ఏ దైవానికి సంబంధించిన ఒక లీలని (మహిమని చూడగల ఒక సంఘటన) విన్నా, ఏ భక్తునికి సంబంధించిన ఒక అనుభవాన్ని తెలుసుకున్నా వాటిని ‘అవి ఎవరికో జరిగినవి’ అనుకోకూడదు. ‘మనకి కూడా ఆ దైవానుగ్రహం గనుక ఉంటే ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశముందన్నమాట’ అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అవగాహన కలగాలంటే సద్గురువు (నిస్వార్థంగా జ్ఞానబోధని చేసి కళ్లు తెరిపించేవాడు) లభించాలి. ఓ చిన్న ఉదాహరణని గమనించుకుని లోపలికి వెళ్తాం! చిలుక ఉంది. అది చక్కగా మాట్లాడుతోంది. అందంగా.. ఆకర్షణీయంగా.. ఉందనే ఆలోచనతో మనం దాన్ని తెచ్చి ఓ పంజరంలో ఉంచి, దానికి కావలసినవన్నీ సకాలంలో పెడుతూ ఉంటాం. అది కూడా వాటిని తింటూ.. మనతో ఆడుకుంటూ.. మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఎక్కడికీ ఎగరాల్సిన అవసరం లేకుండా తనకి ఇష్టమైన పళ్లూ తినుబండారాలూ తన దగ్గరికే వస్తున్నాయని మహా ఆనందపడిపోతూ ‘ఈ జీవితం ఇలాగే జరిగిపోతే చాలునురా భగవంతుడా!’ అనుకుంటుంది. ఎవరో ఒక పిల్లవాడో లేక ఇంట్లో ఎవరో ఆ చిలుకకి ఆహారాన్ని పెట్టి పొరపాటున పంజరపు తలుపుని వేయకుండా ఉన్నారనుకుందాం! ఆ చిలుక కాస్త ఎగిరి ఆ చెట్టు మీదా ఈ చెట్టు మీదా వాలుతూ విశాలవిశ్వాన్ని తన ఆటస్థలంగా భావిస్తూ తన రెక్కల సత్తువ కొద్ది దూరదూరాలు వెళ్తూ విన్యాసాలు చేసుకుంటూ తన జాతి చిలుకలతో ఆడుతూ పాడుతూ గంతులేస్తూ అడవులకీ తోటలకీ వెళ్తూ అనుకుంటుంది ‘అయ్యో! ఎంత జీవితకాలాన్ని నష్టపోయాను. ఆ పంజరంలో బంధింపబడి ఇంత విశాలవిశ్వముంటే నేను ఓ చిన్న పంజరంలోనే ఉంటూ.. దాన్నే గొప్పగా భావిస్తూ.. అందరూ నన్ను ఆదరిస్తున్నారనుకున్నాను గానీ ఇంత స్వతంత్రతనీ, ఇంతటి ఆనందాన్నీ కోల్పోయానా ఇంతవరకూ!?’ అని తీవ్రంగా బాధపడుతుంది.
‘ఇప్పటివరకూ నన్ను చూడదలిచినవారి ఇష్టాలకి అనుగుణంగా ఉంటూ దానికి అలవాటుపడి అదే నిజమైన ప్రపంచం అనేసుకున్నానా? నిజమైన ఆనందమంటే.. ఎవరి సంతోషానికో నేను అనుగుణంగా ఉండటం కాదు. నా ఆనందాన్ని నేను పొందడానికి అనుగుణంగా నేనెలా ఉండాలో, ఉంటే బాగుంటుందో అలా ఉండటం మాత్రమే!’ఇదంతా ఎందుకంటే జీవుడు (ప్రతివ్యక్తీ) కూడా అంతే! ఈ కోరికలు, ఆ కోరికలు, ఆ ధనం, ఈ ఐశ్వర్యం (ఈశ్వరస్య భావరి – అధికారం హోదా అనేది సరైన అర్థం), సంతానం, సౌకర్యాలూ... అనే ఈ పంజరంలో బంధింపబడి ఎంతగొప్పగా ఉన్నాను అనుకుంటాడు. పై ఉదాహరణలో పంజరపు తలుపుని ఎవరో తీస్తే బాహ్య ప్రపంచాన్ని చూసి తానెంత నష్టపోయిందో ఆ చిలుక గమనించినట్లే ఇక్కడ కూడా జీవునికి సరైన గురువు (సద్గురువు) గాని దొరికితే నిజమైన మానసిక ఆనందాన్ని (హ్లాదం అంటారు. అలాంటి హ్లాదం యొక్క అతీతస్థితే ప్రహ్లాదం. అది కలిగినవాడే ప్రహ్లాదుడు) పొందుతూ జీవితాన్ని ఎంత నష్టపోయిందీ, నష్టపోగొట్టుకుందీ తెలుసుకోగలుగుతాడు.
అలా హ్లాదాన్ని పొందిన సాయి భక్తులందరికీ సాయి తన జీవితాలని ఎలా రక్షించి ఒడ్డున పడేసిందీ స్పష్టంగా తెలుసు. ఉదాహరణతో చూద్దాం!
ప్రాణవాయువు మీద ఆధిపత్యం
మన శరీరంలో (పిండ అండంలో) 5 వాయువులున్నాయి. వాటిలో మొదటిది మన ప్రాణాలని నిలిపి ఉంచే వాయువు. అదే ప్రాణవాయువు. ‘హృదిప్రాణః’ అన్నారు కాబట్టి ఈ ప్రాణవాయువు ప్రతి జీవునిలోనూ (జీవించి ఉన్నవారు) హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి ప్రాణవాయువు తొలిగిపోయిన క్షణంలో ఆ జీవుడు నిర్జీవుడు అవుతాడు. ఆ ప్రాణం– సామాన్యులమైన మన అందరి భావనలోనూ ఎప్పుడుపోతుందో – తెలియదు. అయితే సాయికి స్పష్టంగా తెలుసు ఎవరి ప్రాణం ఎప్పటికి గతిస్తుందో! అందుకే ఫలానవాని ప్రాణాలు నిలిచి ఉండాలని తనకి అనిపించినప్పుడు ఆ పోబోయే ప్రాణవాయువుని కూడా పోకుండా ఆపుచేసి ఆ జీవుడ్ని మరికొంతకాలం జీవింపజేశాడు. ఇలా ప్రాణవాయువుని ఆపి ఉంచగలిగాడంటే తనకి ప్రాణవాయువు మీద ఆధిపత్యం ఉన్నట్లే కదా! శ్యామాని పాము కరిచింది!
పైన అనుకున్న చిలుక కథలోని చిలుకలా పంజరం నుంచి బయటపడి సద్గురువు పర్యవేక్షణలో స్వతంత్ర జీవనాన్నీ హ్లాదాన్ని పొందుతున్న వాడు శ్యామా(మాధవరావు శ్యామా అనేది పూర్తి పేరు). బాబాకి నీడలాగా ఉంటూ ఉండేవాడు. సాయి కూడా శ్యామాని అంతగానూ దగ్గరగా ఉంచుకుని చూసుకుంటూ ఉండేవాడు. సాయి నిత్యం చేసే అగ్నిహోత్ర కార్యక్రమం (ధుని) కోసం కట్టెలని తేవాలనే ఉద్దేశ్యంతో శ్యామా కట్టెలన్నీ పెద్ద ఎత్తున ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి కట్టెల్ని లాగుతూ ఉంటే ఆ పెద్ద ఎత్తు మోపులా ఉండే కట్టెల సమూహం నుండి ఓ పొడవాటి పాము(మరాఠీలో బవా అంటారు) శ్యామా చిటికెనవేలి మీద బలంగా పడగ ఎత్తి మరీ కాటేసింది. క్షణాల్లో శ్యామా చిటికెన వేలంతా విషాగ్నితో నిండిపోయి తీవ్రమైన మంటనీ నొప్పినీ కలుగజేసాయి శ్యామాకి. ఎప్పుడూ అలాంటి పాముకాటు అనుభవం లేని కారణంగానూ, తాను ఒంటరిగా వచ్చి ఉన్న కారణంగానూ శ్యామా భయాందోళనలతో వణికిపోసాగాడు. బాధా భయమూ ఆందోళనా నిస్సహాయతా వంటివి ఆవరించినప్పుడు దైవాన్ని స్మరించుకోవాలనే విషయాన్ని అందరూ చెప్పే మాట నిజమే గాని, ఆ బాధలో ఆందోళనలో అంతటి సాయి భక్తునికీ నిరంతరం సాయితో మెలిగేవానికీ కూడా సాయి గుర్తు రానూ లేదు. సాయి జపం చేయాలనే ఆలోచన కలగనూ లేదు. ఇది సర్వసాధారణం. ఒకవేళ ఏ ధ్యానమో చేద్దామని ఏ క్షణంలోనో అనిపించినా అది సాధ్యమయ్యే విషయమేనా ఆ బాధలో ఆందోళనలో ప్రాణభయంలో ఉన్న సమయంలో? పెద్దగా అరిచిన అరుపులకి దగ్గరగా ఉన్న బంధువులూ కొందరు మిత్రులూ అతని వద్ద కొచ్చారు. శరీరమంతా క్రమంగా ఎర్రని రంగుతో నిండిపోతూ కనిపిస్తోంది. అతని ప్రాణాలు ఇక పోతాయేమోననే భయం శ్యామాతో పాటు అందరికీ దాదాపుగా కలిగింది. ఆ ఎర్రగా మారుతున్న శరీరపు రంగూ, విషబాధతో శ్యామా మెలికలు తిరిగిపోతున్న దృశ్యమూ చూడగానే.
షిర్డీలో పాముల సంచారం ఎక్కువనే చెప్పాలి. ఓ సారి సాయిని భక్తులు కొందరు ‘బాబా! పాముల సంచారం ఎక్కువగా ఉంటోంది. దీనికి ఏదైనా నివారణోపాయం – పరిష్కారమార్గం నువ్వే చెప్పాలి’ అనడిగితే ఆయన నవ్వి.. ‘షిర్డీ ఒక అడవి ప్రాంతం. అడవి అనేది పాములు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే ప్రదేశం. మనం మెల్లిగా ఇక్కడి కొచ్చి ఇళ్లు కట్టుకున్నాం. ఉంటున్నాం. అంటే ఏమన్నమాట? అవి ఉన్న ప్రదేశానికి మనం వచ్చాం గానీ, మనమున్న ప్రదేశానికి అవి రావడం లేదు. ఆ కారణంగా వాటిని చంపకూడదు’ అన్నారు. అంచేత ఎవరైనా పాములు కనిపించినా దూరంగా తొలిగిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు సంభవిస్తే షిర్డీలోనే విఠోబా మందిరం (అది ఒక శివాలయానికున్న పేరు) అని ఒకటుంది. అక్కడికి తీసుకెళ్లేవారు బాధితుడ్ని. అక్కడ ఉండే ఒక అర్చకుడు మంత్రాన్ని వేస్తే బతుకుతూ ఉండేవారు సాధారణంగా. అలాగే గడుస్తూ ఉండేవి రోజులు. షిర్డీ వాసులకి పాముల విషయంలో ధైర్యం ఉండటానికీ, రాత్రయినా తెల్లవారుజామైనా ఎక్కడికైనా వెళ్తూ ప్రజలుండగలగడానికీ ఆ విఠోబా మందిరముందనే నమ్మకమే కారణం. ఆ ధైర్యాన్నిచ్చే విఠోబా మందిరానికి తీసుకెళ్లబోతుంటే శ్యామా స్నేహితుడు ‘నిమోణ్కర్’ అనే ఆయన ‘ఇదంతా ఎందుకు? ముందు బాబా దగ్గర కెళ్లి ఆయనిచ్చే ఊదీ (ధునిలో కట్టెలు మండగా వచ్చిన బూడిద– విభూతి అన్నమాట) తీసుకో: అని సూచించాడు. ఆ మాటని వింటూనే శ్యామా ఆ సాయి ఉండే మందిరానికి పరుగులాంటి నడకతో ఎలాగో ఓపిక కూడగట్టుకుని వెళ్లాడు.
ఫో! ఫో!
మేడమీద బాబా ఉన్నాడని తెలిసిన శ్యామా.. ఆ బాబా సన్నిధికి వెళ్లి పామువిషం దిగిపోయి తాను బతకగలననే ధైర్యంతో విశ్వాసంతో ఉన్నాడో లేదో ఆ సమయంలో బాబా ఈ శ్యామాని చూస్తూనే తీవ్రకోపంతో ... భతుర్ధ్యా(హేయమైన ప్రవర్తన అథమనీచ లక్షణాలు కలిగిన బ్రాహ్మణుడా!) మేడమెట్లు ఎక్కావో ఊరుకోను! పైకెక్కావో జాగ్రత్త! దిగిఫో! ఫో! ఫో!’ అంటూ పెద్ద గొంతుతో అరిచాడు.
శ్యామాకే కాదు అతడ్ని అనుసరించి వెళ్లిన అందరికీ ఆశ్చర్యమనిపించింది! విడ్డూరంగా సాయి అలా అనడమేమి? అనే సంశయంతో భక్తులందరూ ఆలోచనలో పడిపోయారు. శ్యామాకయితే మతిపోయింది. ఏం చేయాలో ఆలోచించగల స్థితిలో తన బుద్ధి లేనే లేదు. తీవ్ర శారీరక బాధా, దానికి తోడు సాయిబాబా కంఠస్వరం దాని నిండుగా నిందలూ తిట్లూ కారణం! ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో శారీరకంగానూ మానసికంగానూ కుంగిపోయి నిరాశతో కుప్పకూలిపోయిన శ్యామా గట్టిగా ఎగశ్వాస పీల్చసాగాడు. బలంగా గాలిని పీల్చడమంటే విష తీవ్రత ఊపిరితిత్తుల దాకా వెళ్లి గాలిని సుఖంగా పీల్చుకోలేని స్థితికి రోగిని తీసుకెళ్తోందన్నమాట. సాయి భక్తులందరూ ఈ పరిస్థితిని ఏ తీరుగానూ విశ్లేషించుకోలేక ఉంటూ ఉంటే, కన్నబిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా పోతే పోనీ! అన్నట్లుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి? అనే తీరు నిరాశా నిస్పృహలతో ఆ సాయి మందిరాన్ని వెర్రివానిలా చూస్తూ ఉండిపోయాడు.
ఈ మసీదు(ద్వారకామాయి) నా పుట్టిల్లు. నేను సాయి కన్నబిడ్డని. సాయి దర్శనానికొచ్చే అందరూ నా సోదరసమానులు. ఏనాడూ అధర్మంగా ప్రవర్తించి ఎరుగను... అనుకుంటూ గుండెనిండుగా దుఃఖాన్ని అనుభవిస్తూ మౌనంగా లోలోపలే కుతకుతలుడికిపోయాడు శ్యామా. బతికే ఆశని వదులుకుని తన జీవితం ముగియబోతోందని గ్రహించుకుని మెల్లగా మేడ దిగేసాడు శ్యామా. ఎప్పుడైతే తాను మేడ దిగేసి సాయికి కనిపించకుండా ఉన్నాడో అప్పుడు సాయి గొంతు అరవడం మానింది. ఆయన శాంతించినట్లుగా శ్యామాకి తోచింది. ప్రాణాలు పోతే పోనీ! అదేదో సాయి సన్నిధిలోనే సాగనీ! తన జీవిత సర్వస్వమూ సాయే అయ్యున్నప్పుడు ఈ మేడ కింద శరీరాన్ని త్యజించడమెందుకు? అనుకుంటూ ఓపిక కూడగట్టుకుని మళ్లీ మేడపైకి వెళ్లాడు. సాయికి కనిపిస్తూ ఆయన దర్శనాన్నే చేస్తూ కింద కూర్చున్నాడు. సాయినే చూస్తూ ఉండిపోయాడు. సాయి శ్యామాని చూస్తూ .. ‘ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు! ధైర్యంగా ఉండు! నా మీద నమ్మకం ఉంచుకో! ప్రశాంతంగా ఉండు! నీకేమీ కాదు! కలవరపడకు! ఇంటికి వెళ్లు! ఇంటి బయటికి మాత్రం వెళ్లకు!’ అన్నాడు మెత్తని కంఠ స్వరంతో అనుగ్రహిస్తున్నాడనే నమ్మకాన్ని అదే కంఠస్వరంతో కలిగిస్తూ. శ్యామా బాబామాటనే విశ్వసిస్తూ త్రోవలో’ పాముకాటుకి గురైన బాధితులు వెళ్లే విఠోబా మందిరం మీదుగానే వెళ్తూ కూడా ఆ మందిరానికి వెళ్లకుండా తన ఇంటికే చేరాడు. శ్యామా తన ఇల్లు చేరాడో లేదో ‘తాత్యా’ అనే భక్తుడు ఇంటి వద్ద కనిపించాడు శ్యామాకి. ‘శ్యామా! సాయే నన్ను పంపిస్తే వచ్చాను! నిన్ను నిద్రపోవద్దని చెప్పాడు. నీకు నిద్ర రాబోతే నిద్రపోనీయకుండా చూడాల్సిందిగా చుట్టూ ఉన్నవారిని చూడవలసిందన్నాడు. తిండి విషయమా? ఇష్టమైన వేటినైనా సరే తినమన్నాడు! ఒక వేళ నిద్రమత్తుగాని వస్తే పచార్లు చేయవలసిందే తప్ప నిద్ర పోనే పోరాదన్నాడు’ అని చెప్పాడు బాబా మాటలని. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్)ని ధైర్యం కోసం రక్షణకోసం ఉండవలసిందని సాయే చెప్తే వచ్చాడు! గమనించు! అని కూడా చెప్పాడు ‘తాత్యా’.
సాయి చెప్పినట్లు నచ్చినది తిని – నిద్ర వస్తున్నా కూడా నిద్రపోకుండా నిద్ర వస్తోందన్న అనుమానం వస్తే ‘కాకా’ సహాయంతో పచార్లు చేస్తూ ఎలాగో రాత్రిని నిద్రలేకుండా నిద్రరాకుండా చూసుకుని గడిపేసాడు శ్యామా.తెల్లారేసరికి అతని బాధ తగ్గిపోయింది గానీ ఆ పాము కరిచినచోట మాత్రం కొద్దిగా మంట ఉంది. అప్పుడప్పుడు చురుక్కుమంటూ తానున్నానంటోంది. కొంత పొద్దెక్కేసరికే పూర్తిగా తగ్గిపోయింది.
ఎలా తగ్గింది? ఏ మందూ మాకూ వాడలేదు. పైగా బాబానే నమ్ముకున్న శ్యామాని బాబా ఆదరించలేదు సరికదా బిగ్గరగా అరుస్తూ ‘దిగిఫో!’ అన్నాడు కూడా. విఠోబా మందిరంలో ప్రవేశించలేదు కూడా. ఎలా తగ్గినట్టు? బాబా ప్రవర్తనకి లో అర్థమేమిటి?బాబా తన వద్దకొచ్చిన శ్యామాని తిట్టలేదు. ‘భతుర్ధ్యా!’ ‘దిగిఫో’ అన్నాడు. పాముల్లో నాలుగు వర్ణాలు ఉంటాయి. ఏదో తప్పు చేసిన కారణంగా ఓ బ్రాహ్మణునికి మహర్షి ఎవరో ఇచ్చిన శాపం కారణంగా పాముగా జన్మనెత్తిన ఆ పాము ఈ రోజున శ్యామాని కరిచింది. జన్మజన్మల సంబంధాన్ని తెలుసుకోగల జ్ఞాని బాబా. ఈ విషయం రాబోయే కొన్ని భాగాల్లో ఓ భాగంలో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోబోతున్నాం. అందుకని ఓ బ్రాహ్మణ సర్పమా! అప్పుడు తప్పు చేసి పాముగా అయి మళ్లీ నీచకార్యాన్ని (శ్యామాని కరవటం) చేస్తావా? విషరూపంగా ఉన్న నువ్వు దిగిఫో! అని ఆ పాముని మందలించాడు సాయి.
ఇది వినడానికీ చదువుకోవడానికీ బాగుండచ్చేమో గానీ నమ్మవీలులేనిదిగా ఉందనిపించవచ్చు. మరి అదే నిజమైతే ‘భతుర్ధ్యా!’ అని ఎందుకు సంబోధించాడు సాయి? మళ్లీ ఆ సాయే శ్యామా మేడమీదికి రాగానే తగ్గిపోతుందనీ శాంతపడతావనీ నిద్రపోవద్దనీ ఎందుకన్నాడు శాంతస్వరంతో. పైగా దీక్షిత్‌ని శ్యామా ఇంటికెందుకు పంపాడు? అందరూ తన నుంచి వెళ్లిపో యేలా చేసుకునీ చూసుకునీ ‘అల్లాహ్(అల్లా అనే పేరుండి విశ్వమంతా నిండిన) హో(అతడు మాత్రమే) మాలిక్! (నాకు సర్వస్వం) అనే తన మంత్రాన్ని శ్యామా కోసం మననం చేస్తూ ఉండిపోయాడు సాయి. వాక్కుకి ఓ శక్తి అనేది రావాలంటే తాను నమ్మిన మంత్రాన్ని మననం చేసినప్పుడే అది సాధ్యం. అంతకుముందే ఉన్న మంత్రశక్తితో శ్యామాకున్న ప్రాణవాయువుని పోకుండా నిరోధించి, తాను చేస్తున్న మంత్ర మనన శక్తితో శ్యామా బాధనీ ఆందోళననీ విషతీవ్రతనీ తగ్గించాడు సాయి. అందుకే సాయికి ఈ విషతీవ్రతని నిరోధించడానికి ఓ రాత్రి రాత్రంతా పట్టింది. వాక్కులో మంత్ర మననశక్తి ప్రవేశిస్తే అది అనుగ్రహం కారణంగా వరంగా ఆగ్రహం కారణంగా శాపంగా మారుతుంది. అందుకే తమ సంతానాన్ని ఆశీర్వదించవలసిన అవసరం వచ్చినప్పుడు తల్లులు కొంతసేపైనా మంత్రమననాన్ని చేసి ‘బాగా పరీక్షలు వ్రాయి!’ సుఖంగా ప్రయాణం సాగాలి! అంటూ ఇలా ఆశీర్వదిస్తే అవి నెరవేరతాయి. ఒట్టిగా ‘విష్యూ ఆల్ ది బెస్ట్’ వంటి మాటలు గాలిలో కలిసి ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ప్రాణవాయువు మీద ఆధిపత్యమున్న సాయి కొందరి ప్రాణవాయువుని తొలగించిన సందర్భాలనీ చూద్దాం!
–సశేషం
ప్రాణవాయువుపైనా సాయి ప్రాభవం
Published Sun, Nov 25 2018 1:29 AM | Last Updated on Sun, Nov 25 2018 1:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment