కర్నూలు రూరల్:
కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించిన బోర్డు ఏర్పాటులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కర్నూలులో ఏర్పాటుకు కేంద్ర జల సంఘం సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజధానివైపే మొగ్గుచూపుతోంది. కృష్ణానది వరద జలాలపై నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు, కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బందులు వస్తాయంటూ అధికార పార్టీ నేతలు బోర్డును కోస్తాకు తరలించేందుకు కుట్రపన్నారు.
అందులో భాగంగా గత నెల 12న డిల్లీలో ఏర్పాటైన సమావేశంలో తప్పుడు నివేదికలను అందజేసి బోర్డు రాష్ట్ర రాజధానిలోనే ఏర్పాటు చేస్తామని నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుచే ప్రకటించడం పట్ల సీమ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే నదీ పరీవాహక పరిధిలోని ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఏర్పాటు చేసే బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగ పర్యవేక్షణకు నిబంధనల ప్రకారం నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే తుంగభద్ర బోర్డు ఏర్పాటైన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. కొత్త బోర్డు ఏర్పాటు సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన బోర్డుల పనితీరును అధ్యయనం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం.
నిబంధనల ప్రకారం కృష్ణా బేసిన్‌లోని జలాశయాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న బోర్డును ఈ బేసిన్‌లో ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీశైలం ఎగువన కాకుండా.. విజయవాడలో ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత చూపడం వివాదాస్పదమవుతోంది. నీటి లభ్యత ఆధారంగా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం, వినియోగాన్ని పర్యవేక్షించడం కృష్ణా బోర్డు పని. 10 ప్రాజెక్టులతో ముడిపడిన బోర్డు విషయంలో పార్టీలకు అతీతంగా నేతలు మేల్కొనకపోతే సీమలో సిరుల పంటలు పండించేందుకు నిర్మించిన వరద ఆధారిత ప్రాజెక్టులకు నీరందడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డు ఏర్పాటుకు కర్నూలు అనువైన ప్రాంతమని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం గమనార్హం. ఇప్పటికైనా నేతలు స్పందించి బోర్డు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కృష్ణా బోర్డు కర్నూలులో లేనట్టే
Published Tue, Oct 7 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement