ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ
కొల్చారం(నర్సాపూర్): ఆస్తికోసం సొంత బావల చేతిలోనే బావమరిది హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొంగోటి శేకులు (23) తండ్రి నర్సింలు మూడేళ్ల క్రితమే చనిపోయాడు. మృతుడికి ముగ్గురు అక్క చెల్లెలు. శేకులు పేరుపై గ్రామ సమీపంలో రెండు, ఏడుపాయల సమీపంలోని కురువగడ్డలో మరో రెండు ఎకరాల పొలం ఉంది. స్వగ్రామంలో ఇటీవల రూ.20 లక్షలతో ఇల్లు నిర్మించాడు. కాగా శేకులు తల్లి పోచమ్మతో తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో విసిగి పోయిన తల్లి కూతుళ్లకు ఈ విషయం చెప్పింది.
దీంతో అదే రోజు సాయంత్రం కూతుళ్లు తమ భర్తలను వెంటబెట్టుకొని అప్పాజీపల్లికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి కుల సంఘం చిట్టి మీటింగ్ ఉండడంతో వారి వద్దకు వెళ్లిన పోచమ్మ తన గోడును వెల్లబోసుకుంది. దీంతో వారు శేకులును పిలిపించి మాట్లాడుతామని ఆమెకు సర్ది చెప్పారు. మరుసటి రోజు(మంగళవారం) తల్లి, కొడుకు మధ్య ఉన్న వైరాన్ని మాట్లాడేందుకు సంఘం పెద్దలు సమావేశమై తల్లి కొడుకును పిలిపించేందుకు ఇంటికి మనిషిని పంపించినట్లు తెలిపారు. అంతలోనే శేకులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అతని అక్క చెల్లెలు, బావలు ఏడుస్తుండడం గమనించిన వ్యక్తి సంఘం పెద్దలకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి వెళ్లిన గ్రామ పెద్దలు అక్కడికి వెళ్లి చూడగా ఆత్మహత్యకు సంబంధించి అనుమానం వ్యక్తం కావడంతో, వెంటనే కొల్చారం ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్‌కు సమాచారం అందజేశారు. మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కి సమాచారం చేరవేసి క్లూస్ టీంను రప్పించినట్లు తెలిపారు. క్లూస్ టీం ఆధారాల కోసం వెతుకుతుండగా ఇంట్లోని ఓ మూలన డ్రమ్ములో రక్తపు మరకలతో కూడిన శేకులు ప్యాంటు, చొక్కా, రక్తపు మరకలతో కూడిన కరల్రు లభించినట్లు తెలిపారు. మృతుని తల్లి పోచమ్మ ద్వారా వివరాలు తెలుసుకున్న డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. శేకులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియాసుపత్రికి తరలించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఆస్తి కోసం హత్య..
శేకులు పేరుమీద భూమి, ఇల్లుకు సంబంధించి దాదాపు రూ.రెండు కోట్ల ఆస్తి ఉంటుందని, ఈ విషయంలోనే అతని అక్క చెల్లెల్లు తరచూ ఆస్తి విషయమై గొడవ పడేవారని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆస్తి కోసమే అతని బావలు శేకులును కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానాలను వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment