బాలిక కిడ్నాప్ కేసులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం
బయట నుంచి పరికరాలు తెచ్చుకోవాలని అర్థరాత్రి వేళ సూచన
ఆ సమయంలో ప్రైవేట్ మెడికల్ షాపులు లేక పరీక్షలకు తీవ్ర జాప్యం
దాదాపు 12 గంటలు తర్వాత నిర్వహణ
సాక్ష్యాలు పోతాయేమోనని కుటుంబ సభ్యుల ఆందోళన
నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవల తీరుపై బాధితుల ఆగ్రహం
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్‌పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది.
వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.
కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
బంధువుల ఆందోళన..
ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment