
మరో అంతరిక్ష పర్యవేక్షణ బెలూన్!
ఇప్పటిదాకా భూమినుంచి రోదసిని పర్యవేక్షిస్తున్న నాసా సైంటిస్టులు.. రోదసినుంచీ భూమిని పర్యవేక్షించే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
న్యూజిల్యాండ్ః అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ఎట్టకేలకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'నియర్ స్పేస్ మానిటరింగ్ బెలూన్' ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ బెలూన్ ను సూపర్ ప్రెజర్ టెక్నాలజీతో రూపొందించారు. రోదసినుంచి నిఘా నేత్రంగా పనిచేసే ఈ బెలూన్ కు కాంప్లన్ స్పెకోట్రమీటర్ అండ్ ఇమేజర్.. గామా రే టెలిస్కోపును కూడ జోడించి ప్రయోగించారు.
ఇప్పటిదాకా భూమినుంచి రోదసిని పర్యవేక్షిస్తున్న నాసా సైంటిస్టులు.. రోదసినుంచీ భూమిని పర్యవేక్షించే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. న్యూజిల్యాండ్ లోని వనకా ఎయిర్ పోర్టు నుంచి ప్రయోగించిన నియర్ స్సేస్ మానిటరింగ్ బెలూన్ బరువు... 5,32,000 క్యూబిక్ మీటర్లు. కొత్తగా ప్రయోగించిన ఈ బెలూన్ ప్రతి ఒకటినుంచి మూడు వారాల మధ్యలో స్ట్రాటో ఆవరణలోని గాలి వేగాన్ని బట్టి, గ్లోబును చుట్టి వస్తుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకు ముందు ఎదురైన ఎన్నో వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని చివరికి ఈ అంతరిక్ష సమీప పర్యవేక్షణ బెలూన్ ను నాసా ఐదోసారి ప్రయోగించి విజయవంతమైంది.
కొలంబియా సైంటిఫిక్ బిలూన్ ఫెసిలిటీ, నాసా వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ, వర్జీనియా అంతరిక్ష బెలూన్ విమానంలోని మిషన్ కార్యకలాపాలన్నింటినీ నాసా నిపుణులు నియంత్రిస్తారు. ఇప్పటివరకూ నాసా సృష్టిలోని సూపర్ ప్రెజర్ బెలూన్ ఫ్లైట్ రికార్డు 54 రోజులు కాగా... తాజాగా వనకా నుంచి రెండో సూపర్ ప్రెజర్ బెలూన్ మిషన్ ను నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించారు.