నగరంలోని వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే కష్టంగా మారింది. అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది. బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, అందుకు బస్సులకు జీపీఎస్ అనుసంధానం చేసిన ప్రభుత్వం లాక్‌డౌన్ అనంతరం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ఎదురు చూసి చివరకు అధిక డబ్బులు చెల్లించి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించాల్సిన దుస్థితి ఉంది. చాలా రూట్లలో కనీసం సమయపాలన ఉండటం లేదు. నిత్యం ఆయా రూట్లలో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. ఒకరోజు ఓ సమయానికి వచ్చిన బస్సు మరోరోజు ఆ సమయానికి రావడంలేదు. దీంతో ఉద్యోగులు, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
రూట్ నంబర్ 279. సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నం. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే రూట్ ఇది. కానీ బస్సెక్కాలంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే.
ఉప్పల్ నుంచి చాంద్రాయణగుట్ట, అత్తాపూర్ రూట్‌లో మెహిదీపట్నం రాకపోకలు సాగించే ‘300 రూట్‌లో ‘ నాలుగైదు బస్సులు వరుసగా బయలుదేరుతాయి. ఆ సమయంలో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఒకటి, రెండు బస్సులు ఏర్పాటు చేస్తే చాలు. కానీ ఐదు బస్సులు ఒకేసారి బయలుదేరడం వల్ల మిగతా మూడు ఖాళీగా వెళ్లాల్సి వస్తోంది.
ఈ రెండు రూట్లే కాదు.. గ్రేటర్‌లోని అనేక మార్గాల్లో బస్సుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు డిపోల మధ్య సమన్వయం కొరవడటం వల్ల వివిధ రూట్లలో బస్సులు తరచూ బంచింగ్ అవుతున్నాయి.
నో టైమింగ్స్..
గ్రేటర్ పరిధిలో సుమారు 2,500 బస్టాపులు ఉన్నాయి. మరో 20కి పైగా బస్‌బేలు, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, కోఠీ, కాచిగూడ, ఈసీఐఎల్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బస్‌స్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు ఉన్నాయి. ప్రతిరోజూ 29 డిపోల నుంచి సుమారు 2,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన బస్‌స్టేషన్‌లలో మినహా ఎక్కడా బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో కొన్ని ముఖ్యమైన బస్టాపుల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుందో ప్రదర్శించేవాళ్లు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత దశలవారీగా పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించినప్పటికీ ‘సమయపాలన’ మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో బస్సుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన సమన్వయం..
గ్రేటర్‌లో 29 డిపోల నుంచి సుమారు 1,150 రూట్లలో బస్సులు నడుపుతున్నారు. గతంలో రోజుకు 40 వేల ట్రిప్పులు తిరిగేవి. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ట్రిప్పులు సైతం గణనీయంగా తగ్గాయి. వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్స్ రూపొందించడంలో డిపోమేనేజర్లకు, ఉన్నతాధికారులకు మధ్య కచి్చతమైన సమన్వయం లేకపోవడం వల్ల ఒకే రూట్‌లో రెండు, మూడు డిపోలకు చెందిన బస్సులు ఒకే సమయంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ‘కోవిడ్ అనంతరం బస్సుల నిర్వహణపైన సీరియస్‌గా దృష్టి సారించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు’ ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
అటకెక్కిన జీపీఎస్..
జీపీఎస్ ద్వారా బస్సుల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థను గతంలో ప్రవేశపెట్టారు. బస్సుల నిర్వహణలో శాస్త్రీయమైన పద్ధతి ఉంటుందని భావించారు. ప్రతి ట్రిప్పును లెక్క వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ వంటి అంశాలపైన అవగాహన ఏర్పడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రా జెక్టు ప్రస్తుతం అటకెక్కింది. ‘ఒకవైపు మెట్రో రైలు, మరోవైపు ప్రైవేట్ వాహనాలు గ్రేటర్ ఆరీ్టసీకి సవా ల్‌గా మారాయి. బస్సుల నిర్వహణలో కచ్చితమైన అంచనాలు ఉంటే తప్ప ఫలితాలను రాబట్టుకోవడం కష్టం..’ అని డిపో మేనేజర్ ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment