బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెంట్స్ అసోసియేషన్ల నుంచి రీసైకిల్ చేసిన లేదా శుద్ధి చేసిన నీరు వంటి వాటి కోసం ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషిస్తోంది. రోజుకు సుమారు 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీటిని బెంగళూరు ప్రజలు ఉపయోగిస్తున్నట్లు.. నీటి కొరత వల్ల నేడు 1500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడిందని సమాచారం.
నీటి నిర్వహణ చర్యలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. గత వరం రోజుల నుంచి అధికార పక్షం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.
నీటి సమస్యను తీర్చడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉండబోతున్నట్లు.. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది.
నీటి కొరత పెరుగుతున్న తరుణంలో ట్యాంకర్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గతంలో రూ.1000 నుంచి రూ. 1500 వరకు ఉన్న ట్యాంకర్ ధర ఇప్పుడు రూ. 2000కు చేరింది. అయితే ప్రభుత్వం కూడా కొత్త ధరలను ప్రకటించింది. ఈ ధరలకే వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది (కొత్త ధరలు GSTతో సహా ఉంటాయి).
బెంగళూరులో వాటర్ ట్యాంకర్ రేట్లు
5 కిమీ పరిధిలో ట్యాంకర్ల ధరలు
6000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.600
8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.700
12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1000
5 కిమీ కంటే ఎక్కువ పరిధిలో ట్యాంకర్ల ధరలు
6,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ - రూ. 750
8,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.850
12,000 లీటర్ల నీటి ట్యాంకర్ - రూ.1200
Comments
Please login to add a commentAdd a comment