ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్‌లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి?
గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్‌లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రీయంగా లెక్కేస్తారు..
జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు.
నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము.
- ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
ఎరుపు
- జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క.
- వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే...
- పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్‌లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం
- మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి..
కాషాయం
పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది..
పచ్చ
మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు.
నీలం
నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు.
- సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment