GPS system
-
ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే..
టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ విధానం తొలగించడానికి ప్రధాన కారణం 'జీపీఎస్' బేస్డ్ విధానం అమలులోకి రావడమే. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి, దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. అంతకంటే ముందు దేశంలో ఈ జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను అమలులోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు సమాచారం. 2021లో ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించనున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే? జీపీఎస్ బేస్డ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది. -
GPSకు జాతీయ స్థాయిలో ప్రశంసలు
-
ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్‌లను స్కాన్ చేసేలా బార్ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు. తరలింపు.. నిర్వీర్యంపై నిఘా బయో మెడికల్ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్‌కు బార్ కోడింగ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్ కోడింగ్‌ను స్కాన్ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్ యాప్ ప్రవేశ పెట్టారు. ఈ యాప్‌లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. బయో మెడికల్ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు. జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు. వ్యర్థాలకు కలర్ కోడింగ్ ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యాగుల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్పత్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. పసుపు బ్యాగుల్లో మానవ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీర సంబంధమైన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, డ్రెస్సింగ్ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్‌్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీర్యం చేస్తారు. ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజులు, బ్లడ్ బ్యాగ్స్, యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్ వేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్‌లో సూదులు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్ బాటిల్స్, గాజు సీసాలు, ల్యాబ్ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు. అవగాహన కలిగిస్తున్నాం ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి -
ధాన్యం రవాణాకూ జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం పక్కదారులు పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బియ్యం రవాణా వాహనాలకే పరిమితమైన జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ధాన్యం రవాణా విషయంలోనూ పాటించాలని నిర్దేశించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్దేశించిన ‘మినిమం త్రెషోల్డ్ పారామీటర్స్ – ఎంటీపీస్’లో భాగంగా ధాన్యం రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్లో వచ్చే పంట నుంచే ఈ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను కేంద్రం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో ధాన్యం వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించారు. మిల్లులకు తీసుకెళ్లే వాహనాలన్నింటికీ... రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక తూకం వేసి రైస్‌మిల్లులకు పంపిస్తారు. ఈ ధాన్యం రైస్‌మిల్లులకు వెళ్లాక మిల్లింగ్ అయి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఎఫ్‌సీఐ గోదాములకు తరలుతుంది. ఈ క్రమంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మిల్లులకు ఎంత ధాన్యం వస్తోంది? మిల్లుల నుంచి బియ్యం రూపంలో గోదాములకు ఎంత పరిమాణంలో తిరిగి వెళ్తోందనే అంశంపై నిఘా కోసం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి సీజన్లో సుమారు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒక్కో కేంద్రం నుంచి మిల్లుల లభ్యతను బట్టి పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు. సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు.. బియ్యం లారీలు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు... అక్కడి నుంచి పౌరసరఫరాల దుకాణాలకు చేరేందుకు 2016లోనే జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికీ సక్రమంగా అమలు కావట్లేదు. దీన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. బియ్యం లారీల కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి ప్రతినెలా బియ్యం పంపిణీ జరుపుతుండగా దీన్నే తూతూమంత్రంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ... ధాన్యం సేకరణలో జీపీఎస్ ట్రాకింగ్ చేయడం కష్టమేనని చెబుతోంది. ఎందుకంటే ప్రతి సీజన్లో రెండు నెలలపాటు సాగే ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్న అన్ని లారీలతోపాటు గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రంలోని 130కిపైగా ఉన్న సెక్టార్ల నుంచి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపేటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే కేంద్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో వానాకాలం సీజన్ నుంచే ఎలా అమలు చేయాలనే దానిపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగే కార్యదర్శుల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
24 గంటల్లో 78 పబ్బుల్లో తాగాడు...
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విలియర్స్. 24గంటల్లో 78 పబ్బుల్లో తాగి అత్యధిక ‘పబ్ క్రాల్’ (లైసెన్సులున్న పబ్బులను సందర్శించి అన్నింట్లోనూ ఆల్కహాల్ తాగడం) చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్కరోజులో 78 పబ్బులా? ఎంత తాగి ఉంటాడో అనే కదా సంశయం. ఒక్కో పబ్బులో 125 ఎమ్ఎల్ మాత్రమే తాగాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూల్. ఆ ప్రకారమే తాగాడు. అంత తాగిన తరువాత స్టడీగా ఉన్నాడా? అంటే.. అందుకే తనకు సహాయంగా తమ్ముడు రువాల్డ్ డి విలియర్స్‌ను, ఫ్రెండ్.. వెస్సెల్ బర్గర్‌ను వెంట బెట్టుకు వెళ్లాడు. అయినా సరే... 24 గంటల్లో 78 పబ్బులకు వెళ్లడమంటే.. సాధారణ విషయం కాదు. రికార్డు కోసం మెల్బోర్న్లోని బార్స్ గురించి బాగా రీసర్చ్ చేసి.. ముగ్గురూ పక్కాగా రూట్‌మ్యాప్ ప్లాన్ చేసుకున్నారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో గమ్యస్థానాన్ని చేరుకుని రికార్డ్ బ్రేక్ చేశారు. -
'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం ఫాస్టాగ్ వ్యవస్థకు మంగళం పాడనుంది. అవును.. ఫాస్టాగ్ కథ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగియబోతోంది. మరి టోల్ చార్జీల వసూలు ఎలాగంటారా? అందుకోసం కొత్త పద్ధతిని ఆచరించబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలియజేసింది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో.. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ వసూలు చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పుటికే ఈ జీపీఎస్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం, ఒక టోల్ ప్లాజా నుండి మరొక టోల్ ప్లాజాకు మొత్తం దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ జీపీఎస్ టెక్నాలజీతో హైవేపై వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో.. దాని ఆధారంగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రమంత్రి ప్రకటన ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. కొత్త పద్దతిలో కదులుతున్న వెహికల్ జీపీఎస్ ఇమేజెస్ సాయంతో టోల్ ఛార్జీలను వసూలు చేసే సౌలభ్యం కలుగుతుందన్నారు. యూరప్ దేశాల్లో జీపీఎస్ ఆధారిత విధానం విజయవంతం కావడంతో మనదేశంలో దీనిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ జీపీఎస్ టెక్నాలజీని పరీక్షించేందుకు మనదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా, కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే ముందు ట్రాన్స్పోర్ట్ విధానాన్ని మార్చాల్సి ఉండగా.. పైలట్ ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగా 1.37 లక్షల వెహికల్స్‌పై ఈ జీపీఎం వ్యవస్థను ప్రయోగించనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌లు రద్దీ సమాయాల్లో టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురు చూసే అవసరాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ బూత్‌లలో రుసుము చెల్లించడాన్ని సులభతరం చేసింది. చదవండి👉 బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్‌తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా? -
ఫోన్ రిపేర్‌కు ఇచ్చింది.. పర్సనల్ ఫొటోలన్నీ లీక్
రోజువారీ అలవాటుగా ఉదయం నిద్రలేస్తూనే ఫోన్ చూడటం మొదలుపెట్టింది కావ్య (పేరుమార్చడమైనది). సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయగానే తన ఫొటోతో కనిపించిన ఓ నోటిఫికేషన్ చూసి, ఆశ్చర్యపోతూ యాక్సెప్ట్ చేసింది. అందులో తన వ్యక్తిగత ఫొటోలు కనిపించడంతో ఒక్క సారిగా నిద్రమత్తు వదిలిపోయింది. ఆ ఫొటోలు తను అప్లోడ్ చేయలేదు. కేవలం తను ఉన్న ఫొటోలతో మరో అకౌంట్ ఉండటం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ ఫొటోలు ఎవరి చేతిలోకి ఎలా వెళ్లాయో తెలియదు. తనెంతో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు. రెండేళ్ల క్రితం ఫొటోలు అవి. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో హుందాగా ఉండే కావ్యకు ఈ పరిస్థితి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఫొటోలను, వీడియోలను చూసిన తన స్నేహితులు, బంధువులు ఫోన్లు చేసి, ‘ఏంటీ పిచ్చి పని?’ అంటూ అడగడం మొదలుపెట్టారు. తనకేమీ తెలియదని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ‘నలుగురిలో పెట్టవలసిన ఫొటోలేనా ఇవి’ అంటూ కొందరు కావ్య పేరెంట్స్ కి ఫోన్ చేసి మరీ అడగడంతో ఇంటిల్లిపాదికి ఈ సమస్య పెద్ద భూతమైపోయింది. ఎప్పుడూ ఆ ఫోన్లోనే ఉంటావ్, ఏ ఫోటో పోస్ట్ చేయాలో, ఏ ఫొటో దాచుకోవాలో ఆ మాత్రం తెలియదా! ఇలా అందరిలో పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా’ అంటూ కూతురినే తప్పు పట్టారు తల్లీదండ్రి. తనకేమీ తెలియదని కావ్య ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. విషయాన్ని ఢిల్లీలో ఉంటున్న తన కజిన్‌తో పంచుకుంది కావ్య. ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం తెలియడం లేదని, బయటకు వెళ్లడానికే భయంగా ఉందంటూ కళ్లనీళ్లతో చెప్పింది. ‘నీ ఫోన్, ట్యాబ్.. వంటి పరికరాలు ఏవైనా ఎవరికైనా ఇచ్చావా’ అని అడిగింది కావ్య కజిన్. ‘లేదు’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. ‘బాగా గుర్తు తెచ్చుకొని, మళ్లీ ఫోన్ చెయ్’ అంది కావ్య కజిన్. తీవ్రంగా ఆలోచించిన కావ్యకు ఏడాది క్రితం తన పాత ఫోన్ పాడైతే రిపేర్‌కు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఫోన్ నుంచి తీసుకున్న ఫొటోలే ఇప్పుడు తన ఈ సమస్యకు అతి పెద్ద కారణం అన్నమాట... అనుకుంది. ఆర్నెల్ల క్రితం కొత్త ఫోన్ కొనుక్కొని, ఆ ఫొటోలన్నీ సిస్టమ్ స్టోరేజీలో కాపీ చేసుకుంది. ఫోన్ మాత్రం ఎవరికీ అమ్మలేదు. ఎప్పుడైనా అవసరం వస్తే వాడచ్చులే అని ఇంట్లోనే ఉంచింది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది కావ్యకు. ఆ షాప్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తన సమస్యకు పరిష్కారం దొరికింది. ఎవరు ఆమె ఫొన్లోని డేటాను తస్కరించింది, సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించి, ఫొటోలు ఎలా అప్లోడ్ చేసిందీ తెలిసింది. ► పాడైన డిజిటల్ పరికరాల డేటా మొత్తం కాపీ చేసుకొని, ఫార్మాట్ చేసి, అప్పుడు రిపేర్‌కు ఇవ్వడం శ్రేయస్కరం. ► తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోవడం కంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయడం లేదా 155260 కి కాల్ చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది. ► సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక అక్షరాలున్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, కాలానుగుణంగా మార్చడం వల్ల హ్యాక్ అవడం, డేటా తస్కరించడం వంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గోప్యత కోసం జిపిఎస్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాలి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ► తెలియని పరిచయాల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవడం వల్ల వ్యక్తిగత డేటాకు సంబంధించిన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కకుండా చేయగలం. అలాగే, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసినవారమవుతాం. ► మీరు ఇతరులకు షేర్ చేసే ఫొటో వెరిఫికేషన్ కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా చెక్ చేయచ్చు. లేదా www.tineye ని ఉపయోగించవచ్చు, అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో.. సిక్కోలు కుర్రాడి ప్రతిభ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు యువకుడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో ఓ బృందానికి ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభ చాటారు. సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను ఎలా సమకూర్చుకోవాలి? వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అన్న అంశాలపై వర్చువల్ విధానంలో రోబోటిక్ సాప్ట్వేర్ తయారీపై నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్ సంస్థ పోటీ నిర్వహించింది. ఈ చాలెంజ్‌లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ ప్రాతినిధ్యం వహించిన బృందం విశ్వవిజేతగా నిలిచింది. ఈ బృందంలో అలెంసాండ్రో డిఫవా, వెక్టర్ లోపెజ్, డేవిడ్ ఫెర్నాండెజ్ లోపెజ్, ఫియర్ ఫెర్న్బాచ్, లూకా మర్కియాని, ఆద్రియా రోయజ్ మొరెనో, నాసిన్ మిగేల్ బాన్యోస్ సభ్యులుగా ఉన్నారు. విజేతగా నిలిచిన వీరు రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. సాయికిశోర్ ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్ రోబోటిక్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్ మోన్స్ బృందంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. 114 బృందాలను అధిగమించి.. మల్టీ–రోబో బృందం అంతరిక్షంలోకి వెళ్లాక ఎలా పనిచేయాలి? ఎంత త్వరగా ఖనిజాన్ని సేకరించాలి? జీపీఎస్ వ్యవస్థ లేకుండా మొత్తం పనిచేసి, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ బృందం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ప్రకారం.. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఒక రోబో వెతుకుతుంది.. ఇంకొకటి లొకేషన్‌కు వెళ్లి ఖనిజాలను తవ్వి, ఇంకో రోబో మీద మినరల్ వేస్తుంది.. లోడ్ చేసిన రోబో హోమ్ బేస్ లొకేషన్‌కు వచ్చి అన్లోడింగ్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 114 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్ మోన్స్ బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం. రెండేళ్లు కష్టపడ్డాం ఈ ఛాలెంజ్ కోసం మేం రెండేళ్లు కష్టపడ్డాం. ఇందులో స్కౌట్స్ అనే రకం రోబో మినరల్‌ను వెతుకుతుంది. ఎక్స్కవేటర్ అనే రోబో తవ్వకాలు చేసి, హౌలర్ అనే రోబోలో లోడింగ్ చేస్తుంది. మంచు, నీరు, అమ్మోనియా, కార్బన్ డై ఆక్సైడ్, ఈథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, మంచు, ఇసుకను సమర్థంగా తవ్వకాలు చేసి, తీసుకొచ్చేందుకు ఈ సాఫ్ట్వేర్ రూపొందించాం. దీనిని భవిష్యత్‌లో నాసా మిషన్ వినియోగించే అవకాశం ఉంది. – కొత్తకోట సాయికిశోర్, శ్రీకాకుళం -
IPL 2021: ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు జీపీఎస్ వాచ్‌లు
దుబాయ్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. సీఎస్కే, ముంబై ఇండియన్స్‌లో పలువురు ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అబుదాబి చేరుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. అయితే ఆటగాళ్ల కదలికలపై నిఘా వేసేందుకు అబుదాబి ప్రభుత్వం జీపీఎస్ వాచీలను అందించింది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్ సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారో లేదో తెలుస్తుంది. అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ కఠినంగా ఉన్నాయి.ఒకవేళ దుబాయ్ నుంచి అబుదాబిలో ఎంటర్ కావాలన్న.. వాళ్లు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. మరోవైపు దుబాయ్ హోటల్లో బస చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం జీపీఎస్ వాచ్‌లను ఇవ్వలేదు. క్వారంటైన్ సమయంలో ప్రతి రోజు ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న దుబాయ్‌లో చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలుకానున్నాయి. -
ఏ బస్సు ఎప్పుడొస్తుందో..?
నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే కష్టంగా మారింది. అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది. బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, అందుకు బస్సులకు జీపీఎస్ అనుసంధానం చేసిన ప్రభుత్వం లాక్డౌన్ అనంతరం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ఎదురు చూసి చివరకు అధిక డబ్బులు చెల్లించి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. చాలా రూట్లలో కనీసం సమయపాలన ఉండటం లేదు. నిత్యం ఆయా రూట్లలో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. ఒకరోజు ఓ సమయానికి వచ్చిన బస్సు మరోరోజు ఆ సమయానికి రావడంలేదు. దీంతో ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో రూట్ నంబర్ 279. సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నం. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే రూట్ ఇది. కానీ బస్సెక్కాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. ఉప్పల్ నుంచి చాంద్రాయణగుట్ట, అత్తాపూర్ రూట్లో మెహిదీపట్నం రాకపోకలు సాగించే ‘300 రూట్లో ‘ నాలుగైదు బస్సులు వరుసగా బయలుదేరుతాయి. ఆ సమయంలో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఒకటి, రెండు బస్సులు ఏర్పాటు చేస్తే చాలు. కానీ ఐదు బస్సులు ఒకేసారి బయలుదేరడం వల్ల మిగతా మూడు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు రూట్లే కాదు.. గ్రేటర్‌లోని అనేక మార్గాల్లో బస్సుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు డిపోల మధ్య సమన్వయం కొరవడటం వల్ల వివిధ రూట్లలో బస్సులు తరచూ బంచింగ్ అవుతున్నాయి. నో టైమింగ్స్.. గ్రేటర్ పరిధిలో సుమారు 2,500 బస్టాపులు ఉన్నాయి. మరో 20కి పైగా బస్‌బేలు, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కోఠీ, కాచిగూడ, ఈసీఐఎల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, హయత్‌నగర్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బస్స్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు ఉన్నాయి. ప్రతిరోజూ 29 డిపోల నుంచి సుమారు 2,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన బస్స్టేషన్లలో మినహా ఎక్కడా బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో కొన్ని ముఖ్యమైన బస్టాపుల్లో ఎల్ఈడీ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో ప్రదర్శించేవాళ్లు. లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత దశలవారీగా పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించినప్పటికీ ‘సమయపాలన’ మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో బస్సుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొరవడిన సమన్వయం.. గ్రేటర్లో 29 డిపోల నుంచి సుమారు 1,150 రూట్లలో బస్సులు నడుపుతున్నారు. గతంలో రోజుకు 40 వేల ట్రిప్పులు తిరిగేవి. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ట్రిప్పులు సైతం గణనీయంగా తగ్గాయి. వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్స్ రూపొందించడంలో డిపోమేనేజర్లకు, ఉన్నతాధికారులకు మధ్య కచి్చతమైన సమన్వయం లేకపోవడం వల్ల ఒకే రూట్లో రెండు, మూడు డిపోలకు చెందిన బస్సులు ఒకే సమయంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ‘కోవిడ్ అనంతరం బస్సుల నిర్వహణపైన సీరియస్‌గా దృష్టి సారించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు’ ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అటకెక్కిన జీపీఎస్.. జీపీఎస్ ద్వారా బస్సుల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థను గతంలో ప్రవేశపెట్టారు. బస్సుల నిర్వహణలో శాస్త్రీయమైన పద్ధతి ఉంటుందని భావించారు. ప్రతి ట్రిప్పును లెక్క వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ వంటి అంశాలపైన అవగాహన ఏర్పడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రా జెక్టు ప్రస్తుతం అటకెక్కింది. ‘ఒకవైపు మెట్రో రైలు, మరోవైపు ప్రైవేట్ వాహనాలు గ్రేటర్ ఆరీ్టసీకి సవా ల్గా మారాయి. బస్సుల నిర్వహణలో కచ్చితమైన అంచనాలు ఉంటే తప్ప ఫలితాలను రాబట్టుకోవడం కష్టం..’ అని డిపో మేనేజర్ ఒకరు తెలిపారు. -
పొగమంచు ఉన్నా.. కూ చుక్‌చుక్
సాక్షి, హైదరాబాద్: చలికాలంలో పొగమంచుతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వాహనదారులకు రోడ్డు కనిపించక జరిగే ప్రమాదాలెన్నో. ఇలాగే రైల్వే వ్యవస్థలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి. పొగమంచు కారణంగా సిగ్నల్స్ కనిపించకపోతే ఇక అంతే సంగతులు. భారీ ప్రమాదాలు జరుగుతాయి. అందుకే మంచు దట్టంగా కమ్ముకునే సమయంలో రైళ్లను కనిష్ట వేగానికి నియంత్రించి నడుపుతుంటారు. లొకోపైలట్ రైలును నెమ్మదిగా నడుపుతూ, సిగ్నల్స్‌ను గమనిస్తూ ముందుకు సాగుతుంటారు. దీంతో చాలా రైళ్లు ఆలస్యంగా నడవటం, కొన్నింటిని రద్దు చేయాల్సి రావటం జరుగుతాయి. ఇప్పుడీ సమస్యకు అధికారులు పరిష్కారం కనుగొన్నారు. ఫాగ్ పాస్.. ఈ పొగమంచు సమస్యకు పరిష్కారంగా ‘ఫాగ్‌పాస్’పేరుతో ఓ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు అధికారులు. జీపీఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో స్క్రీన్ ఉంటుంది. సంబంధిత రైలు మార్గాన్ని జీపీఎస్ ద్వారా ఈ పరికరానికి అనుసంధానిస్తారు. ఆ మార్గంలో ఎక్కడెక్కడ సిగ్నళ్లు ఉన్నాయి.. ఎక్కడ సూచిక బోర్డులున్నాయి.. స్టేషన్లు.. మలుపులు, లెవల్ క్రాసింగ్స్.. ఇలా అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి. రైలు వెళ్తున్న కొద్దీ మార్గంలో ముందున్న మూడు వివరాలు స్క్రీన్‌లో కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో స్పష్టం చేస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉందనగా వాయిస్ రూపంలో అప్రమత్తం చేస్తుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేకుండానే ముందుకు దూసుకెళ్లొచ్చు. కకోద్కర్ కమిటీ సలహాతో.. 2011లో హైలెవల్ సేఫ్టీ రివ్యూ కమిటీని కకోద్కర్ నేతృత్వంలో రైల్వే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రైల్వే భద్రతకు సంబంధించి 106 సిఫారసులు చేసింది. వాటిల్లో 68 పూర్తిస్థాయిలో అమలు చేయదగ్గవని రైల్వే బోర్డు గుర్తించింది. మరో 19 పాక్షికంగా అమలు చేయదగ్గవని గుర్తించింది. 68 సూచనల్లో ఈ ఫాగ్ పాస్ పరికరం కూడా ఉంది. దీన్ని స్థానికంగానే అభివృద్ధి చేశారు. కిలోన్నర బరువుండే ఈ పరికరంలో దృశ్య, శ్రవణ విధానం ఉంటుంది. క్రూ బుకింగ్ కేంద్రాల వద్ద వీటిని ఉంచి, రైలు బయల్దేరే సమయంలో లోకోపైలట్లకు అందిస్తారు. మళ్లీ డ్యూటీ పూర్తి కాగానే వారు దాన్ని సంబంధిత విభాగానికి అప్పగించాల్సి ఉంటుంది. గతేడాది ఈశాన్య భారతంలోని కొన్ని రైల్వే జోన్లకు ఈ పరికరాలు అందించారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. తొలి దఫాగా జోన్ పరిధిలో 250 పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కాగా, పొగమంచు కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఈ పరికరంతో అధిగమించొచ్చని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. ప్రతి వాహనానికీ జీపీఎస్ ‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఏర్పాట్లకు రెండు నెలల సమయం ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్ యార్డులు, వేయింగ్ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సిలికా అక్రమ తవ్వకాలకు చెక్ నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది. ► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది. ► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది. ► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్ లోడ్ చేయిస్తారు. ► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ► ఇసుక కావాల్సిన వారు వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు. ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
నావిక్‌తో ‘హెచ్చరికలు’
బెంగళూరు: దేశీయంగా అభివృద్ధి చేసిన జీపీఎస్ వ్యవస్థ ‘నావిక్’తో ప్రకృతి విపత్తులు, తుపానులు, సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దులపై మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయవచ్చునని ఇస్రో శాస్త్రవేత్త నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. ఇందుకోసం తాము ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారు చేస్తున్నామన్నారు. బెంగళూరులో జరుగుతున్న స్పేస్ ఎక్స్‌పోలో శుక్రవారం నీలేశ్ మాట్లాడుతూ ఈ పరికరం తక్కువ ధరకే లభిస్తుందనీ, సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా జాలరులకు తెలియజేస్తుందని చెప్పారు. గతేడాది డిసెంబర్లో ఓక్కి తుపాను విరుచుకుపడినప్పుడు కేరళలో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ పరికరాన్ని తయారుచేసినట్లు ఆయన చెప్పారు. తుపానుల వంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు ముందుగానే మత్స్యకారులకు హెచ్చరించి వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునేందుకు ఈ పరికరం ఉపకరిస్తుందని నీలేశ్ తెలిపారు. -
జీపీఎస్ విధానంతో భూసర్వే
శివ్వంపేట(నర్సాపూర్) : జిల్లాలో పార్ట్ బీలో ఉంచిన భూ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కిషన్‌రావు అన్నారు. శుక్రవారం జేసీ నగేశ్‌తో కలిసి శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయ రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 315, 316లో జరుగుతున్న భూసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సంబంధించి భూముల వివరాలు పార్ట్ బీలో ఉంచామని, ఇప్పటి వరకు 30 వేల ఎకరాలు ఫార్ట్ ఏలోకి మార్చినట్లు చెప్పారు. మిగతా భూ సమస్యలను సైతం పరిష్కరించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా శివ్వంపేట మండలంలో భూ సమస్యలు అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గతంలో పనిచేసిన సిబ్బంది చేసిన తప్పుల మూలంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. మండలంలో 48 వేల 327 ఎకరాల భూములు ఉండగా 11వేల376 ఎకరాల విస్తీర్ణం రికార్డుల్లో పెరిగిందన్నారు. భూ విస్తీర్ణం పెరిగిన సర్వేనంబర్లలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు సర్వే బృందాలు ఉండగా మారో మూడు బృందాలను పంపిస్తామని చెప్పారు. జీపీఎస్ విధానం ద్వారా త్వరగా సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సర్వే అనంతరం రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం, రైతుబీమా బాండ్లు ఇస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ నగేశ్ తహసీల్దార్ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకర్లకు జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల గొంతు తడపాల్సిన మంచినీటి ట్యాంకర్లు దారి తప్పుతున్న వైనంపై ‘పెద్దలకే నీళ్లు’ పేరుతో ‘సాక్షి’ ప్రధాన సంచికలో, ‘‘అవి‘నీటి’ వ్యాపారం’’ పేరుతో హైదరాబాద్ టాబ్లాయిడ్లో శనివారం ప్రచురించిన కథనాలపై జలమండలి ఎండీ దానకిశోర్ స్పందించారు. దారి తప్పుతున్న ట్యాంకర్లకు తక్షణమే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి జాడను పసిగట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేశారు. మంచినీటి సరఫరా, సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ట్యాంకర్లకు డబ్బులు వసూలు చేయడంపై ఆరా తీశారు. ట్యాంకర్ల ద్వారా నీరు పొందిన కొందరు వినియోగదారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీపీఎస్‌తో అక్రమార్కుల ఆటకట్టు మంచినీళ్లు లభించక గొంతెండుతున్న ప్రజల బాధలను తెలుసుకొనేందుకు దానకిశోర్ మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతా ల్లో పర్యటించారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. దారి తప్పుతున్న ట్యాంకర్ల జాబితాను సిద్ధం చేయాలని నిఘా అధికారులను ఆదేశించారు. అక్రమంగా తరలుతున్న ట్యాంకర్లను నియంత్రించేందుకు జీపీఎస్ ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇక నియంత్రణ ఇలా: జీపీఎస్ ద్వారా వాటర్ ట్యాంకర్ల కదలికలను కచ్చితంగా అంచనా వేస్తారు. ప్రజల అవసరాల మేరకు ట్రిప్పులు పెంచుతారు. జలమండలితో పాటు, జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్లను సైతం జీపీఎస్ పరిధిలోకి తెస్తారు. స్మార్ట్ కార్డు ఉన్న ట్యాంకర్లు మాత్రమే జలమండలి నుంచి నీటిని చేరవేయాలి. ప్రస్తుతం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా, ఇక నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అందజేయాలని ఎండీ సూచించారు. -
ఖాకీపై జీపీఎస్ నిఘా
కొందరిలో ఆందోళన ఇప్పటి వరకు నామమాత్రంగా నైట్ బీట్లు నిర్వహించిన కొందరు సిబ్బంది జీపీఎస్ విధానం అమల్లోకి రావడంతో ఆందోళనలో పడ్డారు. ఈ విధానంతో విధులు భారంగా మారుతాయని భావిస్తున్నారు. పోచమ్మమైదాన్ : ఖాకీల పని విధానంపై ఇక నిఘా పెరగనుంది. క్షేత్రస్థారుులో సిబ్బంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారో.. పెట్రోలింగ్ వాహనాలను ఎక్కడ నిలిపారో క్షణాల్లో ఉన్నతాధికారులకు తెలిసిపోనుంది. ఇందుకనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పోలీస్ వాహనాల నియంత్రణ, సిబ్బంది పనితీరుపై నిఘా పెంచడమేగాక ప్రజలకు సత్వర సేవలందించేందుకుగాను తాజాగా జీపీఎస్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా తనదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జనసంచారం, వాహనాల రద్దీ పెరగనున్న క్రమంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎస్పీ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేరుుంచిన ఆయన కొత్తగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. నగరంలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా వాహనం ఎక్కడ ఉందనే సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడం ద్వారా ఆ వాహనాన్ని నియంత్రించే శక్తి కూడా ఎస్పీ చేతిలోనే ఉంటుంది. త్వరలో జిల్లావ్యాప్తంగా అమలు : అంబర్ కిశోర్ ఝా, వరంగల్ అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేస్తామన్నారు. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో సోమవారం పెట్రోలింగ్ జీపీఎస్ వాహనాలను ప్రారంభించి, బ్లూకోల్ట్స్ బీట్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లా కోసం కూడా జీపీఎస్ కమాండింగ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జీపీఎస్ సిస్టమ్ పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్, క్రైం డీఎస్పీ ఈశ్వరరావు, ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ, మహిళా పీఎస్, రూరల్ క్రైం సీఐలు ఫణీందర్, సత్యనారాయణ, ప్రభాకర్ రావు, అలీ, మట్టెవాడ ఎస్సై రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. బ్లూ కోల్ట్స్‌కు స్మార్ట్ ఫోన్లు బ్లూ కోల్ట్స్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. బ్లూకోల్ట్స్ బీట్ పరిధిలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే ఫొటో తీసి కంట్రోల్ రూంకు పంపించాలి. ఇలా సంఘటనను స్మార్ట్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన తక్షణమే డీఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని క్షణాల్లో పంపడం ద్వారా అధికారులు ఇందుకోసం చర్యలు తీసుకుంటారు. అలాగే బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన నిందితులు కన్పిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం పంపిస్తారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌కు కూడా జీపీఎస్ సిస్టమ్ పని చేస్తుంది. అనుసంధానం ఇలా తొలుత జీపీఎస్ పరికరాన్ని వాహనంలో అమర్చుతారు. ఇది శాటిలైట్‌తో అనుసంధానమై ఉంటుంది. దాని ద్వారా కంట్రోల్ రూమ్‌కు సిగ్నల్స్‌కు అనుసంధానం చేస్తారు. వాహనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జీపీఎస్ కోడ్ ఆధారంగా ఏ వాహనం గురించైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కడ నిలిపి ఉంది.. ఎంత స్పీడుతో వెళ్తోందనే విషయూలు కూడా తెలుస్తారుు. వాహనంలో ఉన్న సిబ్బంది ఒకచోట ఉండి మరో చోట ఉన్నామని అబద్ధం చెప్పినా ఆ వాహనం అక్కడే నిలిచిపోయేలా కంట్రోల్ రూం ద్వారా ఆపివేసే సౌకర్యం కూడా ఉండడం గమనార్హం. పని తీరు ఇలా... ఏదైనా ప్రాంతంలో సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించడంతోపాటు సంఘటన స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకుగాను ఆ పరిసర ప్రాంతానికి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ వాహనంను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి ఆ బృందానికి ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేస్తారు. దీంతో పోలీసులు త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని సేవలందించే అవకాశం ఉంటుంది. -
కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థ
సాక్షి, ముంబై: కాల్‌సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చనున్నారు. ఈ పరికరాన్ని అమర్చిన వాహనాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోడ్బందర్ రోడ్ వద్ద సోమవారం ప్రారంభించనున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ‘సురక్షితంగా ప్రయాణించు’ అన్న నినాదంతో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థను అమర్చడం ద్వారా అందులే ప్రయాణించే మహిళలు వాహనం ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాకింగ్ చేస్తుంది. ఈ వ్యవస్థ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఠాణే ట్రాఫిక్ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ కరాండీకర్ అన్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఈ పరికరాన్ని అమర్చుతామన్నారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులకు ఓ చిప్‌ను అందజేస్తారు. ఆ చిప్‌లో సదరు ప్రయాణికురాలి వివరాలు, ఆమె ఐదుగురి బంధువుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాహనంలో ప్రయాణం చేసే సమయంలో సదరు మహిళా ప్రయాణికురాలు ఆ చిప్‌ను పరికరంలో ఉంచాలి. దీంతో కుటుంటు సభ్యులు ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకోవచ్చు. -
ఇసుకాసురులు
⇒ నదులు, గెడ్డలకు తూట్లు ⇒ అనధికారిక తవ్వకాలు ⇒ దొడ్డిదారిన అమ్మకాలు ⇒ మామూళ్ల మత్తులో అధికారులు ⇒ కానరాని నిఘా.. కొరవడిన పర్యవేక్షణ ⇒ లూటీ చేస్తున్న ‘దేశం’ నేతలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సర్ప, పెద్దేరు, శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం,బొడ్డేరు,తాచేరు రిజర్వాయర్లలో ఆయా సాగునీటి వనరులకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇసుకను దృష్టిలో పెట్టుకుని రీచ్‌లను గుర్తించారు. అధికారికంగా గుర్తించిన రీచ్‌ల కంటే అనధికారికంగా ఇసుకతవ్వకాలు జరిగే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులిచ్చిన రీచ్‌ల్లో ఎక్కడా సీసీ కెమేరాలు లేవు. రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌తో అనుసంధానించలేదు. ఒకరిద్దరు డ్వాక్రామహిళలు, నోరు వాయ లేని కిందిస్థాయి సిబ్బంది తప్ప ఏరీచ్లలోనూ చెప్పుకో తగ్గస్థాయి అధికారులు లేరు. డ్వాక్రామహిళలకు తవ్వకాలు, అమ్మకాలపై కనీస అవగాహన ఉన్నట్టుగా కన్పించదు. రీచ్‌ల కోసం ఏ సమాచారం అడిగినా వారు చెప్పే పరిస్థితులో లేరు. మీ సేవ..ఆన్లైన్లో జరిగే రిజిస్ట్రేషన్ మేరకు సాగే తవ్వకాలు, అమ్మకాల కంటే అనధికారికంగా సాగే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమొచ్చిన చోటల్లా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగిస్తూ నదులు, గెడ్డలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నుంచి సుమారు 500కు పైగా ట్రాక్టర్లు, వెయ్యికిపైగా టైరు బండ్లపై ఇసుకను ధర్జాగా తరలించు కుపోతున్నట్టుగా గుర్తించారు. అనధికారిక తవ్వకాలు జరిగే ప్రాంతాలు.. ఏజెన్సీలో మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన మత్స్యగెడ్డవంతెన, బొకెల్లు కాజ్వే, రాయగడ హాస్టల్, పరదానిపుట్టుకాజ్వే, పాతరపుట్టు, రాళ్లగెడ్డ పరిసర ప్రాంతాలైన చెరుకుంపాలెం, భీమసింగ్, దేవారాపల్లి మండలం కిమరాం, బి.చంతాడ, వేచలం, మాడుగులమండలం వీరవల్లి, ఎస్.రాయవరం మండలం పెనుగల్లు, ధర్మవరం, పెదఉప్పలం, పాయకరావుపేట మండలం మంగవరం, సత్యవరం, అరట్లకోట, మోసయ్యపేట, ముటాఆనకట్టలు, అనకాపల్లిమండలం దిబ్బపాలెం, వెంకుపాలెం, సీతా నగరం, మూలపేట,చోడవరం మండలం విజయరామరాజు పేట, వడ్డాది, గౌరవరం, గజపతినగరం, జెన్నవరం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ వందలాది ట్రాక్టర్లు, టైరుబండ్లపై టన్నుల కొద్ది ఇసుక తరలి పోతున్నట్టుగా ‘సాక్షి’ పరిశీలన లో వెలుగుచూసింది. సముద్ర ఇసుకను వదలడం లేదు వ్యాపారులు సముద్రపు ఇసుకను కూడా వదలడం లేదు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డిఎల్.పురం, బోయిపాడు,పెదపీనర్ల, చినపీనర్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట, కేశవరం,పాల్మన్‌పేటల్లో సముద్రపుఇసుకను తవ్వేస్తున్నారు. ఈసుకను నదుల్లోని ఇసుకతో కలిపేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ’ఇలా చెప్పుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో జరుగు తున్న అక్రమాలు లెక్కకు మించే సాగుతున్నాయి. తాండవ నదిలో తుని-పాయకరావుపేట సరిహద్దు గ్రామాల్లో ఏకంగా పొక్లెయినర్లను ఉపయోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి పూట డ్వాక్రా మహిళల మాటున సాగుతున్న తవ్వకాలు రాత్రిళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. రాత్రిపూట అనధికారిక రీచ్‌లలో వందల కొద్ది లారీలు, టైర్ల బండ్లపై తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. -
ఎందులో వెళితే భద్రత?
న్యూఢిల్లీ: నడిచి వెళుతుంటే మెడలోంచి గొలుసులు లాక్కెళ్తున్నారు..... లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తే అసభ్యంగా మాట్లాడుతూ, వెకిలిచేష్టలతో విసుగెత్తిస్తున్నారు... బస్సులో ప్రయణించిన యువతిపై కిరాతకంగా అత్యాచారం జరిపారు. నడుస్తున్న వాహనాలలో అత్యాచారం జరిపిన ఘటనలు కోకొల్లలు. ఇక ప్రైవేటు క్యాబ్‌లు సురక్షితం అనుకుంటే... దాని డ్రైవరే ఉన్మాదిగా మారి అత్యాచారానికి తెగించాడు. ఉబర్ క్యాబ్‌లో యువతిపై జరిగిన అత్యాచారం ఘటన, నగరంలోమహిళల భద్రత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. వాహనంలో జీపీఎస్ వ్యవస్థ ఉండి, డ్రైవర్ వివరాలు తెలిసి ఉండటం నేటి దినాలలో ప్రైవేట్ క్యాబ్‌ల ప్రత్యేకత. అందువల్ల ఆ క్యాబ్‌లలో రాత్రైనా, పగలైనా భయం లేకుండా ప్రయాణించవచ్చని భావించేవారు. కానీ ఉబర్ క్యాబ్ ఉదంతం అనంతరం ఏ వాహనంలో ప్రయాణించాలో తెలియక నగర మహిళలు ఇరకాటంలో పడ్డారు. ‘‘ఏ రవాణా విధానమూ వంద శాతం సురక్షితం కాదు. పరిస్థితులు అంతగా దిగజారాయి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీలో నేనైతే మెట్రో వ్యవస్థను నమ్ముతాను. స్టేషన్ల వద్ద భద్రతా సిబ్బంది నిరంతరం ఉంటారు. అంతటా లైట్లు వెలుగుతూ ఉంటాయి. అవసరమనిపిస్తే మెట్రోరైలు డ్రైవర్‌ను సహాయం అడగవచ్చు. ప్రతి కంపార్ట్మెంట్లో కెమెరాలు ఉంటాయి’’ అని 27 ఏళ్ల పాత్రికేయురాలు కృతికా ఖన్నా అన్నారు. కామాంధుల కళ్ల నుంచి తప్పించుకోవడానికి తాను ఎప్పుడూ లేడీస్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణిస్తానని చెప్పారు. రాత్రిపూట స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునే స్వేచ్ఛకు, రాత్రి సమయంలో ప్రైవేట్ క్యాబ్‌లో ఇంటికి చేరుకునే వెసులుబాటుకు ఈ ఘటన (ఉబర్ క్యాబ్) ముగింపు పలికిందని అన్నారు. ఈ ఘటన అనంతరం ఏ తల్లిదండ్రులూ తమ కూతుళ్లను ఒంటరిగా రాత్రి వేళల్లో క్యాబ్‌లో ప్రయాణించేందుకు అనుమతించరు అని అభిప్రాయపడ్డారు. ఏ విధమైన రవాణా విధానం కూడా మహిళలకు సురక్షితం కాదు అన్నదానితో తాను ఏకీభవిస్తున్నానని జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ మమతా శర్మ చెప్పారు. మరింత కఠినమైన చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేసిన శర్మ, ప్రజల మైండ్‌సెట్ కూడా మారాలన్నారు. ఉబర్ క్యాబ్‌పై నిషేధం విధించడాన్ని తాను సమర్తిస్తున్నానని, ఇది ఇతర సంస్థలకు ఒక గుణపాఠం కాగలదని అన్నారు. సొంతంగా వాహనం ఉంటే అందులో సురక్షితంగా ప్రయాణించవచ్చని అన్నారు 28 ఏళ్ల దేవోరికా అధికారి. అయితే అది అందరికీ సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వ రవాణా సాధనాలపై ఆధారపడటం అసంభవమని, అవసరమైతే తాను మెట్రోరైలులోనే ప్రయాణిస్తానని చెప్పారు. అప్పుడు కూడా తనతో పాటు మరొకరు ఉండేలా చూసుకుంటానని అన్నారు. సీపీఎం నాయకురాలు బృందాకరత్ సైతం ఇవే అభిప్రాయాలను వెలిబుచ్చారు. ‘‘నగరానికే భద్రత లేనప్పుడు ఇక ఏ రవాణా సాధనంలో రక్షణ ఉంటుంది. నగరం సురక్షితం అన్న భావనను ప్రభుత్వం ముందుగా కల్పించాలి. రాజకీయ హామీలకు, వాటి అమలుకు మధ్యనున్న శూన్యాన్ని తొలగించాలి’’ అని పేర్కొన్నారు. నేర చట్టాల సవరణకు జస్టిస్ జేఎస్ వర్మ చేసిన సిఫార్సులను అమలు చేయాలని బృందా కరత్ సూచించారు. -
విమానాలతో హరికేన్ల అంచనా!
వాషింగ్టన్: విమానాల ద్వారా హరికేన్(పెనుతుపాను)లను అంచనా వేసేందుకు ఉపయోగపడే కొత్త జీపీఎస్ వ్యవస్థను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. ‘జిస్మోస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ ఫర్ మల్టిస్టాటిక్ అండ్ అకల్టేషన్ సెన్సింగ్)’గా పేరుపెట్టిన ఈ జీపీఎస్ వ్యవస్థను అన్ని సాధారణ విమానాలకూ అమర్చి అవి ప్రయాణించే మార్గాల్లో గాలిలో తేమ, ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జీపీఎస్ ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించుకుని వాతావరణ సమాచారాన్ని నేలపై అక్కడక్కడా స్థిరంగా ఉండే జీపీఎస్ రిసీవర్ల ద్వారా సేక రించి అంచనా వేస్తున్నారు. అయితే ఉపగ్రహాలపై జీపీఎస్ రిసీవర్లను అమర్చ డం ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు మహాసముద్రాలపై ముఖ్యంగా హరికేన్ల వంటివి ఏర్పడిన చోట వాతావరణం అంచనా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిస్మోస్ వ్యవస్థను విమానాలకు అమర్చితే అవి సముద్రాలపై ఎగురుతున్నప్పుడు అక్కడి వాతావరణ అంశాల సమాచారం అందుతుందని, దీంతో హరికేన్ల వంటి వాటి ముప్పును, తీవ్రతను ముందుగానే అంచనా వేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక ఫ్రిజ్ అంత సైజులో ఉన్న ఈ వ్యవస్థను బూట్లు ప్యాక్‌చేసే అట్టపెట్టె అంత సైజుకు తగ్గించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు.