ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్‌లో జలమండలికి ఆశాభంగమే ఎదురైంది. జలమండలి రూ.2,915 కోట్లు ప్రతిపాదించగా... ప్రభుత్వం అందులో సగమే రూ.1,420.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులు గతేడాదితో సమానం కావడం గమనార్హం. ప్రస్తుత నిధుల్లో కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ పథకాలకు జలమండలి హడ్కో సంస్థ నుంచి తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు రూ.670.5 కోట్లు కేటాయించింది. మరో రూ.750 కోట్ల నిధులతో కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణం, ప్రధాన నగరం, శివార్లు, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో మంచినీటి వసతుల కల్పన, రోజూ నీళ్లు (డైలీ వాటర్ స్కీమ్), రక్షిత మంచినీటి ప్రణాళిక అమలు, మూసీకి ఆనుకొని మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం, కోర్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అధునికీకరణ, ఔటర్ చుట్టూ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు, నాన్ రెవెన్యూ వాటర్ తగ్గింపు, నీటి మీటర్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు వీటిని వ్యయం చేయాలని నిర్దేశించడం విశేషం.
కాగా పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డుకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వివిధ సంస్థల నుంచి సేకరించిన రూ.5,200 కోట్ల రుణాలు భారంగా పరిణమించాయి. మరోవైపు ప్రతి నెలా రూ.95 కోట్ల రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ... విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు వెరసి ప్రతి నెలా ఖర్చు రూ.130 కోట్లవుతోంది. దీంతో ప్రతి నెలా రూ.35 కోట్ల లోటుతో బోర్డు నెట్టుకొస్తోంది. జలమండలికి 2016–17లో రూ.వెయ్యి కోట్లు, 2017–18లోరూ.1420.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment