సాక్షి, అమరావతి: ప్రజలకు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల నిర్వహణను నిత్యం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, బయోమెడికల్ పరికరాల నిర్వహణ, ఈ–హెచ్‌ఆర్ తదితర అంశాలపై పర్యవేక్షణకు ఏపీ వైద్య విధాన పరిషత్ ఈ యాప్‌ను రూపొందించింది.
వైద్య విధాన పరిషత్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 53 ప్రాంతీయ (ఏరియా) ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్ డిసీజెస్ ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 16,340 పడకల సామర్థ్యం ఉంది. ఈ ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాల పర్యవేక్షణకు ‘ఏపీ హెల్త్ సెకండరీ కేర్’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో ప్రతి ఆస్పత్రికి ఒక లాగిన్‌ను కేటాయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ఆర్‌ఎంవో ఈ యాప్‌లో లాగిన్ అయి అందులోని మాడ్యూల్స్ ఆధారంగా వివరాలను నమోదు చేయాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీకి స్కోరింగ్, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ తదితర అంశాలపై స్కోరింగ్ ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు ఎస్/నో రూపంలో సమాధానాలివ్వాలి. వాటికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో రోగుల రక్షణకు సంబంధించిన సెక్యూరిటీ విజిట్ మాడ్యూల్‌లో.. సెక్యూరిటీ గార్డ్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడా... అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. గార్డ్ అందుబాటులో ఉన్నాడని ‘ఎస్’ అని పెడితే వెంటనే లైవ్ ఫొటో అప్‌లోడ్ చేయాలని యాప్ అడుగుతుంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లైవ్ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
ఎన్‌ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా యాప్
నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఏబీహెచ్) ప్రమాణాలకు అనుగుణంగా యాప్‌లో ప్రశ్నావళిని రూపొందించాం. యాప్‌పై సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంవోలకు శిక్షణ ఇచ్చాం. యాప్‌లో ఉండే వివరాలన్నీ రాష్ట్ర డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశాం. ఎక్కడైనా సెక్యూరిటీ, శానిటేషన్ ఇతర అంశాల నిర్వహణలో లోపాలున్నట్లు యాప్‌లో నమోదు చేస్తే డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది. దాని ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా యాప్‌ను తీసుకువచ్చాం.
– డాక్టర్ వినోద్‌కుమార్, కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్
Comments
Please login to add a commentAdd a comment