ఖాకీపై జీపీఎస్ నిఘా | police on the GPS surveillance | Sakshi
Sakshi News home page

ఖాకీపై జీపీఎస్ నిఘా

Published Tue, Feb 24 2015 12:47 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM

police on the GPS surveillance

కొందరిలో ఆందోళన

ఇప్పటి వరకు నామమాత్రంగా నైట్ బీట్లు నిర్వహించిన కొందరు సిబ్బంది జీపీఎస్ విధానం అమల్లోకి రావడంతో ఆందోళనలో పడ్డారు. ఈ విధానంతో విధులు భారంగా మారుతాయని భావిస్తున్నారు.
 
పోచమ్మమైదాన్ :  ఖాకీల పని విధానంపై ఇక నిఘా పెరగనుంది. క్షేత్రస్థారుులో సిబ్బంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారో.. పెట్రోలింగ్ వాహనాలను ఎక్కడ నిలిపారో క్షణాల్లో ఉన్నతాధికారులకు తెలిసిపోనుంది. ఇందుకనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పోలీస్ వాహనాల నియంత్రణ, సిబ్బంది పనితీరుపై నిఘా పెంచడమేగాక ప్రజలకు సత్వర సేవలందించేందుకుగాను తాజాగా జీపీఎస్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు అర్బన్ ఇన్‌చార్జ్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా తనదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జనసంచారం, వాహనాల రద్దీ పెరగనున్న క్రమంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎస్పీ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేరుుంచిన ఆయన కొత్తగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. నగరంలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా వాహనం ఎక్కడ ఉందనే  సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడం ద్వారా ఆ వాహనాన్ని నియంత్రించే శక్తి కూడా ఎస్పీ చేతిలోనే ఉంటుంది.
 
త్వరలో జిల్లావ్యాప్తంగా అమలు : అంబర్ కిశోర్ ఝా, వరంగల్ అర్బన్ ఇన్‌చార్జ్ ఎస్పీ

రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేస్తామన్నారు. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో సోమవారం పెట్రోలింగ్ జీపీఎస్ వాహనాలను ప్రారంభించి, బ్లూకోల్ట్స్ బీట్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లా కోసం కూడా జీపీఎస్ కమాండింగ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జీపీఎస్ సిస్టమ్ పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్, క్రైం డీఎస్పీ ఈశ్వరరావు, ఇంతేజార్‌గంజ్, మిల్స్‌కాలనీ, మహిళా పీఎస్, రూరల్ క్రైం సీఐలు ఫణీందర్, సత్యనారాయణ, ప్రభాకర్ రావు, అలీ, మట్టెవాడ ఎస్సై రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
 
 
బ్లూ కోల్ట్స్‌కు  స్మార్ట్ ఫోన్‌లు
 
బ్లూ కోల్ట్స్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. బ్లూకోల్ట్స్ బీట్ పరిధిలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే ఫొటో తీసి కంట్రోల్ రూంకు పంపించాలి. ఇలా సంఘటనను స్మార్ట్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన తక్షణమే డీఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని క్షణాల్లో పంపడం ద్వారా అధికారులు ఇందుకోసం చర్యలు తీసుకుంటారు. అలాగే బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన నిందితులు కన్పిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం పంపిస్తారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌కు కూడా జీపీఎస్ సిస్టమ్ పని చేస్తుంది.
 
అనుసంధానం ఇలా
 
తొలుత జీపీఎస్ పరికరాన్ని వాహనంలో అమర్చుతారు. ఇది శాటిలైట్‌తో అనుసంధానమై ఉంటుంది. దాని ద్వారా కంట్రోల్ రూమ్‌కు సిగ్నల్స్‌కు అనుసంధానం చేస్తారు. వాహనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా జీపీఎస్ కోడ్ ఆధారంగా ఏ వాహనం గురించైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనం ఎక్కడ నిలిపి ఉంది.. ఎంత స్పీడుతో వెళ్తోందనే విషయూలు కూడా తెలుస్తారుు. వాహనంలో ఉన్న సిబ్బంది ఒకచోట ఉండి మరో చోట ఉన్నామని అబద్ధం చెప్పినా ఆ వాహనం అక్కడే నిలిచిపోయేలా  కంట్రోల్ రూం ద్వారా ఆపివేసే సౌకర్యం కూడా ఉండడం గమనార్హం.      
 
పని తీరు ఇలా...

 
ఏదైనా ప్రాంతంలో సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించడంతోపాటు సంఘటన స్థలానికి  త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకుగాను ఆ పరిసర ప్రాంతానికి దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ వాహనంను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి ఆ బృందానికి ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేస్తారు. దీంతో పోలీసులు త్వరగా సంఘటన స్థలానికి చేరుకుని  సేవలందించే అవకాశం ఉంటుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement