సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం పక్కదారులు పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బియ్యం రవాణా వాహనాలకే పరిమితమైన జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ధాన్యం రవాణా విషయంలోనూ పాటించాలని నిర్దేశించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్దేశించిన ‘మినిమం త్రెషోల్డ్ పారామీటర్స్ – ఎంటీపీస్’లో భాగంగా ధాన్యం రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.
ఈ వానాకాలం సీజన్‌లో వచ్చే పంట నుంచే ఈ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను కేంద్రం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో ధాన్యం వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించారు.
మిల్లులకు తీసుకెళ్లే వాహనాలన్నింటికీ...
రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక తూకం వేసి రైస్‌మిల్లులకు పంపిస్తారు. ఈ ధాన్యం రైస్‌మిల్లులకు వెళ్లాక మిల్లింగ్ అయి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఎఫ్‌సీఐ గోదాములకు తరలుతుంది. ఈ క్రమంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ గుర్తించింది.
ఈ నేపథ్యంలో మిల్లులకు ఎంత ధాన్యం వస్తోంది? మిల్లుల నుంచి బియ్యం రూపంలో గోదాములకు ఎంత పరిమాణంలో తిరిగి వెళ్తోందనే అంశంపై నిఘా కోసం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో సుమారు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒక్కో కేంద్రం నుంచి మిల్లుల లభ్యతను బట్టి పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు.
సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు..
బియ్యం లారీలు గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు... అక్కడి నుంచి పౌరసరఫరాల దుకాణాలకు చేరేందుకు 2016లోనే జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికీ సక్రమంగా అమలు కావట్లేదు. దీన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. బియ్యం లారీల కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి ప్రతినెలా బియ్యం పంపిణీ జరుపుతుండగా దీన్నే తూతూమంత్రంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ... ధాన్యం సేకరణలో జీపీఎస్ ట్రాకింగ్ చేయడం కష్టమేనని చెబుతోంది.
ఎందుకంటే ప్రతి సీజన్‌లో రెండు నెలలపాటు సాగే ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్న అన్ని లారీలతోపాటు గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రంలోని 130కిపైగా ఉన్న సెక్టార్ల నుంచి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపేటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే కేంద్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో వానాకాలం సీజన్ నుంచే ఎలా అమలు చేయాలనే దానిపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగే కార్యదర్శుల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
ధాన్యం రవాణాకూ జీపీఎస్
Published Fri, Aug 18 2023 1:12 AM | Last Updated on Fri, Aug 18 2023 1:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment