ధాన్యమేదీ.. వేలం ఎట్లా? | Field inspections revealed that most mills did not have Yasangi grain | Sakshi
Sakshi News home page

ధాన్యమేదీ.. వేలం ఎట్లా?

Published Mon, Jan 29 2024 12:29 AM | Last Updated on Mon, Jan 29 2024 12:29 AM

Field inspections revealed that most mills did not have Yasangi grain - Sakshi

రూ. 32 కోట్ల ధాన్యం మాయం చేసిన కాపుగల్లులోని రైస్‌మిల్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా మార్చడం కోసం మిల్లులకు పంపిన లక్షల టన్నుల ధాన్యం మాయమైంది. రైస్‌మిల్లుల నిర్వాహకులు చాలా వరకు ధాన్యాన్ని ఎప్పుడో మర ఆడించి, బియ్యాన్ని అమ్మేసుకున్నా.. సర్కారుకు మాత్రం తమవద్దే ఉన్నట్టు లెక్కలు చూపుతూ వస్తున్నారు. దీనితో ధాన్యం నిల్వలు పేరుకుపోయా­యని భావించిన సర్కారు.. గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించి విక్రయించాలని నిర్ణయించింది.

ప్రణాళిక విభా­గం ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది. మిల్లు­ల్లో యాసంగి ధా­న్యం ఎంత నిల్వ ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. మిల్లర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మిల్లుల్లో గత యాసంగి ధాన్యాన్ని చడీచప్పుడు కాకుండా అమ్ముకున్నారని తేలడంతో.. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం నిల్వ ఉందో లెక్క తేల్చే పనిలో పడ్డారు. 

రాష్ట్ర సర్కారుపై భారం 
2022–23లో రాష్ట్ర సర్కారు సేకరించిన 66.84 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని మిల్లులకు పంపింది. మిల్లులు దాన్ని మర ఆడించి 45.07 ఎల్‌ఎంటీ బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా ఎఫ్‌సీఐకి పంపాలి. అయితే యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సిన బియ్యం తగ్గుతుందని మిల్లర్లు కొర్రీపెట్టారు.

కేంద్రం సుమారు 16 ఎంఎల్‌టీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌)గా మిల్లింగ్‌ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఆ మేరకు మర ఆడించి, 10.27 ఎల్‌ఎంటీ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇదిపోగా సుమారు 50లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉండాలి. దాన్ని మిల్లింగ్‌ చేసి 35 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. మిల్లులు బియ్యా­న్ని అప్పగించని కారణంగా ఎఫ్‌సీఐ నుంచి నిధులు రాక.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.18వేల కోట్ల భారం పడింది. 

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆగిపోయి.. 
దీన్ని రికవరీ చేసుకునేందుకు మిల్లుల్లోని ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం.. ఆగస్టులో 25 ఎల్‌ఎంటీ ధాన్యం విక్రయానికి గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో 10 సంస్థలు అర్హత పొందినా.. క్వింటాల్‌ ధాన్యాన్ని సగటున రూ.1,865 ధరకే కొంటామంటూ బిడ్లు దాఖలు చేశాయి. ధర తక్కువకావడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దుచేసి.. పలు నిబంధనలను సడలిస్తూ అక్టోబర్‌ 7న మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. ఎక్కువమంది బిడ్‌ వేసేందుకు వీలుగా.. ధాన్యం లాట్ల పరిమాణాన్ని, టర్నోవర్‌ అర్హతను తగ్గించింది. కొంత మంది కలసి జాయింట్‌ వెంచర్‌గా బిడ్డింగ్‌ దాఖలు చేసే అవకాశమూ ఇచ్చింది. దీనితో పెద్ద ఎత్తున టెండర్లు దాఖలయ్యాయి.

మిల్లర్లు కూడా సిండికేట్‌ అయి ఎవరి మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని వారే కొనుగోలు చేసుకునేలా గ్రూప్‌ టెండర్లు వేశారు. కానీ అప్పటికి ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం టెండర్ల ప్రక్రియను నిలిపేసింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత టెండర్ల ప్రక్రియను రద్దు చేసి.. కొత్తగా గ్లోబల్‌ టెండర్ల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. మిల్లుల్లో ఉన్నట్టు లెక్క చూపించిన ధాన్యానికే ధరకట్టాలనుకున్న మిల్లర్ల ప్లాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రభుత్వం తనిఖీలు చేపట్టడంతో.. అసలు సంగతి బయటపడింది.  

తనిఖీలు.. క్రిమినల్‌ కేసులు.. 
అధికారిక లెక్కప్రకారం 2022–23 యాసంగి ధాన్యమే 50లక్షల మెట్రిక్‌ టన్నుల మేర మిల్లుల్లో నిల్వ ఉండాలి. దానికి ముందు ఖరీఫ్‌ (వానాకాలం)కు సంబంధించిన ధాన్యం 8 లక్షల టన్నులు.. ఇటీవల సేకరించిన 2023–24 వానాకాలం ధాన్యం 45 లక్షల టన్నులు కూడా ఉండాలి. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 3,300 రైస్‌మిల్లుల్లో కలిపి కోటి టన్నులకుపైగా ధాన్యం నిల్వలు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఎక్కడా తగినస్థాయిలో ధాన్యం కనిపించడం లేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ల ఆదేశాల మేరకు.. అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని డీఎస్‌ఓలు, డీఎంల బృందాలు మిల్లుల్లో 2022–23 ఖరీఫ్, రబీ ధాన్యం లెక్కలను పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నాయి. 

► ఇటీవల పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో మిల్లర్లు ఏకంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికే ‘సీఎంఆర్‌’బియ్యాన్ని విక్రయించినట్టు తేలింది. దీనిపై కేసులు నమోదు చేస్తున్నారు. 
► కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులోని ఓ రైస్‌మిల్లుకు 38 టన్నుల ధాన్యం కేటాయించగా.. 23,504 క్వింటాళ్లు మాయమైనట్టు గుర్తించారు. రూ.7.18 కోట్లు జరిమానా చెల్లించాలని నోటీసులిచ్చి, మిల్లు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. 
► మెదక్‌ జిల్లాలోని హవేలీ ఘన్‌పూర్‌లోని ఓ మిల్లులో రూ.4.75 కోట్ల విలువైన 1,422 టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇక్కడి డూర్గుపల్లిలోని ఓ మిల్లులో రూ.2 కోట్ల విలువైన బియ్యం మాయమైంది.  
► సూర్యాపేట జిల్లాలో ధాన్యాన్ని పక్కదారి పట్టించిన 12 మిల్లులపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద కేసులు పెట్టారు. 
► జోగులాంబ గద్వాల జిల్లాలోని 3 రైస్‌మిల్లులపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. వనపర్తిలోని 5 మిల్లుల్లో స్టాక్‌లో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించారు. 
► సిద్దిపేట జిల్లాలో 20 మిల్లులు వడ్లను అమ్మేసుకున్నట్టు తేల్చారు. 
► నిజామాబాద్‌ జిల్లాలో 8 మిల్లుల్లోని స్టాక్‌లో రూ.33 కోట్ల మేర తేడాలు ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అత్యధికంగా గంగారైస్‌ మిల్‌ నుంచి రూ.8.09 కోట్లు, రాయల్‌ ట్రేడింగ్‌ కంపెనీ రూ.6.48 కోట్లు, ఎంఎస్‌ఆర్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రూ.5.05 కోట్ల బకాయిలు ఉన్నట్టు గుర్తించారు.  

రెండు మిల్లుల్లోనే రూ.100 కోట్ల ధాన్యం తేడా! 
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) పక్కదారి పట్టింది. ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని రైస్‌ ఇండస్ట్రీస్‌కు రూ.32 కోట్ల విలువైన ధాన్యం పంపగా.. మిల్లర్‌ ఒక్క బియ్యం గింజ కూడా తిరిగి పంపలేదు. అధికారులు ఈ మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. ఇక కోదాడ పట్టణంలోని ఓ రైస్‌మిల్లుకు వానాకాలం, యాసంగికి సంబంధించి మొత్తం 38,660 టన్నుల ధాన్యం పంపగా.. 26,036 టన్నుల బియ్యం రావాలి. కానీ మిల్లు యజమాని ఇప్పటివరకు 5,564 టన్నుల బియ్యమే తిరిగిచ్చారు. ఇంకా రూ.70 కోట్ల విలువైన 20,472 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement