
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు స్వీకరించారు. ‘ప్రజలు, లాభం, భూమి’అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను ప్రధానికి ఈ అవార్డు ఇచ్చినట్లు అవార్డు కమిటీ తెలిపింది. ‘ఆయన చేస్తున్న నిస్వార్థ సేవ, అవిశ్రాంత కృషి వల్ల ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధించింది’అని కమిటీ పేర్కొంది.
మోదీ పాలనలో దేశం నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, తయారీ రంగానికి ప్రాముఖ్యత పెరిగి ఐటీ, ఎకౌంటింగ్, ఫైనాన్స్ వంటి సేవలకు భారత్ గ్లోబల్ హబ్‌గా మారిం దని చెప్పింది. మోదీ నాయకత్వం ఆధార్ వంటి డిజిటల్ విప్లవాలకు నాంది పలికి.. సామాజిక ప్రయోజనాలు చేకూరేందుకు దోహదం చేసిందని తెలిపింది. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఫిలిప్ కోట్లర్ ఏటా ఈ అవార్డు అందిస్తారు. ప్రస్తుతం ఫిలిప్ కోట్లర్ (87) అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీలోని కల్లొజ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అనారోగ్యంతో కోట్లర్ ఢిల్లీ రాలేకపోయారు. ఆయన తరఫున జార్జియాలోని ఈఎంఓఆర్‌వై వర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ సేత్, కమిటీ ప్రతినిధులు అవార్డు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment