ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత కరువు | security drought at ATM centers | Sakshi
Sakshi News home page

ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత కరువు

Published Thu, Jan 2 2014 5:13 AM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

security drought at ATM centers

 సాక్షి, ఒంగోలు: ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలో నిలబడే బాధ తప్పడం, ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బు వెంట పట్టుకుని ఉంటూ బిక్కుబిక్కుమనే కన్నా అవసరమైనప్పుడు నగదు డ్రా చేసుకునే వసతి ఉంది.  ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే..బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయే కానీ వాటి బాగోగులు పట్టించుకోవడం మానేశాయి. ఏటీఎంలు తరచూ రిపేర్లనో, నగదు లేదనో బోర్డు తగిలించి పేరుకు మాత్రమే ఉన్నాయనిపిస్తున్నారు. అనేక చోట్ల ఏటీఎం సెంటర్లకు రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డులు ఉండటం లేదు. ఏటీఎంలపై పోలీస్ నిఘా కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది.  

దీంతో ఏటీఎంల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ బుధవారం జిల్లావ్యాప్తంగా  జరిపిన విజిట్‌లో అనేక చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డులు లేని దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరిపే పోలీసులు ఏటీఎంలకు షట్టర్లు మూసి ఉంటే ప్రత్యేకంగా వాటి వద్దకెళ్లి పరిశీలించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం అనేక చోట్ల అమలు కావడం లేదు.

 జిల్లాలోని అన్ని బ్యాంకులకు సంబంధించి 380 శాఖలకు గాను 180 ఏటీఎం సెంటర్లున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు ప్రతి శాఖకు ఒక ఏటీఎంను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ, సెక్యూరిటీ విషయంలో కొన్ని బ్యాంకు శాఖలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి.  అన్ని బ్యాంకులు తమ ఏటీఎంల వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినప్పటికీ పలువురు అవకతవకలకు పాల్పడుతుండటంతో అలాంటి వారిని తొలగించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం అనేక  ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. అన్ని ఏటీఎంలలో సీసీ కెమెరాల సౌకర్యం ఏర్పాటు చేసినా వాటికి సంబంధించిన ఫుటేజ్‌లు కేవలం ఆరు నెలల వరకు మాత్రమే సక్రమంగా ఇమేజ్‌లు కనిపించే అవకాశం ఉంది.
 ఒంగోలులో...
 ఒంగోలు నగరంలో మొత్తం 58 బ్యాంకు శాఖలకు సంబంధించి 20 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. నగరంలోని నెల్లూరు బస్టాండ్‌లో ఉన్న కార్పొరేషన్, కెనరా, సిండికేట్ బ్యాంకుల వద్ద, సంతపేటలోని ఎస్‌బీహెచ్ వద్ద, వీఐపీ రోడ్డులోని ఎస్‌బీఐ, కొణిజేడు బస్టాండ్ వద్ద గల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు.  
 అద్దంకిలో..
 కొరిశపాడు మండలంలో మేదరమెట్ల, రావినూతల, పమిడిపాడుల్లో ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. మండలంలో ఉన్న ఏటీఎంలలో ఏఒక్క సెంటరుకూ సెక్యూరిటీ లేదు. అద్దంకి లోని ఏటీఎంలలో బంగ్లారోడ్లలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం సెంటరు వద్ద ఎలాంటి సెక్యూరిటీ ని ఏర్పాటు చేయలేదు. పంగులూరు మండలంలో ఉన్న ఒక్క ఏటీఎంలో సహితం సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు.
 చీరాలలో...
 చీరాల పట్టణంలో అనేక బ్యాంకు శాఖలకు చెందిన ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డుల్లేరు. ఎస్‌బీహెచ్ బ్యాంకు పక్కన, ఎంజీసీ మార్కెట్ వద్ద ఉన్న ఏటీఎంలకు సెక్యూరిటీగార్డులు లేరు. అలానే హైస్కూల్ రోడ్డులోని ఐఓబీకు కూడా సెక్యూరిటీ గార్డు లేరు.
 దర్శిలో...
 ఓరియంటల్, సిండికేట్, పొదిలి రోడ్డులోని ఎస్‌బీఐ కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ అక్కడ సెక్యూరిటీ గార్డుల్లేరు. దర్శి ప్రాంతం నుంచి అనేక ఆర్టీసీ సర్వీసులు హైదరాబాద్ వైపు రాత్రి  వేళ ఉన్నాయి. పలువురు ప్రయాణిలు ఈ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద రక్షణ లేక పోవడంతో ఏటీఎం కార్డుదారులు వెళ్లటానికి భయపడుతున్నారు.
 కొండపిలో...
 కొండపి భారతీయస్టేట్ బ్యాంకు పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు, టంగుటూరులోని ఒంగోలు వెళ్లే రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఎస్‌బీహెచ్ ఏటీఎం, కొండపి రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం, శింగరాయకొండ ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం,  ప్రశాంతి థియేటర్ ఎదురుబజార్‌లో కెనరాబ్యాంకు ఏటీఎం, సోమరాజుపల్లి పంచాయతీలో ఉన్న ఆంధ్రాబ్యాంకు వద్ద శింగరాయకొండలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సిండికేట్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. పొన్నలూరులో ఉన్న స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్ద అదే విధంగా మండలంలోని అగ్రహరంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటియం వద్ద సైతం సెక్యూరిటి గార్డులను ఏర్పాటు చేయలేదు.
 మార్కాపురంలో.. మార్కాపురంలో  10 ఏటీఎం సెంటర్లు, తర్లుపాడులో 1, పొదిలిలో 3, కొనకనమిట్లలో 1చొప్పున కేంద్రాలు ఉండగా, వీటిలో పలు చోట్ల సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ మినహా ఇతర బ్యాంక్‌ల్లో సెక్యూరిటీ గార్డులు లేరు.
 పర్చూరులో..
 పర్చూరులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. గన్నవరం సర్కిల్‌లో ఉన్న ఏటీఎం కేంద్రం సక్రమంగా పనిచేయకపోగా ఎలాంటి సెక్యూరిటీ లేదని జనం పేర్కొంటున్నారు. కారంచేడులో ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ లేదు. చినగంజాంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఏటీఎం కేంద్రానికి, సినిమాహాలు సెంటరులో ఉన్న ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ సిబ్బంది లేరు.
 సంతనూతలపాడులో...
 పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న యాక్సిస్‌బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కౌంటర్‌లో, రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో సెక్యూరిటీ గార్డులేడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement