ఏపీ సర్కారుకు రూ.100 కోట్ల జరిమానా  | Rs .100 crore fine for AP Sarkar | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కారుకు రూ.100 కోట్ల జరిమానా 

Published Fri, Apr 5 2019 1:23 AM | Last Updated on Fri, Apr 5 2019 3:03 AM

Rs .100 crore fine for AP Sarkar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన తరుణ్‌ భారత్‌ సంఘ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్‌ విక్రమ్‌సోనీ, అనుమోలు గాంధీ, సత్యనారాయణ బొలిశెట్టి గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖను పిటిషన్‌గా పరిగణిస్తూ ఎన్జీటీ ఈ కేసును విచారించింది. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయిన ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నారు. తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.

పర్యావరణ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ, వేలాది ట్రక్కుల్లో తరలిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తమతో చెప్పారని లేఖలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలను వ్యతిరేకించినందుకు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు తమపై దాడులకు సైతం పాల్పడ్డారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి, స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇసుక దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ స్వరూపం ప్రమాదంలో పడుతోందని, పర్యావరణం దెబ్బతిన్నదని వివరించారు. భారీ ట్రక్కుల వల్ల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్రయవిక్రయాల్లో నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వ్యతిరేకించే రైతులపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడుతోందన్నారు. అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసేందుకు గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ లేఖను ఎన్జీటీ పిటిషన్‌గా స్వీకరించి, విచారించింది.  చర్యలపై నెల రోజుల్లోపు నివేదిక సమర్పించాలని డిసెంబరు 21న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)ని ఎన్టీజీ ఆదేశించింది.    

జరిమానా విధించడం సబబే...
తాజాగా పిటిషన్‌ గురువారం విచారణకు రాగా, పిటిషనర్ల తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2015 నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని, గతంలోనే రేలా స్వచ్ఛంద సంస్థ తరపున పిటిషన్‌ కూడా దాఖలు చేశామని నివేదించారు. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనాలు ఉన్నాయన్నారు. ఇక పిటిషన్‌లో ఉన్న అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీపీసీబీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అనుమతి లేని ఇసుక తవ్వకాలను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతంలోని ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటుంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీపీసీబీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌–ధన్‌బాద్‌ ప్రతినిధులతో కూడిన కమిటీ సంయుక్తంగా తనిఖీ చేసి, ఇప్పటివరకు జరిగిన ఇసుక తవ్వకాలు, నదులకు జరిగిన నష్టం, ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. జరిగిన నష్టంపై శాఖాధితిపతులను బాధ్యులను చేయాల్సి ఉంటుంది. అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుంది’’ అని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఇచ్చే ముందు ఏపీపీసీబీ తరపు న్యాయవాది ధనుంజయ్‌ తొలుత ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌లోని అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ నివేదిక ఉన్నందున ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement