
సాక్షి, కరీంనగర్ : హైరిస్క్ ఉండే గర్భిణులు, ఇతర పేషెంట్లను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు ఉన్న ఒకే ఒక్క అంబులెన్స్‌లో వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల నగరానికి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 18న జ్వరం, దగ్గుతో ఓ మహిళ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మహిళను ఐసీయూలో చేర్చి వైద్యచికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కరోనా లక్షణాలుగా అనుమానించి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేర్చేలోపే సదరు మహిళ మృతిచెందింది. వైద్యాధికారుల సూచన మేరకు అదే అంబులెన్స్‌లో మృతదేహాన్ని కరీంనగర్‌కు తీసుకువచ్చారు.
మహిళ నివాసం కంటైన్మెంట్‌జోన్‌లో ఉండడంతో పోలీసులు మృతదేహాన్ని ఇంటి వద్దకు అనుమతించకుండా, ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వరంగల్ ఎంజీఎంకు ఈ అంబులెన్స్‌లోనే గర్భిణులకు డెలివరీలు క్లిష్టంగా ఉన్న సమయంలో, ఇతర హైరిస్క్ పేషెంట్లను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన మహిళ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చిన తర్వాత గర్భిణులు, ఇతర పేషెంట్లను అదే అంబులెన్స్‌లో తరలిస్తే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలున్న పేషెంట్లను ఇప్పటి వరకు 108 వాహనాల్లోనే హైదరబాద్‌కు తరలించారు. మృతదేహాలను తరలించేందుకు మరో అంబులెన్స్ ఉన్నప్పటికీ అధికారుల అత్యుత్సాహం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment