high risk pregnant women
-
ఏపీ వైద్య శాఖ కృషి.. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: హైరిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మాతృ మరణాలకు ప్రధాన కారణం. రక్తహీనత, చిన్న వయసులో గర్భం దాల్చడం, 2 లేక 3 అబార్షన్ల అనంతరం గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు, అధిక బీపీ, గుండె, కిడ్నీ జబ్బులు, ఇతర సమస్యలతో గర్భం దాల్చిన మహిళలను హైరిస్క్‌గా పరిగణిస్తారు. వీరికి ప్రసవం సమయంలో ఇతర ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో ప్రసవానికి ముందే వీరిని పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని హైరిస్క్ గర్భిణిలను డెలివరీ డేట్‌కు సుమారు వారం రోజుల ముందే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించే కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించారు. ఇందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు 5,398 మందిని తరలించగా.. 4,678 మంది సురక్షితంగా ప్రసవించారు. వీరిలో 332 మంది సీహెచ్‌సీల్లో, 447 మంది ఏరియా, 535 మంది జిల్లా ఆస్పత్రుల్లో, 916 మంది బోధనాస్పత్రుల్లో, 147 మంది ఎంసీహెచ్ సెంటర్లలో, మిగిలిన వారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రసవం నిర్వహించారు. పక్కా ప్రణాళికతో తరలింపు ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల వివరాలను ఏఎన్ఎం యాప్ ద్వారా ఏఎన్ఎంలకు పంపుతున్నారు. ఈ క్రమంలో వారు స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌తో కలిసి తమ పరిధిలోని హైరిస్క్ గర్భిణులను ఏ ఆస్పత్రికి తరలించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆ మేరకు ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన మెటర్నల్ మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే నెల 21వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8,384 మంది హైరిస్క్ గర్భిణులు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వీరి వివరాలను ఇప్పటికే ఏఎన్ఎం యాప్‌లో పొందుపరిచారు. తద్వారా వీరిలో ఇప్పటికే 592 మంది గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించారు. మరో 7,792 మందిని ఆస్పత్రులకు తరలించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అవుతుంటారు. వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకు హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. -
AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అధిక ప్రా«ధాన్యతనిస్తోంది. ప్రసవం సమయంలో తల్లి, బిడ్డ మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ ప్రెగ్నెన్సీలను (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇటువంటి వారిపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక పర్యవేక్షణను కొనసాగిస్తోంది. ఎలాగంటే.. ►గర్భం దాల్చిన 10–12 వారాల్లో మహిళ వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ►వైద్య పరీక్షలు నిర్వహించి గతంలో అబార్షన్, సిజేరియన్లు జరిగి ఉండటం, రక్తహీనత, రక్తపోటు, మధుమేహం సహా 12 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రారంభ దశలోనే గర్భిణుల్లో హైరిస్్కను గుర్తిస్తున్నారు. ►ఇలా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,04,226 మంది గర్భిణులు రిజిస్ట్రర్ కాగా వీరిలో 15 శాతం అంటే 1,23,839 మంది హైరిస్క్‌లో ఉన్నట్లు తేలింది. ►వీరందరి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్వైజర్లకు అప్పగించారు. ► ప్రసవం అయ్యేవరకూ హైరిస్క్ గర్భిణుల వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రతినెలా వైద్య పరీక్షలు ప్రసవానికి ముందు గర్భిణులకు నాలుగు యాంటినేటల్ చెకప్స్ (ఏఎన్సీ), ప్రసవానంతరం ఒక పోస్ట్‌నేటల్ చెకప్ (పీఎస్సీ) వైద్య శాఖ నిర్వహిస్తుంది. అయితే, హైరిస్్కగా గుర్తించిన నాటి నుంచి సంబంధిత మహిళకు ప్రసవానికి ముందు ప్రతినెలా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉండే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోనే వీరికి వైద్య పరీక్షలు చేపడుతున్నారు. వీరు నెలనెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలను హెల్త్ సూపర్వైజర్, ఆశా, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. అదే విధంగా ఏ ఆస్పత్రిలో వీరికి ప్రసవాన్ని నిర్వహించాలి అని ముందే ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉండే ఆసుపత్రికే నేరుగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రసూతి, శిశు మరణాల కట్టడికి కృషిచేస్తున్నారు. దేశంలోనే తొలి స్థానంలో ఏపీ గర్భిణుల్లో హైరిస్క్కు ప్రధాన కారణం రక్తహీనత. తర్వాతి స్థానాల్లో 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, 18 ఏళ్ల కంటే ముందే గర్భం దాల్చడం వంటి ఇతర కారణాలూ ఉంటాయి. రక్తహీనతను నియంత్రించడంలో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉంటోంది. ఈ విషయం ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రక్తహీనత నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 91.9% మంది గర్భిణులు, 80.9% మంది పాలిచ్చే తల్లులకు 2021–22 ఏడాదిలో వైద్య శాఖ ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలను పంపిణీ చేసింది. అదే విధంగా 6 నుంచి 59 నెలల చిన్నారులకు 86.1%, 5–9 ఏళ్ల పిల్లలకు 76.1%, 10–19 ఏళ్ల పిల్లలు, యువతకు 79.3% ఐరన్ సిరప్, మాత్రలు పంపిణీ చేపట్టారు. ఇలా అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ దేశంలోనే తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. సేవలు వినియోగించుకోవాలి గర్భిణులు, బాలింతల సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సేవలను గర్భిణులు వినియోగించుకోవాలి. ఎక్కడైనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురైతే మాకు తెలియజేయాలి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ (ఎంసీహెచ్) -
హైరిస్క్ పేషెంట్లను తరలించే అంబులెన్స్‌లో మృతదేహం
సాక్షి, కరీంనగర్ : హైరిస్క్ ఉండే గర్భిణులు, ఇతర పేషెంట్లను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు ఉన్న ఒకే ఒక్క అంబులెన్స్‌లో వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల నగరానికి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 18న జ్వరం, దగ్గుతో ఓ మహిళ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మహిళను ఐసీయూలో చేర్చి వైద్యచికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కరోనా లక్షణాలుగా అనుమానించి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేర్చేలోపే సదరు మహిళ మృతిచెందింది. వైద్యాధికారుల సూచన మేరకు అదే అంబులెన్స్‌లో మృతదేహాన్ని కరీంనగర్‌కు తీసుకువచ్చారు. మహిళ నివాసం కంటైన్మెంట్జోన్లో ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఇంటి వద్దకు అనుమతించకుండా, ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వరంగల్ ఎంజీఎంకు ఈ అంబులెన్స్‌లోనే గర్భిణులకు డెలివరీలు క్లిష్టంగా ఉన్న సమయంలో, ఇతర హైరిస్క్ పేషెంట్లను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన మహిళ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చిన తర్వాత గర్భిణులు, ఇతర పేషెంట్లను అదే అంబులెన్స్‌లో తరలిస్తే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలున్న పేషెంట్లను ఇప్పటి వరకు 108 వాహనాల్లోనే హైదరబాద్‌కు తరలించారు. మృతదేహాలను తరలించేందుకు మరో అంబులెన్స్ ఉన్నప్పటికీ అధికారుల అత్యుత్సాహం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
‘హై రిస్క్’లో ఆమె
గర్భిణి అయ్యాక ప్రసవానికి అననుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఏడాదిలో సుమారు 8.50 లక్షల ప్రసవాలు 31 శాతం మంది గర్భిణుల్లో పౌష్టికాహారలోపం సకాలంలో సరిగ్గా జరగని వైద్య పరీక్షలు రక్తపోటు, రక్తహీనతలను గుర్తించలేని పరిస్థితి చాలా కేసుల్లో బిడ్డ ప్రాణాలకు ముప్పు సాక్షి, హైదరాబాద్: తల్లి కావడమనేది ప్రతి స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. కానీ ఆ స్త్రీని తల్లిని చేసే ప్రసవ ప్రక్రియ చాలా కేసుల్లో బిడ్డ ప్రాణాలకు పలు సందర్భాల్లో తల్లి ప్రాణాల మీదకు సైతం తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసవానికి అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న గర్భిణుల (హైరిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్) సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వేలాది మంది గర్భిణులు ప్రసవానికి అనుకూల పరిస్థితులు లేక కొన్నిసార్లు నవ మాసాలు నిండినా.. బిడ్డను కడుపులోనే కోల్పోతున్నారు. పండంటి బిడ్డతో సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాల్సిన మహిళలు బిడ్డను చూడకుండా కన్నీటితో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కడుపులోని బిడ్డలో ఎదుగుదల లేకపోవడంతో ఐదో నెల నుంచి ఏడో నెలలోపే పురిటి నొప్పులు రావడం, బిడ్డ చనిపోయి పుట్టడం వంటివి జరుగుతున్నాయి. ఈ కారణంగా తల్లులు సైతం మృత్యువుకు చేరువవుతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా పౌష్టికాహార లోపం కలిగిన గర్భిణులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. గర్భిణికి సరైన పోషకాహారం అందితేనే కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఏడాదిలో సుమారు 8.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 31 శాతం మంది మహిళలకు సరైన పోషకాహారం అందనట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 40 శాతం మందికి.. గర్భం దాల్చిన తర్వాత ప్రసవం వరకు క్రమం తప్పకుండా జరగాల్సిన పరీక్షలు (యాంటీనేటల్ చెకప్స్) సరిగా జరగడం లేదు. దీనివల్ల గర్భిణిలో ఏవైనా లోపాలు ఉంటే తెలియడం లేదు. రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను గర్భిణులు ఎదుర్కొంటున్నారు. మెజారిటీ మహిళల్లో హిమోగ్లోబిన్ 5 శాతం కంటే తక్కువగా ఉంటోంది. గర్భందాల్చిన తర్వాత గుండె జబ్బులు సైతం మహిళలను చుట్టుముడుతున్నాయి. తీరా ప్రసవ సమయంలో బయటపడినా బిడ్డను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక పోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గుంటూరులో అత్యధికం గుంటూరులో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ జిల్లాలోనే అత్యధికంగా అననుకూల పరిస్థితులున్న గర్భిణులుండటం గమనార్హం. ప్రతి 100 మందిలో 19.62 మంది ఇలాంటివారే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శ్రీకాకుళం జిల్లా (18.27 శాతం) ఉండగా కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేంద్రం నుంచి వందల కోట్ల నిధులొస్తున్నా రాష్ట్రంలో గర్భిణులకు గానీ, నవజాత శిశువులకు గానీ సరైన సేవలు అందించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.