సాక్షి, అమరావతి: వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం బ్యాంకులు తెరుచుకోవడంతో నగదు తీసుకోవడానికి జనం పోటెత్తారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూకట్టారు. ఇక్కడా అక్కడా అన్న తేడా లేదు.. పల్లెటూరు నుంచి పట్టణాల దాకా రాష్ట్రమంతా ఇదే విధమైన పరిస్థితి కనిపించిం ది. తెల్లవారకుండానే పలుచోట్ల క్యూలు కట్టారు. నగదు కోసం పనులన్నీ మానుకుని క్యూల్లో వేచి చూశారు. ‘ఈ రోజైనా డబ్బులు దొరికితే ఇబ్బందులు తొలుగుతాయి’ అని ఆశించా రు. అయితే చాలా మందికి ఆశ నిరాశగానే మారింది. కొంతమందికే నగదు చేతికి వచ్చింది. అదీ అరకొరగానే. ఒక్కో ఖాతాదారుడికి కొన్ని చోట్ల రెండు వేలు చొప్పున ఇస్తే.. మరి కొన్ని చోట్ల ఆరువేలు చొప్పున బ్యాంకర్లు పంపిణీ చేశారు. రాత్రి పొద్దు పోయేవరకూ క్యూల్లో నుంచున్నా చాలా మందికి ఆ కాస్త నగదు కూడా దొరకలేదు.
పలు జిల్లాల్లో ఏటీఎంలు పనిచేయలేదు. ఏటీఎంలలో నగదు పెడతారేమోనన్న ఆశతో జనాలు అక్కడే కూర్చుండిపోవడం కూడా కనిపించింది. పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద గంటలకొద్నీ క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడ్డారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ లైన్లలో మహిళలదీ అదే పరిస్థితి. ఇక జీ తం డబ్బులు తీసుకుందామని బ్యాంకులకు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. సెలవు పెట్టి వచ్చినా నగదు చేతికిరాలేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
పనిచేయని ఏటీఎంలు..
తూర్పుగోదావరి జిల్లాలో 931 ఏటీఎంలు ఉంటే.. మంగళవారం సాయంత్రం వరకూ ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. రాజమండ్రి వద్ద ఏటీఎంలో నగదు పెట్టిన గంటకే డబ్బు లు అయిపోవడంతో బ్యాంకుపై జనం ఎగబడ్డారు. దీంతో మేనేజర్ కొంత సమయం తీసుకొని తిరిగి నగదు నింపడంతో ప్రజలు శాంతించారు. అలాగే కర్నూలు జిల్లాలోని 475 ఏటీఎం ల్లో కేవలం రెండు మాత్రమే కొద్ది సేపు పనిచేశాయి. వైఎస్సార్ జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మినహా మరెక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. పనిచేసిన ఏటీఎంల్లో రెండు వేల నోటు వస్తుండటంతో చిల్లర మార్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాగా, బ్యాంకులకు జనం భారీ ఎత్తున తరలిరావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. అంతేగాక అదనంగా ప్రైవేటు సెక్యూరిటీ సేవలను వినియోగించుకున్నారు.
కొనసాగుతున్న నగదు కొరత
పెద్ద నోట్ల రద్దయి ఐదు వారాలు గడుస్తున్నా అటు బ్యాంకులకు, ఇటు ప్రజలకు కష్టాలు తీరడంలేదు. బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్‌బీఐ నుంచి అదనపు నిధులు రాకపోగా, ప్రజల నుంచి డిపాజిట్లు కూడా తగ్గిపోయాయి. కేవలం రెండు వేల నోట్లు తప్ప మిగిలిన చిన్న నోట్లు బ్యాంకులకు తిరిగి రావడం లేదని ఎస్‌బీఐ మేనేజర్ ఒకరు చెప్పారు. దీంతో ఇప్పటికీ కేవలం నాలుగు వేలు, ఆరువేలు మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం వచ్చిన 20, 50 నోట్లను మంగళవారం మధ్యాహ్నానానికి అన్ని శాఖలకు పంపిణీ చేసినట్లు బ్యాంకర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నగదు మరో రెండు రోజులకు సరిపోతుందని, శుక్రవారం లోపు మళ్లీ నగదు వస్తే ఫర్వాలేదు కానీ, లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
అర్థరాత్రి నుంచే క్యూలో..
వైఎస్సార్ జిల్లాలోని రాయచోటిలో సోమవారం రాత్రి నుంచే జనాలు బ్యాంకుల వద్దకు వచ్చి క్యూలైన్లలో నిద్రించారు. జిల్లాలో అక్కడక్కడ తోపులాటలు జరిగాయి. అయితే ఈ పరిస్థితిని ఊహించిన పోలీసులు ముందస్తుగా బ్యాంకుల ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కొంతమేరకు ఒత్తిడి తగ్గింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌కార్యాలయంలో పింఛన్ల పంపిణీ రసాభాసగా మారింది. ఐసీఐసీఐ బ్యాంకు చెందిన పంపిణీ సిబ్బంది రాకపోవడంతో పింఛన్‌దారులు ఆందోళన చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు బ్యాంకు మేనేజర్లు తీవ్ర ఒత్తడి ఎదుర్కొంటున్నారు. ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. కర్నూలు నగర కేంద్రంలోని ట్రెజరీశాఖకు నగదు రాకపోవడంతో ఉద్యోగులందరూ బ్యాంకును చుట్టుముట్టారు. తాము జీతం ఇంత వరకూ తీసుకోలేదని మండిపడ్డారు. బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే, కేవలం మీ శాఖకు రూ.5 లక్షలు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో తన వల్ల కాదంటూ మేనేజర్ బ్రాంచ్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి.
పలుచోట్ల ధర్నాలు
గంటల తరబడి క్యూలో నిల్చొన్నాక బ్యాంకు అధికారులు వచ్చి చెల్లింపులకు డబ్బుల్లేవు, డిపాజిట్ చేసేవారే లోపలకి రండి అనడంతో ఖాతాదార్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మేము మనుషులమనుకుంటున్నారా.. యంత్రాలమనుకుంటున్నారా..’ అంటూ గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్‌బీహెచ్ ఎదుట మంగళవారం వృద్ధులు, పింఛన్‌దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇదే జిల్లా యడ్లపాడు ఎస్‌బీఐ బ్రాంచి ఖాతాదారులు, పెన్షనర్లు జాతీయ రహదారి పైకి వెళ్లి రాస్తారోకో చేశారు. తుళ్లూరు మండలం పెద్దపరిమిలోలోనూ ఇదేపరిస్థితి నెలకొంది. స్థానిక చైతన్యగోదావరి బ్యాంకు ముందు ఉదయం నుంచి క్యూలో ఉన్న ఖాతాదార్లకు బ్యాంకు సిబ్బంది డబ్బుల్లేవని చెప్పడంతో ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు.
ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రివ్యూలో పాల్గొనేందుకు వస్తున్న ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ల వాహనాలను ఖాతాదార్లు అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి డబ్బులు రాలేదని మేనేజర్ సమాధానం ఇవ్వటంతో ఖాతాదారులను శాంతింపజేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. డబ్బులు వస్తాయని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకొన్నారు.
క్యూలైన్లో కుప్పకూలిన వృద్ధుడు
జంగారెడ్డిగూడెం రూరల్: పింఛను సొమ్ము కోసం గంటలతరబడి క్యూలైన్లో నిల్చొన్న వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం కేతవరంలో మంగళవారం చోటు చేసుకుంది. బొర్రా వెంకట్రావు (65) అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామంలోని ఎస్‌బీఐ కియోస్క్ బ్రాంచికి వెళ్లి క్యూలో నిల్చొన్నాడు. కొద్దిసేపటికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఆటోలో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడు.
క్యూలో సొమ్మసిల్లిన యువతి
క్రోసూరు: ఇంటి ఖర్చుల కోసం నగదు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ యువతి గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయింది. గుంటూరు జిల్లా క్రోసూరులోని ఎస్‌బీఐ బ్రాంచి వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం పెద్దసంఖ్యలో జనం బారులుతీరడంతో బ్యాంకు సిబ్బంది లోపలికి కొంతమందిని అనుమతిస్తూ తలుపులు వేసుకొని పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలో నిలుచున్న యువతి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. మిగిలినవారు ఆమెకు సపర్యలు చేయటంతో తేరుకుంది.
ఏటిఎంలో నగదు పెట్టం
‘ఏటీఎంలో నగదు పెట్టడం జరగని పని. నగదు పెట్టిన గంటలోపే ఖాళీ చేస్తున్నారు. పైగా అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డు దారులు వినియోగించుకొంటున్నారు. అందుకని కేవలం మా బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించాలంటే బ్యాంకులోనే చెల్లింపులు చేయాలని నిర్ణయించాం. అంతకంటే మేమేమీ చేయలేం’ క్రోసూరు ఎస్‌బీఐ మేనేజర్ కిరణ్ కుమార్ కరాఖండిగా చెప్పారు.
క్యూలో నిలవలేక...
పిట్టలవానిపాలెం: నగదు కోసం బ్యాంకుకు వచ్చిన ఓ వృద్ధుడు క్యూలో నిలబడిన కొద్దిసేపటికే నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకు శాఖ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు ఉద్యోగి నల్లిబోయిన సాంబయ్య పింఛను కోసం బ్యాంకు ముందు క్యూలో నిలబడ్డారు. కొద్దిసేపటికి నీరసించి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
జన వేదన
తిరగలేక చస్తున్నాం
ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏటీఎంలలో ఎక్కడ డబ్బులొస్తున్నాయోనని తిరుగుతున్నా. ఏడు ఏటీఎంల వద్దకెళితే డబ్బులు రావడంలేదు. చివరికి ఇక్కడకొచ్చా. మూడు గంటలు నిలబడితే గానీ డబ్బులు రాలేదు. డబ్బుల కోసం నరకం చూస్తున్నాం. – రామారావు, గాంధీనగర్, విజయవాడ
ఈ వయసులో ఈ బాధేంటి?
ఈ వయసులో నాకు ఈ బా«ధేంటీ.. మంచంలో ఉన్న నేను ఇద్దరి సహకారంతో పింఛన్ కోసం బ్యాంక్‌కు రావాల్సి వచ్చింది. కాళ్లు, చేతులు సహకరించక అల్లాడుతున్న మాలాంటి వారిని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది.
మా ఉసురు తగులుతుంది.
– హుస్సేన్‌బీ, వృద్దురాలు, మాచర్ల, గుంటూరు జిల్లా
పెళ్లికి డబ్బులివ్వకపోతే ఎలా?
ఈ నెల 24న మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కోసం ముందుగా తెచ్చుకున్న రూ.లక్ష అనంతసాగరం సిండికేట్ బ్యాంక్‌లో జమ చేశాం. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే అంత మొత్తం ఇవ్వలేమంటున్నారు. మేము పెళ్లి ఎలా చేయాలో దిక్కు దోచటం లేదు.
–షేక్ గుల్జార్, సోమశిల, నెల్లూరు జిల్లా
జీతం కూడా తీసుకోలేకపోతున్నాం
జీతం కూడా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు సమయానికి వెళ్లడం తప్పనిసరి. బ్యాంకులేమో పది గంటలు అయితే తప్ప తెరుచుకోవడం లేదు. శుక్రవారం ఏటీఎం వద్ద క్యూలో నిలబడి రెండు వేలు తీసుకున్నా. మరలా ఈరోజు పాఠశాల ముగియడంతోనే వచ్చి క్యూలో నిల్చున్నా. నావంతు ఎప్పటికి వస్తుందో.. అప్పటిదాకా నోట్లు ఉంటాయో లేదో అర్థం కావడం లేదు.
– రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు
పెన్షన్ రాకపోతే ఇబ్బంది
నాకు ప్రతినెలా రూ.14 వేలు పెన్షన్ వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో రూ.2 వేలు ఇస్తున్నారు. మందులకు సరిపోని పరిస్థితి. నిత్యావసర సరుకులు, ఇతర ఖర్చులకు చాలా ఇబ్బంది పడుతున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.
– కావలి ఎర్రియ్య, రిటైర్డు ఉద్యోగి, పాలకొల్లు
బతుకు దైవాధీనం
పెద్ద నోట్ల రద్దు నుంచి బతుకు దైవాధీనంగా ఉంది. బ్యాంకుల్లో నోట్లు దొరుకుతాయో లేదో అన్నట్లు పరిస్థితి ఉంది. నేను విజయనగరంలో ఉండి పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నాకు రోజుకు రూ.100, రూ. 200 అవసరమవుతాయి. ఇక్కడ బ్యాంకు ఖాతా లేకపోవడంతో ఏటీఎంకే వెళతాను. కానీ చాలా ఏటీఎంల్లో డబ్బులు ఉండడం లేదు. ఉన్న వాటిల్లో నుంచి రూ. 2000 నోటు వస్తోంది. ఆ నోటుకు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నాను.
– బి.అప్పలనాయుడు, పెనసాం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా
రెండు వేల నోటుతో పాట్లు
రెండు వేలు కోసం ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. నేను మూడు రోజులుగా డబ్బులు అత్యవసరమై అమలాపురంలోని రెండు ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడ్డాను. నా వంతు రాకుండానే డబ్బులు అయిపోయాయి. మంగళవారం రెండు వేలు నోటు వచ్చింది. ఆ నోటును మార్చేందుకు మూడు గంటలు కష్టపడ్డాను.
– డేగల నాగేంద్రబాబు, పేరూరు. అమలాపురం.
పిల్లాడి ఫీజు కట్టాలని..
మా అబ్బాయికి ఎమ్‌ఫార్మసీ సీటు వచ్చింది. ఫీజు కట్టాలన్నా కట్టలేని పరిస్థితి. అక్కడేమో పాతనోట్లు తీసుకోరు. బ్యాంకుల్లో కొత్త నోట్లు ఇవ్వరు. సాధారణ ప్రజలకు ఇలాంటి కష్టాలు తగవు. గత మూడు రోజులుగా రాజాం వచ్చి ఏటీంలు ముందు నిలవడమే తప్ప క్యాష్ పొందలేని పరిస్థితి వచ్చింది. ఏటీఎంలు పని చేయక, బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటీ?
– కంచరాపు వెంకటరమణ, రైతు, మేడమర్తి, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా
ఈ కష్టం కంటే చావడం మేలు
పింఛన్ డబ్బు కోసం వారం రోజు లుగా తిరుగుతున్నా. నడవలేని స్థితిలో ఉన్న నన్ను మా పక్కింటి వారు రిక్షాలో బ్యాంక్‌కు తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే విపరీతమైన జనా లు. డబ్బు ఎలా తీసుకోవాలో, ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదు. మాలాంటి పేదలకు ఎందుకింత కష్టం?! ఈ కష్టాల కంటే దేవుడుపైకి తీసుకెళ్లినా బాగుండేది.
– లక్ష్మక్క, మరువకొమ్మ కాలనీ, అనంతపురం
రూ. 200 ఇచ్చి వేధిస్తున్నారు
పింఛన్ డబ్బులో ఈ నెల ఒకటో తేదీన రూ. 200 ఇచ్చారు. రోజూ నేను బ్రహ్మంగారిమఠం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి వెళుతున్నాను. చార్జీలకే డబ్బు అయిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి క్యూలో కూర్చున్నాను. నా వంతు సాయంత్రం వచ్చింది. అయితే నాకు ఇవ్వలేదు. గతంలో నాకు పంపిణీ చేసిన సిబ్బంది ద్వారానే తీసుకోవాలని చెబుతున్నారు. ఆమె ఎప్పడు వస్తుంది. నాకు పింఛన్ ఎప్పుడు ఇస్తుందో అర్థం కావడం లేదు.
– సుంకమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
నోటు కోసం కోటి కష్టాలు
Published Wed, Dec 14 2016 7:56 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM
Advertisement