జలమండలిలో భారీ అవినీతి!
హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (జల మండలి)లో భారీ అవినీతి జరిగిందని, తనకు ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ ఆ సంస్థ ఎండీ జగదీశ్.. రూ. 54 కోట్ల విలువైన పనులకు టెండర్లు చేపట్టడమే అందుకు రుజువని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
జలమండలి చైర్మన్ గా ఉన్న సీఎం కేసీఆర్.. ఈ అవినీతి బాగోతాన్ని పట్టించుకోకపోవడం ఆయనకు పాలనపై పట్టులేదని విషయాన్ని రూఢీచేస్తున్నదని విమర్శించారు. సోమవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. అవినీతిని ఏమాత్రమూ సహించబోనన్న ముఖ్యమంత్రి.. తన సొంత శాఖలో జరుగుతున్న అవినీతిని ఉపేక్షిస్తుండటం దారుణమన్నారు.
జలమండలి ఎండీ జగదీశ్ పై తక్షణమే ఏసీబీ విచారణకు ఆదేశించి, ఆయనను విధుల నుంచి తొలగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ సాధనకోసం ధర్నాచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేయడం అప్రజాస్వామికమన్నారు. నాటి నిజాం కూడా కేసీఆర్ అంతటి నిరంకుశంగా వ్యవహరించలేదన్నారు. అక్రమ అరెస్టులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, టీ కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు.