న్యూఢిల్లీ: నడిచి వెళుతుంటే మెడలోంచి గొలుసులు లాక్కెళ్తున్నారు..... లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తే అసభ్యంగా మాట్లాడుతూ, వెకిలిచేష్టలతో విసుగెత్తిస్తున్నారు... బస్సులో ప్రయణించిన యువతిపై కిరాతకంగా అత్యాచారం జరిపారు. నడుస్తున్న వాహనాలలో అత్యాచారం జరిపిన ఘటనలు కోకొల్లలు. ఇక ప్రైవేటు క్యాబ్‌లు సురక్షితం అనుకుంటే... దాని డ్రైవరే ఉన్మాదిగా మారి అత్యాచారానికి తెగించాడు.
ఉబర్ క్యాబ్‌లో యువతిపై జరిగిన అత్యాచారం ఘటన, నగరంలోమహిళల భద్రత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. వాహనంలో జీపీఎస్ వ్యవస్థ ఉండి, డ్రైవర్ వివరాలు తెలిసి ఉండటం నేటి దినాలలో ప్రైవేట్ క్యాబ్‌ల ప్రత్యేకత. అందువల్ల ఆ క్యాబ్‌లలో రాత్రైనా, పగలైనా భయం లేకుండా ప్రయాణించవచ్చని భావించేవారు. కానీ ఉబర్ క్యాబ్ ఉదంతం అనంతరం ఏ వాహనంలో ప్రయాణించాలో తెలియక నగర మహిళలు ఇరకాటంలో పడ్డారు.
‘‘ఏ రవాణా విధానమూ వంద శాతం సురక్షితం కాదు. పరిస్థితులు అంతగా దిగజారాయి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీలో నేనైతే మెట్రో వ్యవస్థను నమ్ముతాను. స్టేషన్ల వద్ద భద్రతా సిబ్బంది నిరంతరం ఉంటారు. అంతటా లైట్లు వెలుగుతూ ఉంటాయి. అవసరమనిపిస్తే మెట్రోరైలు డ్రైవర్‌ను సహాయం అడగవచ్చు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో కెమెరాలు ఉంటాయి’’ అని 27 ఏళ్ల పాత్రికేయురాలు కృతికా ఖన్నా అన్నారు. కామాంధుల కళ్ల నుంచి తప్పించుకోవడానికి తాను ఎప్పుడూ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణిస్తానని చెప్పారు. రాత్రిపూట స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునే స్వేచ్ఛకు, రాత్రి సమయంలో ప్రైవేట్ క్యాబ్‌లో ఇంటికి చేరుకునే వెసులుబాటుకు ఈ ఘటన (ఉబర్ క్యాబ్) ముగింపు పలికిందని అన్నారు. ఈ ఘటన అనంతరం ఏ తల్లిదండ్రులూ తమ కూతుళ్లను ఒంటరిగా రాత్రి వేళల్లో క్యాబ్‌లో ప్రయాణించేందుకు అనుమతించరు అని అభిప్రాయపడ్డారు.
ఏ విధమైన రవాణా విధానం కూడా మహిళలకు సురక్షితం కాదు అన్నదానితో తాను ఏకీభవిస్తున్నానని జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ మమతా శర్మ చెప్పారు. మరింత కఠినమైన చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేసిన శర్మ, ప్రజల మైండ్‌సెట్ కూడా మారాలన్నారు. ఉబర్ క్యాబ్‌పై నిషేధం విధించడాన్ని తాను సమర్తిస్తున్నానని, ఇది ఇతర సంస్థలకు ఒక గుణపాఠం కాగలదని అన్నారు.
సొంతంగా వాహనం ఉంటే అందులో సురక్షితంగా ప్రయాణించవచ్చని అన్నారు 28 ఏళ్ల దేవోరికా అధికారి. అయితే అది అందరికీ సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వ రవాణా సాధనాలపై ఆధారపడటం అసంభవమని, అవసరమైతే తాను మెట్రోరైలులోనే ప్రయాణిస్తానని చెప్పారు. అప్పుడు కూడా తనతో పాటు మరొకరు ఉండేలా చూసుకుంటానని అన్నారు.
సీపీఎం నాయకురాలు బృందాకరత్ సైతం ఇవే అభిప్రాయాలను వెలిబుచ్చారు. ‘‘నగరానికే భద్రత లేనప్పుడు ఇక ఏ రవాణా సాధనంలో రక్షణ ఉంటుంది. నగరం సురక్షితం అన్న భావనను ప్రభుత్వం ముందుగా కల్పించాలి. రాజకీయ హామీలకు, వాటి అమలుకు మధ్యనున్న శూన్యాన్ని తొలగించాలి’’ అని పేర్కొన్నారు. నేర చట్టాల సవరణకు జస్టిస్ జేఎస్ వర్మ చేసిన సిఫార్సులను అమలు చేయాలని బృందా కరత్ సూచించారు.
ఎందులో వెళితే భద్రత?
Published Thu, Dec 11 2014 11:46 PM | Last Updated on Thu, Aug 30 2018 9:11 PM
Advertisement