సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అధిక ప్రా«ధాన్యతనిస్తోంది. ప్రసవం సమయంలో తల్లి, బిడ్డ మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ ప్రెగ్నెన్సీలను (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇటువంటి వారిపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక పర్యవేక్షణను కొనసాగిస్తోంది. ఎలాగంటే..
►గర్భం దాల్చిన 10–12 వారాల్లో మహిళ వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
►వైద్య పరీక్షలు నిర్వహించి గతంలో అబార్షన్, సిజేరియన్లు జరిగి ఉండటం, రక్తహీనత, రక్తపోటు, మధుమేహం సహా 12 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రారంభ దశలోనే గర్భిణుల్లో హైరిస్‌్కను గుర్తిస్తున్నారు.
►ఇలా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,04,226 మంది గర్భిణులు రిజిస్ట్రర్ కాగా వీరిలో 15 శాతం అంటే 1,23,839 మంది హైరిస్క్‌లో ఉన్నట్లు తేలింది.
►వీరందరి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్‌వైజర్లకు అప్పగించారు.
► ప్రసవం అయ్యేవరకూ హైరిస్క్ గర్భిణుల వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత.
ప్రతినెలా వైద్య పరీక్షలు
ప్రసవానికి ముందు గర్భిణులకు నాలుగు యాంటినేటల్ చెకప్స్ (ఏఎన్‌సీ), ప్రసవానంతరం ఒక పోస్ట్‌నేటల్ చెకప్ (పీఎస్‌సీ) వైద్య శాఖ నిర్వహిస్తుంది. అయితే, హైరిస్‌్కగా గుర్తించిన నాటి నుంచి సంబంధిత మహిళకు ప్రసవానికి ముందు ప్రతినెలా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. గైనకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోనే వీరికి వైద్య పరీక్షలు చేపడుతున్నారు. వీరు నెలనెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా?
ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలను హెల్త్ సూపర్‌వైజర్, ఆశా, ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. అదే విధంగా ఏ ఆస్పత్రిలో వీరికి ప్రసవాన్ని నిర్వహించాలి అని ముందే ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉండే ఆసుపత్రికే నేరుగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రసూతి, శిశు మరణాల కట్టడికి కృషిచేస్తున్నారు.
దేశంలోనే తొలి స్థానంలో ఏపీ
గర్భిణుల్లో హైరిస్క్‌కు ప్రధాన కారణం రక్తహీనత. తర్వాతి స్థానాల్లో 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, 18 ఏళ్ల కంటే ముందే గర్భం దాల్చడం వంటి ఇతర కారణాలూ ఉంటాయి. రక్తహీనతను నియంత్రించడంలో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉంటోంది. ఈ విషయం ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రక్తహీనత నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 91.9% మంది గర్భిణులు, 80.9% మంది పాలిచ్చే తల్లులకు 2021–22 ఏడాదిలో వైద్య శాఖ ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలను పంపిణీ చేసింది. అదే విధంగా 6 నుంచి 59 నెలల చిన్నారులకు 86.1%, 5–9 ఏళ్ల పిల్లలకు 76.1%, 10–19 ఏళ్ల పిల్లలు, యువతకు 79.3% ఐరన్ సిరప్, మాత్రలు పంపిణీ చేపట్టారు. ఇలా అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ దేశంలోనే తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
సేవలు వినియోగించుకోవాలి
గర్భిణులు, బాలింతల సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సేవలను గర్భిణులు వినియోగించుకోవాలి. ఎక్కడైనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురైతే మాకు తెలియజేయాలి.
– డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ (ఎంసీహెచ్)
Comments
Please login to add a commentAdd a comment