సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కూకట్‌పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్‌పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్‌చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్..
ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు.
TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023
Comments
Please login to add a commentAdd a comment