ట్యాంకర్లకు జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: పేదల గొంతు తడపాల్సిన మంచినీటి ట్యాంకర్లు దారి తప్పుతున్న వైనంపై ‘పెద్దలకే నీళ్లు’ పేరుతో ‘సాక్షి’ ప్రధాన సంచికలో, ‘‘అవి‘నీటి’ వ్యాపారం’’ పేరుతో హైదరాబాద్ టాబ్లాయిడ్‌లో శనివారం ప్రచురించిన కథనాలపై జలమండలి ఎండీ దానకిశోర్ స్పందించారు. దారి తప్పుతున్న ట్యాంకర్లకు తక్షణమే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి జాడను పసిగట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.
శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేశారు. మంచినీటి సరఫరా, సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. ట్యాంకర్లకు డబ్బులు వసూలు చేయడంపై ఆరా తీశారు. ట్యాంకర్ల ద్వారా నీరు పొందిన కొందరు వినియోగదారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
జీపీఎస్‌తో అక్రమార్కుల ఆటకట్టు
మంచినీళ్లు లభించక గొంతెండుతున్న ప్రజల బాధలను తెలుసుకొనేందుకు దానకిశోర్ మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా తదితర ప్రాంతా ల్లో పర్యటించారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. దారి తప్పుతున్న ట్యాంకర్ల జాబితాను సిద్ధం చేయాలని నిఘా అధికారులను ఆదేశించారు. అక్రమంగా తరలుతున్న ట్యాంకర్లను నియంత్రించేందుకు జీపీఎస్ ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
ఇక నియంత్రణ ఇలా: జీపీఎస్ ద్వారా వాటర్ ట్యాంకర్‌ల కదలికలను కచ్చితంగా అంచనా వేస్తారు. ప్రజల అవసరాల మేరకు ట్రిప్పులు పెంచుతారు. జలమండలితో పాటు, జీహెచ్‌ఎంసీ వాటర్ ట్యాంకర్‌లను సైతం జీపీఎస్ పరిధిలోకి తెస్తారు. స్మార్ట్ కార్డు ఉన్న ట్యాంకర్లు మాత్రమే జలమండలి నుంచి నీటిని చేరవేయాలి. ప్రస్తుతం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుండగా, ఇక నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అందజేయాలని ఎండీ సూచించారు.