‘ఉపాధి’కి ఊతం వచ్చేనా! | egs Programme Officer As mdo's | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ఊతం వచ్చేనా!

Published Sat, Nov 1 2014 3:32 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’కి ఊతం వచ్చేనా! - Sakshi

‘ఉపాధి’కి ఊతం వచ్చేనా!

* ఈజీఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లుగా ఎంపీడీఓలు
* వందరోజుల పని లక్ష్యంగా..
* మండల స్థాయిలో చురుకైన పాత్ర పోషించాలి
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ)కు బదలాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయి ల్లో ఇకపై ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషిం చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. ఈవోపీఆర్‌డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరిలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా అందులో సూచించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 9 జిల్లాలు, 443 మండలాల్లో జాబ్‌కార్డున్న ప్రతికూలీకి కనీ సం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం కలెక్టర్, జడ్పీ సీఈఓ, డ్వామా పీడీలకు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక జిల్లాలోని 36 మండలాలకు ఎంపీడీఓలే ‘ఉపాధి’ ప్రోగ్రాం ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు.
 
కూలీలకు భరోసా ఇవ్వని పథకం
ఉపాధి హామీ చట్టం-2005 ప్రకారం జిల్లాలో నమోదు చేసుకున్న కూలీలకు కనీసం వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతూ కూలీల కు వందరోజులు పని కల్పించలేకపోయారు. ఉ పాధి హామీ పథకం అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా.. గతేడాది 14,578 కుటుంబాలకే వంద రోజుల పని దొరకడం గమనార్హం. ఈ నేపథ్యం లో ఉపాధి హామీతో భరోసా పొందని కూలీలు మళ్లీ వలసబాట పట్టిన సందర్భాలున్నాయి. మద్నూర్, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోట గిరి, బాన్సువాడ తదితర మండలాల్లో పలువురు కూలీలు వలస వెళ్లారు.
 
చిత్తశుద్ధి ఏది?
ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేసేందుకు బోలెడన్ని నిధులున్నా.. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ, పనుల ఎంపిక, కూలీలకు పని కల్పించే విషయంలో చాలాచోట్ల చిత్తశుద్ధి కరువైందన్న విమర్శలున్నాయి. 2013-14 సంవత్సరంలో జాబ్‌కార్డులు పొందిన 4,45,117 మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు రూ. 557.62 కోట్ల విలువ గల పనులు గుర్తించినా.. రూ. 203.50 కోట్లు ఖర్చు చేసి 50,149 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా కేవలం 14,578 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించగలిగారు. శుక్రవారం నాటికి ఉపాధి హామీలో పాల్గొన్న కూలీకి రోజుకు సగటున రూ. 108.54 లకు మించి కూలి డబ్బులు లభించలేదు.
 
ప్రణాళిక ఇదీ..
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 881.34 కోట్లతో 53,690 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 4,48,001 మంది కూలీలకు జాబ్‌కార్డులు అందజేసిన అధికారులు 25,669 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,26,495 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ. 557.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైనా.. అందులో ఇప్పటికే 20,801 పనులు పూర్తి చేసి రూ. 129.92 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే పథకం అమలు కోసం ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పటికీ 45 శాతం గ్రామాలలో ఉపాధి పనులు ఇంకా మొదలవలేదు. శివారు గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా ప్రారంభించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలోనూ జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు నిధులను ఖర్చు చేయకుండా మార్చిలో హడావుడి చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించనుండగా.. 2015- 16 ప్రణాళికతో పాటు ప్రస్తుతం నడుస్తున్న పనుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తనున్న ఎంపీడీఓలు.. కూలీలకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో వేచి చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement