Jala mandali
-
హైదరాబాద్: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు(బుధ, గురు) నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని జలమండలి వెల్లడించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం కలుగుతుంది.ఎన్పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. -
‘ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇది సరైన సమయం’
సాక్షి, హైదరాబాద్ : ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపట్టాలని, ఈ వేసవి కాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడ జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జలమండలి రూపొందించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ థీమ్ పార్కు.. విద్యార్థులు, నగరవాసులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. (ఫ్యాన్ అత్యుత్సాహం: కేటీఆర్ ఏమన్నారంటే..) ఇదే సరైన సమయం జలమండలి రూపొందించిన దాదాపు 42 నీటి సంరక్షణ నమానాలు, పద్ధతులు విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. నేడు నీటిని సంరక్షిస్తేనే రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి ఇక్కట్లు ఉండవని తెలిపారు. అలాగే ఇప్పడు ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణపై పెద్ద ఎత్తున తగిన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో వర్షాకాలానికి ముందే చైతన్యం తీసుకువచ్చేందుకు ఇది సరైన సమయం అని కేటీఆర్ తెలిపారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలను ఇస్తాయని, భూగర్భ నీటి మట్టాలు పెరుగుతాయని తెలిపారు. (కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుతో కేటీఆర్ భేటీ ) జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుంది థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమానాలను మంత్రి తిలకించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ అభివృద్దిలో జలమండలి తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందని, ఇంకా స్వయం సమృద్ది సాధించడానికి, నగరవాసులకు మెరుగైన సేవల కోసం జలమండలి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.అలాగే జలమండలి ప్రధాన నగరంలో మంచినీటి సరఫరా చేసిన జలమండలి ఓఆర్ఆర్ గ్రామాల్లో సైతం మంచినీటి సరఫరా చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ ప్రాజెక్టును 193 గ్రామాల్లో పనులు చేపట్టి, మంచినీటి సరఫరా చేపడుతుందని కేటీఆర్ వివరించారు. (ఢిల్లీ అల్లర్లు: ఆ తల్లి పిల్లలతో సహా..!) వేసవికాలంలో ఓఆర్ఆర్ గ్రామాల్లో నీటి ఇక్కట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలాగే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న సెవరెజీ నిర్వహణను మార్చి 1 నుంచి జలమండలి చేపడుతుందని తెలిపారు. విషయంలో పక్కా ప్రణాళికతో అయా ప్రాంతాల్లోని సెవరెజీ నిర్వహణకు సన్నద్దం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. -
రంగు పడుద్ది
ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కేస్తారు.. జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు. నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము. - ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎరుపు - జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క. - వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే... - పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం - మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి.. కాషాయం పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది.. పచ్చ మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు. నీలం నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..
సాక్షి, హైదరాబాద్ : చెన్నై, ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్‌లో నీటి సమస్య అంతగా లేదని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఆగస్టు చివరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నగరానికి వస్తాయని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేశవాపురం, దేవులమ్మ నాగరం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి 172 ఎమ్‌జీడీ, కృష్ణా నుంచి 270ఎమ్జీడీల నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సాగర్‌లో నీటి మట్టం తగ్గినా.. ఇంకా అయిదేళ్ల వరకు హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వాటర్ ట్యాంకర్స్‌కు డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో 50 ఎమ్‌జీడీ నీళ్లు వృధా అవుతున్నాయన్నారు. నీటిని వృధా చేస్తే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. 56 రిజర్వాయర్లు పూర్తి అయ్యాయని, వాటి ద్వారా శివారు ప్రాంతాల్లో నీటిని ఇస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 154 రిజర్వాయర్లు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రేటెడ్ కమ్యూనిటీల నీటి కష్టాలను త్వరలో తీర్చబోతున్నామన్నారు. ఓఆర్ఆర్ లోపల మొత్తం జలమండలి నుంచే నీళ్లు ఇస్తామని తెలిపారు. జలమండలి ప్రాజెక్ట్స్ కోసం హడ్కో రూ. 200 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కంటోన్మెంట్ నీటి సమస్య తీరిందని, రింగ్ మెయిన్ వస్తే 150 కిలోమీటర్ల మేర నీటి సమస్య తీరుతుందని అన్నారు. షా ఏజెన్సీ ద్వారా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తున్నామని తెలిపారు. 54 ఎస్టీపీలు కడుతున్నామని, కూకట్ పల్లి చెరువును సుందరంగా చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాల్లో 50 ఇంజక్షన్ బోర్ వేల్స్ వేస్తున్నామని, దీని ద్వారా రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండటమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించారు. -
ప్రఖ్యాత నగరం.. నీటి సరఫరా అంతంతమాత్రం..
సాక్షి, శంషాబాద్: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శంషాబాద్ పట్టణంలో తాగునీటి సౌకర్యం లేక పలు కాలనీలు అల్లాడుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు నీటి సరఫరా బాధ్యత జలమండలి తీసుకోవడంతో ఇక్కడ పంచాయతీ చేతిలో ఏమీ లేకుండా పోయింది. జలమండలి అన్ని ఆవాసాలకు మంచినీరందించే పనిని చేపట్టడం లేదు. ఫలితంగా శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, సిద్దేశ్వరకాలనీ, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీలో నీటి సరఫరా లేక పదిహేను రోజులుగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించాలని సూచించారు. వీలైనంత త్వరగా సంబంధిత కాలనీలకు మంచినీటి సరఫరా చేపట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి పనిపూర్తి చేయాలని ఆదేశించారు. అయినా సదరు శాఖ అధికారులు నీటి సరఫరాపై తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎందుకిలా..? శంషాబాద్‌లోని పాత గ్రామానికి నాలుగున్నరేళ్లుగా జలమండలి అధికారులు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీలోని మిగతా ప్రాంతాలకు పంచాయతీ నుంచి బోరు నీటిని సరఫరా చేసేవారు. అయితే, కొంత కాలంగా ఔటర్ రింగ్‌రోడ్డు లోపు పూర్తి ఆవాసాలకు నీటి సరఫరాను అందించే బాధ్యతను ప్రభుత్వం జలమండలికి అప్పగించింది. దీంతో పంచాయతీ అధికారులు నూతనంగా ఎలాంటి పనులూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. శంషాబాద్‌లోని జాతీయ రహదారికి అవతల ఉన్న ప్రాంతంలో అర్బన్ మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో ఇక్కడ కృష్ణా నీటి సరఫరా ప్రారంభం కాలేదు. గతంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో పంచాయతీ అధికారులు కూడా వాటిని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యను పంచాయతీ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో రెండుమార్లు జలమండలి అధికారులకు విన్నవించారు. అయినా సంబంధిత అధికారులు ఆయా కాలనీలకు మంచినీటి సరఫరాను అందించే ప్రక్రియపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పడిపోయిన నీటిమట్టం శంషాబాద్ పట్టణంలో మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొచ్చాయి. అద్దెకు నివాసముండే వారు పెరిగిపోయారు. దీంతో ఇళ్ల యజమానులు 1000 నుంచి 1500 ఫీట్ల వరకు బోర్లు వేశారు. విచ్చలవిడిగా తవ్విన బోర్లతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటాయియి. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు బోర్ల వరకు ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు హాస్టళ్ల నిర్వహిస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడి జనాభాకు అనుగుణంగా పంచాయతీ నీటి సరఫరాను అందించలేకపోతోంది. మరో వైపు కృష్ణా నీటి సరఫరా చర్యలు కూడా లేకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమం చేయడంతో పాటు అక్రమ బోర్లును అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటి ఇబ్బంది చాలా ఉంది స్థానికంగా నీటి ఇబ్బంది చాలా ఉంది. కృష్ణా నీటి సరఫరా చేపట్టాలి. కాలనీలో బోర్లు ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. సరైన నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం – కె. సత్యనారాయణ– మధురానగర్ స్పందించడం లేదు.. పంచాయతీ పరిధిలోని ఔటర్ లోపలి ప్రాం తాలకు నీటి సరఫరా చేయాల్సిన జల మండలి పట్టించుకోవడం లేదు. పంచాయతీలోని ఔటర్ అవతలి భాగంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సత్వరమే స్పందిస్తున్నారు. పంచాయతీ చేతిలో సమస్యను పరిష్కరించేందుకు అవకాశం లేదు. జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. సత్వరమే కాలనీలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. –రాచమల్ల సిద్దేశ్వర్, శంషాబాద్ సర్పంచ్ -
జలమండలికి రూ.1,420.5 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో జలమండలికి ఆశాభంగమే ఎదురైంది. జలమండలి రూ.2,915 కోట్లు ప్రతిపాదించగా... ప్రభుత్వం అందులో సగమే రూ.1,420.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులు గతేడాదితో సమానం కావడం గమనార్హం. ప్రస్తుత నిధుల్లో కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ పథకాలకు జలమండలి హడ్కో సంస్థ నుంచి తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు రూ.670.5 కోట్లు కేటాయించింది. మరో రూ.750 కోట్ల నిధులతో కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణం, ప్రధాన నగరం, శివార్లు, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో మంచినీటి వసతుల కల్పన, రోజూ నీళ్లు (డైలీ వాటర్ స్కీమ్), రక్షిత మంచినీటి ప్రణాళిక అమలు, మూసీకి ఆనుకొని మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం, కోర్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అధునికీకరణ, ఔటర్ చుట్టూ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు, నాన్ రెవెన్యూ వాటర్ తగ్గింపు, నీటి మీటర్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు వీటిని వ్యయం చేయాలని నిర్దేశించడం విశేషం. కాగా పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డుకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ.5,200 కోట్ల రుణాలు భారంగా పరిణమించాయి. మరోవైపు ప్రతి నెలా రూ.95 కోట్ల రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ... విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు వెరసి ప్రతి నెలా ఖర్చు రూ.130 కోట్లవుతోంది. దీంతో ప్రతి నెలా రూ.35 కోట్ల లోటుతో బోర్డు నెట్టుకొస్తోంది. జలమండలికి 2016–17లో రూ.వెయ్యి కోట్లు, 2017–18లోరూ.1420.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. -
జలమండలిలో భారీ అవినీతి!
హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (జల మండలి)లో భారీ అవినీతి జరిగిందని, తనకు ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ ఆ సంస్థ ఎండీ జగదీశ్.. రూ. 54 కోట్ల విలువైన పనులకు టెండర్లు చేపట్టడమే అందుకు రుజువని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. జలమండలి చైర్మన్ గా ఉన్న సీఎం కేసీఆర్.. ఈ అవినీతి బాగోతాన్ని పట్టించుకోకపోవడం ఆయనకు పాలనపై పట్టులేదని విషయాన్ని రూఢీచేస్తున్నదని విమర్శించారు. సోమవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అవినీతిని ఏమాత్రమూ సహించబోనన్న ముఖ్యమంత్రి.. తన సొంత శాఖలో జరుగుతున్న అవినీతిని ఉపేక్షిస్తుండటం దారుణమన్నారు. జలమండలి ఎండీ జగదీశ్ పై తక్షణమే ఏసీబీ విచారణకు ఆదేశించి, ఆయనను విధుల నుంచి తొలగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ సాధనకోసం ధర్నాచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేయడం అప్రజాస్వామికమన్నారు. నాటి నిజాం కూడా కేసీఆర్ అంతటి నిరంకుశంగా వ్యవహరించలేదన్నారు. అక్రమ అరెస్టులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, టీ కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. -
జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కీల కమైన మంచినీటి సరఫరా విభా గం జలమండలికి ప్రభుత్వం ఇద్దరు కొత్త సారథులను నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎం.జగదీశ్వర్ (1993 బ్యాచ్ ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అహ్మద్ బాబు (2003 బ్యాచ్ ఐఏఎస్) నియమితులయ్యారు. జగదీశ్వర్ గతంలో రెండున్నరేళ్లకుపైగా జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా పనిచేసిన జె.శ్యామలరావును తప్పించారు. ఆయన ఏపీ సర్కార్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చినందునే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలి సింది. ఆయన సుమారు 22 నెలలుగా ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. జలమండలి ఈడీగా ఉన్న జగన్మోహన్ ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడి కలెక్టర్ అహ్మద్ బాబు జలమండలి ఈడీగా నియమితులయ్యారు. బదిలీల్లో కన్పించిన హరీష్‌రావు మార్క్..! జలమండలి ఎండీ, ఈడీల బదిలీ విషయంలో బోర్డు గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులైన ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. గతంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన ఎం.జగదీశ్వర్‌కు హరీష్‌రావు ఆశీస్సులున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు తిరిగి కీలకమైన ఎండీ బాధ్యతలు అప్పగించడంలో హరీష్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కలెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈడీ డాక్టర్ జగన్మోహన్కు ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు దక్కడం వెనుక హరీష్‌రావు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ఎండీకి సమస్యలే స్వాగత తోరణం.. మూడున్నరేళ్లవిరామం తర్వాత తిరిగి జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.జగదీశ్వర్‌కు పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అవి.. వివాదాస్పదమైన జీపీఈ(జనరల్ పర్పస్ ఎంప్లాయ్) పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం. బోర్డులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులకు న్యాయం చేయడం.సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న మంచినీటిలో సరఫరా నష్టాలను 40 నుంచి 20 శాతానికి తగ్గించాల్సి ఉంది.జలమండలికి రావాల్సిన రూ.200 కోట్ల నీటిబిల్లులను వసూలు చేయాలి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి వసతులను కల్పించాలి. ఇందుకోసం జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశ కింద మంజూరైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ జలమండలి నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన జగదీశ్వర్ గురువారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ప్రస్తుత ఎండీ శ్యామలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన విధుల్లో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.