టల్, పరదానిపుట్టుకాజ్‌వే, పాతరపుట్టు, రాళ్లగెడ్డ పరిసర ప్రాంతాలైన చెరుకుంపాలెం, భీమసింగ్, దేవారాపల్లి మండలం కిమరాం, బి.చంతాడ, వేచలం, మాడుగులమండలం వీరవల్లి, ఎస్.రాయవరం మండలం పెనుగల్లు, ధర్మవరం, పెదఉప్పలం, పాయకరావుపేట మండలం మంగవరం, సత్యవరం, అరట్లకోట, మోసయ్యపేట, ముటాఆనకట్టలు, అనకాపల్లిమండలం దిబ్బపాలెం, వెంకుపాలెం, సీతా నగరం, మూలపేట,చోడవరం మండలం విజయరామరాజు పేట, వడ్డాది, గౌరవరం, గజపతినగరం, జెన్నవరం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ వందలాది ట్రాక్టర్లు, టైరుబండ్లపై టన్నుల కొద్ది ఇసుక తరలి పోతున్నట్టుగా ‘సాక్షి’ పరిశీలన లో వెలుగుచూసింది.
సముద్ర ఇసుకను వదలడం లేదు
వ్యాపారులు సముద్రపు ఇసుకను కూడా వదలడం లేదు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డిఎల్.పురం, బోయిపాడు,పెదపీనర్ల, చినపీనర్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట, కేశవరం,పాల్మన్‌పేటల్లో సముద్రపుఇసుకను తవ్వేస్తున్నారు. ఈసుకను నదుల్లోని ఇసుకతో కలిపేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు.
’ఇలా చెప్పుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో జరుగు తున్న అక్రమాలు లెక్కకు మించే సాగుతున్నాయి. తాండవ నదిలో తుని-పాయకరావుపేట సరిహద్దు గ్రామాల్లో ఏకంగా పొక్లెయినర్లను ఉపయోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి పూట డ్వాక్రా మహిళల మాటున సాగుతున్న తవ్వకాలు రాత్రిళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. రాత్రిపూట అనధికారిక రీచ్‌లలో వందల కొద్ది లారీలు, టైర్ల బండ్లపై తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు.