సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం.
యాసంగిలో 66.84 ఎల్‌ఎంటీల సేకరణ
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది.
కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా..
యాసంగి సీజన్‌లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్‌ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు.
మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్‌ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం
మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు.
వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది.
చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్
గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్‌ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది.
కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్‌ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
ధాన్యం దోపిడీ!
Published Mon, Feb 26 2024 12:27 AM | Last Updated on Mon, Feb 26 2024 12:01 PM
Comments
Please login to add a commentAdd a comment