సాక్షి, ముంబై: వర్లీ బీడీడీ చాల్స్ అభివృద్ధి పనుల భూమి పూజా కార్యక్రమానికి ఆగస్టు ఒకటో (ఆదివారం) తేదీన ముహూర్తం ఖరా రైంది. అందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా) అధికార వర్గాలు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భూమి పూజా కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగే ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే తదితర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని మాడా అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా భూమిపూజా కార్యక్రమం గతంలో కూడా ఒకసారి వాయిదా పడింది.
ఆ తరువాత ఈ నెల 27న జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. వేలాది కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సందర్భంలో నూతన గృహ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి భావించారు. అదే సందర్భంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి బయలుదేరడంతో ఆయన నాలుగైదు రోజులు బిజీగా ఉన్నారు. దీంతో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన భూమి పూజా కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు ఆగస్టు ఒకటో తేదీన మళ్లీ ముహూర్తం ఖారు చేయడంతో వర్లీ ప్రాంత వాసుల్లో ఆనందం చిగురించింది. ఈసారైన భూమిపూజా కార్యక్రమం సఫలమవుతుందా...? లేక మరేమైన అడ్డంకులు ఎదురవుతాయా..? అనే సందిగ్ధంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment