పోలీస్‌ స్పందన 7 నిమిషాల్లో.. | 100 Patrol monitoring with app: telangana | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్పందన 7 నిమిషాల్లో..

Published Wed, Jan 17 2024 6:34 AM | Last Updated on Wed, Jan 17 2024 6:34 AM

100 Patrol monitoring with app: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా సంఘటన చోటుచేసుకున్న వెంటనే బాధితులు లేదా అక్కడ ఉన్నవారు వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేస్తారు. ఆ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాక ఎంత తక్కువ సమయంలో పోలీసులు ఆ స్థలానికి చేరుకుంటే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనినే సాంకేతికంగా ‘పోలీస్‌ రెస్పాన్స్‌ టైమ్‌’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్‌ జరిగేలా చూడటం తదితర లక్ష్యాలతో ఓ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా 2023కు సంబంధించి రెస్పాన్స్‌ టైమ్‌ను లెక్కించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరిన ఈ సమయం ఏడు నిమిషాలుగా ఉండగా, ఈ ఏడాది మరింత తగ్గించాలనేది పోలీసులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.  

ఒకప్పుడు ఇలా... 
ఎవరైనా ‘100’కు కాల్‌ చేస్తే, అది నేరుగా ‘డయల్‌–100’కమాండ్‌ సెంటర్‌కు చేరుతుంది. వెంటనే వారు బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేస్తారు. ఆ తర్వాత సదరు ఫోన్‌ కాల్‌లోని అంశాలను సంక్షిప్త సందేశంగా (టెక్ట్స్‌) మార్చి బాధితుడున్న ఏరియాలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్‌ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్‌ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపించేవారు. దీంతో పాటు వాకీటాకీ ద్వారానూ సమాచారం ఇచ్చి గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ వాహనం ఎక్కడ ఉంది? బాధితుడికి ఎంత దూరంలో ఉంది? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేదికాదు. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఘటనాస్థలికి చేరిన తర్వాత పెట్రోలింగ్‌ సిబ్బంది చెప్పే అంశాల ఆధారంగా ఫిర్యాదుగా పరిగణించే ఫోన్‌ కాల్‌ను క్లోజ్‌ చేసేవారు.  

ఇప్పుడు...ట్యాబ్‌నే ‘జీపీఎస్‌’ 
బాధితుడు ‘100’కు ఫోన్‌ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సిటీలోని ప్రతి గస్తీ వాహనం, బ్లూకోల్ట్స్‌లకు పోలీసు విభాగం ట్యాబ్స్‌ అందించింది. ఇవే జీపీఎస్‌ పరికరంగా పనిచేస్తుండటంతో దాని ఆధారంగా ‘డయల్‌–100’సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్‌ తెర/ట్యాబ్‌/ప్రత్యేక యాప్‌ ద్వారా కచి్చతంగా తెలుస్తుంది.

దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌ కాల్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్‌ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’నుంచి డైవర్డ్‌ అయిన కాల్‌ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్‌ ద్వారా ట్యాబ్‌లో రింగ్‌ వస్తుంది. ఫోన్‌ ఎక్కడ నుంచి అనేది తేలిగ్గా తెలియడానికి అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి రింగ్‌టోన్‌ ఏర్పాటు చేశారు. ఆ సిబ్బంది ఫోన్‌ ఎత్తిన వెంటనే ఆ ట్యాబ్‌లో తెరపై ఓ నోటిఫికేషన్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. వీటిని చూసిన వెంటనే గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్‌’అనే బటన్‌ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్టు ధ్రువీకరిస్తున్నారు. 

అలా...గణన షురూ.. 
పెట్రోలింగ్‌ వాహనం, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఒకసారి ఫిర్యాదు అందుకున్నట్టు ట్యాబ్‌లో ఉండే ‘100 యాప్‌’ద్వారా ధ్రువీకరించిన వెంటనే ‘రెస్పాన్స్‌ టైమ్‌’లెక్కింపు ప్రారంభమవుతోంది. ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందించే విధంగా సాంకేతిక చర్యలు తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. పబ్లిక్‌ ప్లేస్‌లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదు అయితే స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీంతో ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్‌ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌ ద్వారానే సంబంధిత స్టేషన్‌ హౌస్‌ఆఫీసర్‌కు పంపిస్తున్నారు. 

‘క్లోజ్‌’చేసే వరకు ‘టైమ్‌ రన్నింగ్‌’... 
గస్తీ బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడం వంటి చర్యలు పూర్తయిన తర్వాత మొదట వచ్చిన నోటిఫికేషన్‌ మళ్లీ ఓపెన్‌ చేయాలి. అందులో ఉండే ‘కాల్‌ క్లోజ్‌’బటన్‌ నొక్కడంతో ఈ వ్యవహారం పూర్తవుతుంది. అప్పటి వరకు సమయం లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్నే ‘పోలీసు రెస్పాన్స్‌ టైమ్‌’గా పరిగణిస్తున్నారు. ఫోన్‌కాల్‌ వచ్చిన దగ్గర నుంచి జరిగే ప్రతిదీ ‘డయల్‌–100’తో పాటు కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్, జోనల్‌ కార్యాలయాలకు చేరుతూ పర్యవేక్షణకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్పాన్స్‌ టైమ్‌ పట్టణాల్లో తక్కువగా, గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లోనూ తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement