హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ విస్తరణకు లైన్ క్లియర్
పర్యావరణ శాఖ అనుమతులు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం రిఫైనరీ విస్తరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌కు షరతులతో కూడిన పర్యావరణ అనుమతి లభించింది. 8.33 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీని రూ.18,400 కోట్ల పెట్టుబడులతో 15మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న రిఫైనరీగా విస్తరించాలని హెచ్‌పీసీఎల్ యోచిస్తోంది. గత నెలలో జరిగిన పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) సమావేశంలో ఈ రిఫైనరీ విస్తరణకు ఆమోదం లభించింది. విశాఖలో కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక విస్తరణపై నిషేధం ఉన్నదన్న కారణంగా ఈ రిఫైనరీ విస్తరణ ప్రతిపాదనను 2013లో తిరస్కరించారు. గత ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన జనవిచారణ(పబ్లిక్ హియరింగ్)లో వెల్లడైన వివిధ అంశాలపై ఈఏసీ చర్చించింది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్), ప్లాంట్ పరిసరాల్లో యాక్సిడెంట్లు, ట్రాఫిక్, పర్యావరణ కాలుష్యాలు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, స్థానికులకు ఉద్యోగవకాశాలు, నీటి సరఫరా తదితర అంశాలకు హెచ్‌పీసీఎల్ కంపెనీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని ఈఏసీ వెల్లడించింది.
సీఎస్‌ఆర్ కింద రూ.60 కోట్లు కేటాయించాలని, కొన్ని పనులకు కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ ఈ రిఫైనరీ విస్తరణకు ఈఏసీ పచ్చజెండా ఊపింది. కాగా హిందూస్తాన్ పెట్రో కెమికల్స్(హెచ్‌పీసీఎల్)కు ముంబైలో ఒకటి, విశాఖలో ఒకటి మొత్తం రెండు రిఫైనరీలు ఉన్నాయి. ముంబైలో ఉన్న 7.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9.5 మిలయన్ టన్నులకు పెంచుకోవాలని కూడా హెచ్‌పీసీఎల్ ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ జరపాలని, వెల్లడైన విషయాలను, అభ్యంతరాలపై కంపెనీ తన వ్యాఖ్యలను కూడా జతపరచి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈఏసీ ఆదేశించింది.