అక్రమ లేఅవుట్‌లపై కొరడా
-
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో మూకుమ్మడి దాడులు
-
పెద్ద ఎత్తున హద్దురాళ్ల తొలగింపు
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్ వెంచర్లపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకాధికారులు, ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్‌లలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించారు.
ప్రత్యేకాధికారులుగా మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి, మందమర్రి, కాసిపేట, నిర్మల్, జైపూర్, బెల్లంపల్లి ఈవోపీఆర్డీలు శంకర్, సత్యనారాయణ, ఎ.శివక్రిష్ణ, నసీరుద్దీన్, మేఘమాల, మోహన్, సతీశ్, వివేక్ ఉన్నారు. ముల్కల్ల, హాజీపూర్, దొనబండ, గుడిపేట, వేంపల్లి, తీగల్‌పహాడ్, నస్పూర్, పడ్తనపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో రియల్ వ్యాపారులు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్ వెంచర్లలోని హద్దురాళ్లను వీరు తొలగించారు.
అందంగా ముస్తాబు చేసిన వెంచర్లలోని హద్దురాళ్లతో పాటు బీటీ రోడ్లను కూడా బ్లేడ్ ట్రాక్టర్‌తో తవ్వించారు. నస్పూర్‌లో 17 ఎకరాలు, వేంపల్లిలో 37, తీగల్‌పహాడ్‌లో 11, ముల్కల్లలో 32, హాజీపూర్‌లో 6, దొనబండలో 2, పడ్తనపల్లిలో 4, నర్సింగాపూర్‌లో 3, గుడిపేటలో 7 ఎకరాల్లో హద్దురాళ్లను తొలగించారు. ఈ మొత్తం 120 ఎకరాలు. ఈ హద్దురాళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు శ్రీనివాస్, అజ్మత్‌అలీ, ప్రదీప్, సఫ్దర్‌అలీ, శ్రీధర్, శ్రీపతి బాపు, సమ్మిరెడ్డి, కారోబార్లు పాల్గొన్నారు.
చర్యలు తప్పవు
మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా లే అవుట్ చేసి వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తప్పవని మంచిర్యాల డివిజినల్ పంచాయతీ అధికారి(డీఎల్‌పీవో) వేముల శేఖర్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ లే అవుట్ల ద్వారా అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మూకుమ్మడి దాడులు నిర్వహించామని తెలిపారు.
ప్రజలు మోసపోవద్దు!
అక్రమ లే అవుట్‌లో ఏర్పాటు చేసిన ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని ప్రజలకు డీఎల్‌పీవో సూచించారు. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. 2012 నుంచి వరుసగా ఇప్పటి వరకు రియల్ వ్యాపారులకు నోటీసులు పంపినా స్పందన లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ లే అవుట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.