ఫిర్యాదుదారుడే దొంగ | Police Arrested Moner Robbery Thief In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారుడే దొంగ

Published Sun, Aug 11 2019 10:16 AM | Last Updated on Sun, Aug 11 2019 10:16 AM

Police Arrested Moner Robbery Thief In Visakhapatnam - Sakshi

కేసును ఛేదించిన సీఐ తిరుపతిరావుకు రివార్డు అందిస్తున్న నగర సీపీ ఆర్‌కే మీనా

సాక్షి, విశాఖపట్నం : వ్యసనాలకు బానిసై... భారీగా అప్పులు చేసి... వాటిని తీర్చేందుకు పనిచేస్తున్న సంస్థకే పంగనామాలు పెట్టేందుకు సిద్ధమైన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తనపై దుండగులు దాడి చేసి రూ.20 లక్షలు దోచుకుపోయారంటూ నగర పోలీసులను పరుగులు పెట్టించిన నారావుల శ్రీనివాసరావే అసలు నిందితుడని, దోపిడీ అంతా నాటకమని నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ ఆర్‌కే మీనా శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారావుల శ్రీనివాసరావు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో 12 ఏళ్లుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద హైదరాబాద్‌ వెళ్లిన శ్రీనివాసరావు చేతికి ఆ సంస్థ యజమాని పూర్ణేంద్ర రూ.19లక్షల నగదు ఇచ్చాడు.

వాటికితోడు గాజువాకలోని బ్యాంకులో ఒక రూ.లక్ష విత్‌డ్రా చేసి విశాఖపట్నంలో ఉన్న అభిషేక్‌ కంపెనీ యాజమాన్యానికి అందజేయాలని ఆదేశించాడు. అక్కడి నుంచి రూ.19లక్షలు తీసుకుని బుధవారం(ఈ నెల 7న) ఉదయం విశాఖపట్నం వచ్చిన శ్రీనివాసరావు గాజువాకలోని బ్యాంకులో రూ.లక్ష డ్రా చేసి మొత్తం రూ.20లక్షలు తన స్కూటీ డిక్కీలో పెట్టాడు. ఆ డబ్బులు నగరంలోని అభిషేక్‌ కంపెనీ కార్యాలయంలో అందించేందుకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరాడు. అనంతరం పోర్టు రహదారిలో స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీపీఎల్‌ కంపెనీకి ఎదురుగా దుండగులు దాడి చేసి రూ.20లక్షలు దోచుకుపోయారని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే తాను ఇబ్బందుల్లో ఉన్నట్లు తన స్నేహితుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. దాడి జరిగినట్లు నమ్మించేందుకు తనే తనపై  బ్లేడుతో గాయపరుచుకున్నాడు.

దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎయిర్‌పోర్టు జోన్‌ క్రైమ్‌ పోలీసులకు శ్రీనివాసరావు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో లోతుగా ఆరా తీశారు. సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సొమ్ము రూ.20లక్షలు కాజేసేందుకు తానే నాటకం ఆడినట్లు అంగీకరించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు శరీరంపై గాయాలు చేసుకుని, దుస్తులు చింపుకున్నట్లు ఒప్పుకున్నాడు. వ్యసనాలకు బానిస కావడంతో భారీగా అప్పులు చేశానని, వాటిని తీర్చేందుకు ఈ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. అందరినీ నమ్మించేందుకు తనను తానే బ్లేడ్‌తో కోసుకుని తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నారావుల శ్రీనవాస్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించామని సీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ స్వరూప, తదితరులు పాల్గొన్నారు. 

ఏటీఎం కేంద్రాల్లో జాగ్రత్త 
నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రా చేసేటప్పుడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సీపీ ఆర్‌కే మీనా సూచించారు. కేంద్రాల్లో దుండగులు కాచుకుని ఉంటున్నారని, అటువంటి వారితో జాగ్రత్తలు పాటించాలఅన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, దోపిడీ జరిగినా 100 నంబర్‌కి ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ బిల్లా, ఏడీసీపీ సురేష్‌బాబుల సూచల మేరకు కేసు దర్యాప్తు చేపట్టి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విశాఖ సిటీ క్రైం సీఐలు అవతారం, ఎన్‌.కాళిదాస్‌లతోపాటు ఎస్సైలు మన్మథరావు, సూరిబాబు, విజయ్‌కుమార్, హెచ్‌సీ మురళి, కానిస్టేబుల్‌ సుధాకర్‌లను అభినందించి రివార్డులు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement