రిటైర్డ్‌ ఉద్యోగికి సింగర్‌ కుచ్చుటోపీ! | Haryana Singer Arrested For Duping Man After 2 Years | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగికి సింగర్‌ కుచ్చుటోపీ

Published Fri, Jan 11 2019 1:24 PM | Last Updated on Fri, Jan 11 2019 1:32 PM

Haryana Singer Arrested For Duping Man After 2 Years - Sakshi

శిఖా రాఘవ్‌(ఫేస్‌బుక్‌ ఫొటో)

న్యూఢిల్లీ :  రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హర్యానా సింగర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పారా మిలిటరీ ఉద్యోగిని మోసగించిన సదరు సింగర్‌ అతడి నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసిందని పేర్కొన్నారు. వివరాలు... హర్యానాకు చెందిన శిఖా రాఘవ్‌(27) స్టేజీ సింగర్‌గా గుర్తింపు పొందారు. ఆధ్మాత్మిక గీతాలు ఆలపించే శిఖా హర్యానాతో పాటు ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇందులో భాగంగా 2016లో ఆమె ఉత్తర ఢిల్లీలోని రామ్‌లీలాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలో ఓ రిటైర్డ్‌ పారా మిలిటరీ ఉద్యోగి కుటుంబంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటికే పెద్ద నోట్లరద్దు అంశం తెరపైకి రావడంతో తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు సదరు ఉద్యోగి ప్రయత్నించారు. ఇదే అదునుగా భావించిన శిఖా, ఆమె స్నేహితుడు పవన్‌ పాత నోట్లను మారుస్తామంటూ అతడి దగ్గరి నుంచి సుమారు 60 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఎన్నిరోజులైనా వారి నుంచి ఫోన్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసుల సహాయంతో.. గురువారం శిఖాను అరెస్టు చేశామని డీసీపీ నుపుర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పవన్‌ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement