ప్రాణాలు పోతున్నా పట్టదా? | Oblivion on Clinical Trials | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా పట్టదా?

Published Sun, Feb 11 2018 2:53 AM | Last Updated on Sun, Feb 11 2018 2:53 AM

Oblivion on Clinical Trials - Sakshi

క్లినికల్‌ ట్రయల్స్‌

సాక్షి, హైదరాబాద్‌ :ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదకర ఔషధ ప్రయోగాల (క్లినికల్‌ ట్రయల్స్‌)పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయోగ కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఔషధ ప్రయోగాలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదకర ప్రయోగాల కారణంగా కొందరు మృత్యువాతపడటంతోపాటు పలువురు పేదలు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూసినప్పటికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కనీస మాత్రంగా స్పందించడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. బాధితులకు చట్ట ప్రకారం అండగా నిలవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఇవేమీ చేయడంలేదు. 2017 జూన్‌లో కరీంనగర్‌ జిల్లాలో ఔషధ ప్రయోగాల కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఔషధ ప్రయోగాలపై రాష్ట్ర స్థాయిలో నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు 2017 జూలై 5న ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 30 రోజులలోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఏర్పాటై ఏడు నెలలు గడిచింది. అయితే కమిటీ ఇప్పటికీ నివేదిక రూపొందించలేదు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడం ఇప్పట్లో జరిగే పనిగా కనిపించడంలేదని వైద్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతూనే ఉన్నారు.  

రాష్ట్ర స్థాయిలోనూ చర్యలకు వీలు..  
ఔషధ ప్రయోగాల నియంత్రణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ ప్రయోగాలపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సహేతుక మార్గంలోనే ఔషధ ప్రయోగాలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రయోగాలకు అంగీకరిస్తున్నట్లుగా... ఆయా వ్యక్తులనుంచి రాత పూర్వకంగా, వీడియో రూపంలో సమ్మతిని తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. జోనల్‌ కార్యాలయాల పరిధిలో ఔషధ ప్రయోగాలు నిర్వహించే కేంద్రాల వివరాలను నమోదు చేయాలి. ఉన్నత స్థాయి కమిటీలను నియమించి ప్రయోగాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయం 2013 ఏప్రిల్‌ 26న అన్ని జోనల్‌ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ డ్రగ్‌ కంట్రోలర్‌ జోనల్‌ కార్యాలయం ఉంది. అయితే మన రాష్ట్రంలోనే అనుమతిలేని ఔషధ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? లేక తెలిసీ అధికారులు పట్టించుకోవడంలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. 

నిబంధనలు బేఖాతరు..  
ఫార్మసీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ఔషధాలను తయారు చేసి వీటిని ప్రయోగించే కాంట్రాక్టును పరీక్ష కేంద్రాలకు ఇస్తుంటాయి. ఆయా పరీక్ష కేంద్రాలు వ్యక్తులపై వాటిని ప్రయోగించి తుది ఫలితాలను క్రోడీకరిస్తాయి. దేశ వ్యాప్తంగా 84 ప్రయోగ కేంద్రాలు ఉండగా, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. ఔషధ ప్రయోగ కేంద్రాలు... డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (డీసీవో) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కేంద్రాలు అనేక సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వయసు, ప్రయోగించే ఔషధానికి శరీరం తట్టుకుంటుందా లేదా అనే అంశాలను పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యక్తుల వివరాలను నమోదు చేయకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా ఎవరు బాధితులో తెలియడంలేదు. రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement