మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’ | India Unemployment Rate Rises To 3-Month High Of 7. 8percent In March | Sakshi
Sakshi News home page

మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’

Published Tue, Apr 4 2023 4:45 AM | Last Updated on Tue, Apr 4 2023 4:45 AM

India Unemployment Rate Rises To 3-Month High Of 7. 8percent In March - Sakshi

ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్‌లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు  జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే..

► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్‌ (26.4%), జమ్మూ, కశ్మీర్‌ (23.1%), సిక్కిం (20.7%), బీహార్‌ (17.6%), జార్ఖండ్‌ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి.  
► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్‌ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి.  


పండుగ సీజన్‌ తర్వాత డౌన్‌
అక్టోబర్‌–జనవరి పండుగ సీజన్‌ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఈ–కామర్స్‌ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ,  టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్‌ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం,  మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్‌ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం.  
– ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ సీఈఓ, డైరెక్టర్‌

తాత్కాలికమే కావచ్చు...
నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్‌ కార్పొరేట్‌ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్‌ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్‌ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను.  
– రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ కో–ఫౌండర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement