రెండు ఏటీఎం కేంద్రాలపై దాడి
♦ మెదక్ జిల్లాలో తెగబడ్డ దోపిడీ ముఠా
♦ శివ్వంపేటలో రూ. 80 వేలు చోరీ
♦ నిజాంపేటలో విఫలయత్నం
రామాయంపేట/పుల్‌కల్: మెదక్ జిల్లాలో ఏటీఎంలపై దోపిడీ దొంగలు మరోసారి తెగబడ్డారు. ఐదుగురు సభ్యులున్న ముఠా పుల్‌కల్ మండలం శివ్వంపేట, రామాయంపేట మండలం నిజాంపేటలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రాలపై గంటల వ్యవధిలో దాడి చేసింది. శివ్వంపేటలో దాదాపు రూ. 80 వేల నగదుతో ఉడాయించగా.. నిజాంపేటలో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేసింది. వివరాలివీ.. పుల్‌కల్ మండలం శివ్వంపేటలోని ప్రధాన రహదారిపై గల ఇండిక్యాష్ ఏటీఎం కేంద్రంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌ను ధ్వంసం చేసి రూ. 80 వేలు తస్కరించారు.
గంటల వ్యవధిలో బుధవారం తెల్లవారుజామున 3.40 గంట లకు రామాయంపేట మండలం నిజాంపేటలోని ఏటీఎం కేంద్రంపై దుండగులు దాడి చేశారు. బొలెరో వాహనంలో వచ్చిన ఈ దుండగులు నేరుగా వాహనం నుంచే వైరు కనెక్షన్ తీసుకుని నిమిషాల మీద కట్టర్‌తో ఏటీఎంను కత్తిరించారు. ఈ అలికిడికి ఏటీఎం కేంద్రం భవనం పై గదిలో అద్దెకున్న సైనికుడు బెస్త సిద్దిపేట ఎల్లంతోపాటు ఇంటి యజమాని భూమాగౌడ్ నిద్రలేచి కిందికి వచ్చారు.
ఏటీఎం కేంద్రంలోకి వైరు లాగి ఉండటాన్ని గమనించారు. వీరి రాకను గమనించిన దుండగులు.. సైనికుడు ఎల్లంపై రాయితో దాడిచేసి వాహనంలో పారిపోయారు. ఆ వెంటనే ఎల్లం 100 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కుసమాచారమిచ్చాడు. సైనికుడు, ఇంటి యజమాని సకాలంలో రాకపోతే దుండగులు డబ్బు ఎత్తుకెళ్లేవారు. ఏటీఎంను కట్టర్‌తో కత్తిరించినా డబ్బులు భద్రంగానే ఉన్నాయని పోలీ సులు తెలిపారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాల కోసం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుమతి రెండు చోట్ల ఏటీఎం కేంద్రాలను సందర్శించారు. ధ్వంసమైన ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల క్రితం ఇలాగే...
ఇదిలావుంటే మూడు నెలల క్రితం ఇదే తరహాలో దుండగులు ఒకేరోజు మూడు ఏటీఎం కేంద్రాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 16న సంగారెడ్డి పాత బస్టాండ్‌లోని ఇండి క్యాష్ ఏటీఎం కేంద్రంలో రూ.3.21 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి కౌడిపల్లిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో దోపిడీకి విఫలయత్నం చేశారు. చివరగా మెదక్‌కు చేరుకున్న దుండగులు ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేశారు. ఏటీఎంకు మంటలు అంటుకోవడంతోపాటు పోలీసుల రాకను గమనించి పరారైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలోనే మరోసారి ఏటీఎంలను టార్గెట్ చేయడం గమనార్హం.