సాక్షి, హైదరాబాద్ : చెన్నై, ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్‌లో నీటి సమస్య అంతగా లేదని జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఆగస్టు చివరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నగరానికి వస్తాయని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేశవాపురం, దేవులమ్మ నాగరం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి 172 ఎమ్‌జీడీ, కృష్ణా నుంచి 270ఎమ్‌జీడీల నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సాగర్‌లో నీటి మట్టం తగ్గినా.. ఇంకా అయిదేళ్ల వరకు హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వాటర్ ట్యాంకర్స్‌కు డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో 50 ఎమ్‌జీడీ నీళ్లు వృధా అవుతున్నాయన్నారు. నీటిని వృధా చేస్తే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. 56 రిజర్వాయర్లు పూర్తి అయ్యాయని, వాటి ద్వారా శివారు ప్రాంతాల్లో నీటిని ఇస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 154 రిజర్వాయర్లు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.
గ్రేటెడ్ కమ్యూనిటీల నీటి కష్టాలను త్వరలో తీర్చబోతున్నామన్నారు. ఓఆర్‌ఆర్ లోపల మొత్తం జలమండలి నుంచే నీళ్లు ఇస్తామని తెలిపారు. జలమండలి ప్రాజెక్ట్స్ కోసం హడ్కో రూ. 200 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కంటోన్మెంట్ నీటి సమస్య తీరిందని, రింగ్ మెయిన్ వస్తే 150 కిలోమీటర్ల మేర నీటి సమస్య తీరుతుందని అన్నారు. షా ఏజెన్సీ ద్వారా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తున్నామని తెలిపారు. 54 ఎస్‌టీపీలు కడుతున్నామని, కూకట్ పల్లి చెరువును సుందరంగా చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాల్లో 50 ఇంజక్షన్ బోర్ వేల్స్ వేస్తున్నామని, దీని ద్వారా రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండటమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment