waste of water
-
నీటి వృథాపై ఢిల్లీ జల్‌బోర్డు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడి వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పక్క కరువుతో తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.వాటర్‌ట్యాంకులు ఓవర్‌ఫ్లో అయినా, మంచి నీటితో కార్లు, ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా ఫైన్ కట్టాల్సిందేనని వాటర్ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృథా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్‌బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
వ్యర్థాలతో పోషక జలం!
కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి. సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్లో నీటిలో నుంచి తొక్కలు, ముక్కలను బయటకు తీసి లేదా వడకట్టి.. ఆ పోషక జలాన్ని మొక్కల కుండీల్లో పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే.. మొక్కలు అంతకుముందు కన్నా కళగా, ఏపుగా పెరుగుతుండటం గమనించవచ్చు. మిగిలిన వ్యర్థాలను మీరు ఇప్పటికే కంపోస్టు తయారు చేస్తూ ఉన్నట్లయితే కంపోస్టు పిట్ లేదా పాత్రల్లో వేయండి. ఒకవేళ.. ఇంకా కంపోస్టు తయారు చేయడం ప్రారంభించకపోతే.. ఆ వ్యర్థాలను కూడా బయట పారేయనక్కర లేదు. అందుకు ఇంకో ఉపాయం ఉంది. కూరగాయలు, పండ్ల తొక్కలను.. నీటి లో నుంచి బయటకు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. దాన్ని పోషక జలంతో కలిపి కుండీలు, మడుల్లో మీరు పెంచుకుంటున్న ఇంటిపంటలకు పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పోషక జలం మరీ చిక్కగా లేకుండా మట్టిలో ఇంకిపోయేలా ఉండేలా చూసుకోవాలి. పెరట్లో పెరిగే చెట్లకు కూడా పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది. -
రంగు పడుద్ది
ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కేస్తారు.. జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు. నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము. - ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎరుపు - జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క. - వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే... - పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం - మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి.. కాషాయం పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది.. పచ్చ మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు. నీలం నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
జిల్లా వాటాకు కర్ణాటక గండి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ఆలూరు రూరల్/ హాలహర్వి: జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల ప్రధాన సాగు, తాగునీటి వనరు అయిన తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు కర్ణాటకలోని మోకా సమీపంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పడిన చిన్న గండి అనుమానాలకు తావిస్తోంది. ఈ గండి ద్వారా సుమారు 600 క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. నీటి ఉధృతిని తట్టుకోలేక సహజంగా ఈ గండి పడిందా.. లేదా కర్ణాటక రైతులే గండి కొట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎల్లెల్సీ నీటి కోసం కర్ణాటక, కర్నూలు జిల్లా రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న ఆంధ్ర వాటా నీటిపై కన్నేసిన కర్ణాటక రైతులు ఏటా జల చౌర్యానికి పాల్పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల కాలువ కింద కర్ణాటక పరిధిలో నాన్ ఆయకట్టు ప్రతి యేటా పెరుగుతోంది. ఎల్లెల్సీ పొడవు 324 కి.మీ. 0 నుంచి 130 కి.మీ వరకు కర్ణాటక రాష్ట్రంలోనూ, 131 నుంచి 324 కి.మీ. వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ ఉంది. కర్ణాటక పరిధిలో కాలువకు ఎప్పుడు, ఎక్కడా గండ్లు పడవు. పూర్తిగా ఆంధ్ర పరిధిలో ఉన్న కాలువకు కూడా గండ్లు పడిన దాఖలాలు లేవు. కేవలం కర్ణాటక రైతుల భూములు ఉన్న మోకా వద్ద మాత్రమే ప్రతి ఏటా గండ్లు పడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నాన్ ఆయకట్టు కోసమే గండ్లు కర్ణాటక పరిధిలో సుమారు 60 వేల ఎకరాలు నాన్ ఆయకట్టు సాగవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ప్రతి యేటా జలచౌర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం. గత వారం తుంగభద్ర డ్యామ్ నుంచి 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు సోమవారం ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మోకా వద్దకు చేరాయి. ఈ నీటికి గండి కొట్టేందుకు కర్ణాటక రైతులు ముందే ఏర్పాట్లు చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. నాన్ ఆయకట్టులో వరి నారుమళ్లు ఉన్నాయి. వరి నాట్ల సమయం కావటంతో నీరు అవసరం. అందుకే కర్ణాటక రైతులు ముందుచూపుతో కాలువకు అక్కడక్కడా రంధ్రాలు చేసినట్లు సమాచారం. ఈ చిన్న రంధ్రాలే గండ్లుగా మారుతున్నాయి. ఇలాగే కొనసాగితే కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలులో బుధవారం జరుగుబోయే నీటిపారుదల సలహా మండలి భేటీలోనైనా పాలకులు, అధికారులు స్పందించి గట్టి నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. గండిపై గండి.. గతేడాది అక్టోబర్ 24న దిగువ కాలువ మైలురాయి 119/6-120 మధ్యలో కుడివైపు కాలువ లైనింగ్ దెబ్బతిని పెద్దఎత్తున గండి పడింది. ఆ గండి ద్వారా అప్పట్లో ఒక టీఎంసీ నీరు బయటకు వృథాగా పోయింది. ప్రస్తుతం పడిన గండి కూడా గతంలో పడిన గండికి కొంత దూరంలోనే ఉంది. కర్ణాటక ఆయకట్టు, నాన్ ఆయకట్టు రైతులు కాలువకు ఇరువైపులా పైపులను వేసి అక్రమ జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఆ సమయంలో కాలువ పైభాగంలో కొంతమేర తవ్వి కట్ట కింది భాగంలో ఉన్న చోట పైపులను వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల కట్ట పైభాగం, కింది భాగంలో పైపుల లీకేజి వల్ల కాలువ దెబ్బతింటుందంటూ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు అక్రమ జలచౌర్యాన్ని అరికట్టడం, కాలువ భద్రతను కాపాడడం లేదంటూ వాపోతున్నారు.