![Palamuru Rangareddy Lift Irrigation scheme gets Environmental Clearance - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/11/PALAMURU.jpg.webp?itok=xOoyLim1)
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి..
పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్‌పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది.
ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే..
పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది.
రూ.106 కోట్ల జరిమానా..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది.
ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్‌ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది.
కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే!
పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది.
కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి.
నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి
- పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి.
- ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి.
- అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్‌షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.
- ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి.
- ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి.
Comments
Please login to add a commentAdd a comment