సకాలంలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా చేసే యోచన
రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం.. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే యోచన
2022–23 రబీకి చెందిన 35 ఎల్‌ఎంటీల ధాన్యం వేలంపై రగడ
కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం ఇవ్వకుండా నాన్చుతున్న మిల్లర్లు
రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందంటున్న బీఆర్‌ఎస్
వేలం ప్రక్రియపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
నేడో రేపో సర్కారు కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్‌లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది.
మిల్లర్ల విషయంలో ఉదాసీనత
గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన 35 ఎల్‌ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్‌ఎంటీల్లో 2 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్‌లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.
2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ
ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్‌సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను సీఎంఆర్‌గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్‌ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్‌లో 65 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్‌లకు పరిమితం చేశారు.
అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి.
కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్‌ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా..
మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది.
ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్
ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment